వన్యప్రాణుల వేటగాళ్లపై కేసు: దుప్పిని వేటాడి మాంసం వండుకున్న ఐదుగురు వ్యక్తులు

వన్యప్రాణుల వేటగాళ్లపై కేసు: దుప్పిని వేటాడి మాంసం వండుకున్న ఐదుగురు వ్యక్తులు

బెల్లంపల్లి రూరల్, వెలుగు: వన్యప్రాణిని విద్యుత్ తీగలతో వేటాడి, మాంసం వండుకొని తిన్న ఘటనలో నెన్నెల మండలం మన్నెగూడం గ్రామానికి చెందిన ఐదుగురిపై బుధవారం కేసు నమోదు చేసినట్లు కుశ్నపల్లి రేంజ్ ఆఫీసర్ దయాకర్, రెబ్బెన ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ బాలకృష్ణ తెలిపారు. వారు తెలిపిన వివరాల ప్రకారం.. మూడు రోజుల కింద మన్నెగూడానికి చెందిన కొమురెల్లి బాపురావు, ఎడ్ల భీమేశ్, భట్టు సమ్మయ్య, గొలుసుల మల్లేశ్, లగ్గామ వెంకటేశ్​ గ్రామ శివారులోని పంట పొలాల వద్ద విద్యుత్ తీగలు అమర్చారు. వాటికి చుక్కల దుప్పి తగిలి స్పాట్​లోనే మృతి చెందింది.

అనంతరం దుప్పిని తీసుకెళ్లి మాంసంగా కోసి వండుకున్నట్లు తెలిపారు. పక్కా సమాచారంతో అటవీ శాఖ ఆఫీసర్లు నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించగా, వండిన దుప్పి మాంసం లభ్యమైనట్లు వెల్లడించారు. ఈ ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నట్లు రేంజ్ ఆఫీసర్ తెలిపారు. విచారణ అనంతరం తదుపరి చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.