కైరో: గల్ఫ్ దేశాలపై ఇరాన్ విరుచుకుపడుతోంది. కువైట్‌లోని అమెరికా ఎయిర్‌బేస్‌లే లక్ష్యంగా బుధవారం క్షిపణి దాడులకు పాల్పడింది. బహ్రెయిన్‌పైనా దాడులు కొనసాగిస్తున్నది. అంతకుముందు రోజు ఇరాన్‌పై అమెరికా జరిపిన దాడులకు ప్రతీకారంగానే ఈ చర్యలకు దిగినట్టు తెలుస్తున్నది. అమెరికా ఆర్మీ మంగళవారం హార్మూజ్ జలసంధిలోని ఖేష్మ్ దీవిలో ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్‌కు చెందిన క్షిపణి ప్రయోగ కేంద్రంపై దాడి చేసింది. అంతకుముందు బహ్రెయిన్‌లోని అమెరికా రాడార్ వ్యవస్థపై ఇరాన్ దాడి చేయడంతో ప్రతీకారంగా అమెరికా ఈ చర్యకు దిగింది.
ఇరాన్ డ్రోన్లను కూల్చేశాం: కువైట్
కువైట్‌లోని అలీ అల్ సలేం ఎయిర్‌బేస్‌లో ఉన్న రక్షణ వ్యవస్థలు, డ్రోన్లు, క్షిపణి ప్రయోగ వేదికలనే లక్ష్యంగా చేసుకుని ఇరాన్ దాడి చేసినట్లు తెలిసింది. అయితే ఇరాన్ డ్రోన్ లను అడ్డుకున్నామని కువైట్ ప్రకటించింది. అమెరికా నేవీ ఐదో నౌకాదళ మెయిన్ ఆఫీస్ ఉన్న బహ్రెయిన్‌పైనా ఇరాన్ దాడులు కొనసాగించింది.
ఆర్థిక దిగ్బంధనంతో ఒత్తిడిలో టెహ్రాన్
హార్మూజ్ జలసంధి వద్ద షిప్‌లకు అమెరికా దళాలు రక్షణ కల్పిస్తున్నాయి. దీంతో ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడి పెరుగుతోంది. ఈ కారణంగానే ఇరాన్ దాడులు పెంచుతున్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇరాన్ దాడులు, అమెరికా ప్రతిచర్యలు పరస్పరం పెరిగితే మళ్లీ చమురు సంక్షోభం రావొచ్చని అంటున్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. ఒకవైపు కొత్తగా దాడులు ఉండకపోవచ్చని చెబుతూనే, మరోవైపు మూడో విమాన వాహక నౌకతో పాటు వేలాది మంది సైనికులను మిడిల్‌ఈస్ట్‌కు పంపుతున్నారు.
మరోవైపు, హార్మూజ్ జలసంధి నుంచి ప్రయాణిస్తున్న ఆయిల్ షిప్లపైనా బుధవారం దాడులు కొనసాగాయి. ఈ దాడిలో ఒకరు గల్లంతయ్యారని, మరో 11 మంది గాయపడ్డారని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌కు చెందిన ప్రభుత్వ చమురు సంస్థ అడ్నాక్ వెల్లడించింది. మరో వైపు సౌదీ రాజధాని రియాద్ లక్ష్యంగా యెమెన్‌లోని ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులు ప్రయోగించిన రెండు క్రూయిజ్ క్షిపణులను తమ రక్షణ వ్యవస్థలు అడ్డుకుని ధ్వంసం చేసినట్లు సౌదీ వెల్లడించింది.
