- రూ.95 లక్షల జరిమానా విధించిన ఒంగోలు కోర్టు
హైదరాబాద్: ప్రముఖ సినీ నిర్మాత బండ్ల గణేశ్‌కు ఒంగోలు కోర్టు షాక్ ఇచ్చింది. ఒక చెక్ బౌన్స్ కేసులో ఆయనను దోషిగా తేల్చిన న్యాయస్థానం, ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. శిక్షతో పాటు రూ.95 లక్షల జరిమానా చెల్లించాలని, అలాగే బాధితుడికి సంబంధించిన కోర్టు ఖర్చులను కూడా భరించాలని ఆదేశించింది. ప్రకాశం జిల్లాకు చెందిన జెట్టి వెంకటేశ్వర్లు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు ఈ మేరకు కీలక నిర్ణయం తీసుకుంది.
2018లో జరిగిన ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ఈ వివాదం మొదలైంది. ప్రకాశం జిల్లాకు చెందిన జానకిరామయ్య అనే వ్యక్తి వద్ద బండ్ల గణేశ్ గతంలో రూ.95 లక్షలు అప్పుగా తీసుకున్నారు. అయితే, జానకిరామయ్య మరణించడంతో ఆయన తండ్రి జెట్టి వెంకటేశ్వర్లు ఆ బకాయిని వసూలు చేసే బాధ్యత తీసుకున్నారు. అప్పు తీర్చే క్రమంలో బండ్ల గణేశ్ రూ.95 లక్షల విలువైన చెక్కును వెంకటేశ్వర్లుకు అందజేశారు.
సదరు చెక్కును బాధితుడు బ్యాంకులో డిపాజిట్ చేయగా, ఖాతాలో తగినంత నగదు లేకపోవడంతో అది బౌన్స్ అయింది. తన డబ్బు కోసం ఎన్నిసార్లు సంప్రదించినా ఫలితం లేకపోవడంతో వెంకటేశ్వర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. గత కొన్నేళ్లుగా ఒంగోలు కోర్టులో ఈ కేసుపై విచారణ సాగుతోంది. సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయస్థానం, చెక్ బౌన్స్ అయినట్లు నిర్ధారించి బండ్ల గణేశ్‌కు శిక్ష ఖరారు చేసింది.
నిబంధనల ప్రకారం ఏడాది జైలు శిక్షతో పాటు, బాకీ ఉన్న రూ.95 లక్షలను జరిమానా రూపంలో చెల్లించాలని స్పష్టం చేసింది. ఒంగోలు కోర్టు ఇచ్చిన తీర్పుపై ‘ఎక్స్’ వేదికగా బండ్ల గణేశ్ స్పందించారు. ‘‘జిల్లా కోర్టు నుంచి హైకోర్టు, అక్కడి నుంచి సుప్రీంకోర్టు వరకు న్యాయం కోరేందుకు రాజ్యాంగం మనకు అవకాశం కల్పించింది. న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసంతో, చట్టాన్ని గౌరవిస్తూ ముందుకు సాగడమే నా నమ్మకం” అని ఆయన పేర్కొన్నారు.
