అనీష్, అనస్వర రాజన్ జంటగా మహేష్ ఉప్పల తెరకెక్కించిన చిత్రం ‘ఇట్లు అర్జున’. నాగార్జున సమర్పణలో వెంకీ కుడముల నిర్మించారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతున్న సందర్భంగా థాంక్ యూ మీట్ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ ‘హీరో అనీష్ చాలా అదృష్టవంతుడు. ఇండస్ట్రీ అంతా ఒక డెబ్యూ హీరోను ఇంతలా సపోర్ట్ చేయడానికి కారణం నా మిత్రుడు మహేష్ రెడ్డి. వ్యాపారంలో ఉన్నత స్థాయిలో ఉన్నప్పటికీ సినిమాపై ఉన్న ప్రేమతో గతంలో నాగార్జున గారితో సినిమాలు నిర్మించారు. వాళ్ల అబ్బాయికి కూడా సినిమాలపై ఆసక్తి కలగడంతో ప్రోత్సహించారు.
ఇక గత రెండేళ్లుగా చిన్న సినిమాలు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను కూడా ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. పరిశ్రమ కొత్తవాళ్లతో కళకళలాడుతోందంటే దానికి కారణం యంగ్ టాలెంట్. యువ రచయితలు, దర్శకులు సినిమా పరిశ్రమకు కొత్త ఉత్సాహాన్ని, ఊపును తీసుకొచ్చి ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నారు. ఈ సినిమా వెనుక కూడా చక్కని యంగ్ టీమ్ ఉంది. వారికి నా అభినందనలు’ అని చెప్పారు.
కొత్త టాలెంట్‌ను, కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులు ఎంతో ఎంకరేజ్ చేస్తారని ఈ చిత్ర విజయంతో మరోసారి ప్రూవ్ అయిందని నాగార్జున అన్నారు. ఇంతమంది స్టార్ట్స్ తనను సపోర్ట్ చేయడం అదృష్టంగా భావిస్తున్నానంటూ, విజయాన్ని ఇచ్చిన తెలుగు ప్రేక్షకులకు హీరో అనీష్ థ్యాంక్స్ చెప్పాడు. హీరోయిన్ అనస్వర రాజన్, దర్శకుడు మహేష్ ఉప్పల, నిర్మాత వెంకీ కుడుముల, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తదితరులు పాల్గొన్నారు.
