- తాజా భద్రతా పరిస్థితులే కారణం
న్యూఢిల్లీ: సౌదీ అరేబియాలో నెలకొన్న తాజా భద్రతా పరిస్థితుల నేపథ్యంలో ఆ దేశానికి రాకపోకలు సాగించే తమ సంస్థ విమాన సర్వీసులన్నింటినీ ఈ నెల 30 వరకు రద్దు చేస్తున్నట్లు ఇండిగో సంస్థ ప్రకటించింది. ఈ మేరకు బుధవారం ఒక ట్రావెల్ అడ్వైజరీని విడుదల చేసింది. సౌదీలోని నాలుగు ప్రధాన నగరాలైన జెడ్డా, మదీనా, రియాద్ మరియు దమ్మామ్ నుంచి భారత్‌కు, భారత్ నుంచి ఈ నగరాలకు నడిచే విమానాలు పూర్తిగా నిలిపేశారు.
ఈ రద్దు వెంటనే అమల్లోకి వస్తుందని, ఈ నెల 30 వరకు ఇది కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఎలాంటి మినహాయింపులు ఉండవని, అన్ని షెడ్యూల్డ్ విమానాలు రద్దు అవుతాయని వివరించింది. టికెట్ బుక్ చేసుకునే సమయంలో ప్రయాణికులు ఇచ్చిన ఫోన్ నంబర్లు, ఈ మెయిల్ ద్వారా వారికి పూర్తి వివరాలను చేరవేస్తున్నట్లు పేర్కొంది.
ఇప్పటికే టికెట్లు బుక్ చేసుకున్న వారు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్లకు వచ్చే సందేశాలను, ఈమెయిల్స్‌ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలని సూచించింది. సౌదీ అరేబియా ప్రయాణం పెట్టుకున్న వారు తమ టికెట్ల రద్దు లేదా రిఫండ్ వంటి ఇతర వివరాల కోసం ఇండిగో కస్టమర్ కేర్‌ను సంప్రదించవచ్చని వివరించింది.
