- 2027 నాటికి గౌరవెల్లి ప్రాజెక్టు పూర్తి.. ఆ బాధ్యత నాదే
- హుస్నాబాద్ నియోజకవర్గానికి 5,500 ఇందిరమ్మ ఇండ్లు
- కొత్త పింఛన్ల పంపిణీలో మంత్రి పొన్నం ప్రభాకర్
- నేడు సిద్దిపేటలో సీఎం సభ.. భారీగా తరలిరావాలని పిలుపు
హుస్నాబాద్, వెలుగు: దేశంలోనే తొలిసారిగా ప్రతి కుటుంబానికీ ఆర్థిక భద్రత కల్పించే లక్ష్యంతో ‘ఇందిరమ్మ జీవిత బీమా’ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా సిద్దిపేటలో ప్రారంభించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీఎం సభకు ప్రజలు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలంలో అలింకో సంస్థ ఆధ్వర్యంలో దివ్యాంగులు, వృద్ధులకు ఉచిత సహాయ ఉపకరణాల నిర్ధారణ శిబిరాన్ని బుధవారం మంత్రి ప్రారంభించారు.
అనంతరం హుస్నాబాద్ కేజేఆర్ గార్డెన్స్‌లో మున్సిపాలిటీ, మండల పరిధిలోని 612 మంది అర్హులకు కొత్త పింఛన్ల మంజూరు పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఒంటరి మహిళలు, వితంతువులు తదితర ఏడు కేటగిరీల వారికి తమ ప్రభుత్వం పింఛన్లు మంజూరు చేసిందన్నారు.
మహిళా సంఘాల వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచామని, రాష్ట్రవ్యాప్తంగా మహిళా సంఘాలకు రూ.79 వేల కోట్ల రుణాలు అందించామని గుర్తుచేశారు. 2007లో శంకుస్థాపన చేసిన గౌరవెల్లి ప్రాజెక్టును పూర్తి చేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. కాలువల నిర్మాణం, భూసేకరణకు రూ.250 కోట్లు మంజూరు చేసి రైతులకు పరిహారం చెల్లించామన్నారు. సుప్రీంకోర్టులో కేసు పరిష్కారమైందని, ఎన్జీటీ కేసు సైతం త్వరలో కొలిక్కి వస్తుందని, 2027 నాటికి రైతులకు సాగునీరు అందించే బాధ్యత తనదేనని భరోసా ఇచ్చారు.
హుస్నాబాద్ నియోజకవర్గాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కరీంనగర్, అక్కన్నపేట వైపు ఫోర్-లేన్ రోడ్లు, 250 పడకల ఆస్పత్రి, ఇంజినీరింగ్, పీజీ కళాశాలలు, ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణాలకు ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. గత ప్రభుత్వంలో గ్రామ పంచాయతీల నిధులను దారి మళ్లించారని, ప్రజా ప్రభుత్వం తెచ్చిన కొత్త చట్టంతో పంచాయతీ నిధులు, పన్నులు నేరుగా ఆయా గ్రామ పంచాయతీలే ఖర్చు చేసుకునే వెసులుబాటు కల్పించామని గుర్తుచేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ దండి లక్ష్మి, వైస్ చైర్మన్ చిత్తారి పద్మ, ఆర్డీవో రామ్మూర్తి, జిల్లా సంక్షేమ అధికారి శారద, కరీంనగర్ లైబ్రరీ చైర్మన్ సత్తు మల్లేశ్, నాయకులు పాల్గొన్నారు.
