- ముంబైలో ముసాఫిర్‌ఖానా కూల్చివేతకు రంగం సిద్ధం
ముంబై: అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఒకప్పుడు నివసించిన, తన నేర సామ్రాజ్యానికి కేంద్రంగా మార్చుకున్న భవనం చరిత్రలో మిగిలిపోనుంది. దక్షిణ ముంబైలోని భెండీ బజార్ ప్రాంతంలో ఉన్న ‘హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్‌ఖానా’ను పూర్తిగా కూల్చివేసేందుకు బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) చర్యలు చేపట్టింది. రోడ్డు విస్తరణ పనులతో పాటు ప్రమాదకరంగా మారిన ఈ బిల్డింగ్‌ను తొలగించేందుకు అధికారులు నోటీసులు జారీ చేశారు.
1939లో హజ్ యాత్రికుల కోసం నిర్మించిన ఈ ముసాఫిర్‌ఖానా, 1970–-80 దశకాల్లో దావూద్ నివాసంగా మారింది. భవనంలోని రెండో అంతస్తును తన ఆధీనంలోకి తీసుకున్న దావూద్, అక్కడే తన కార్యాలయాన్ని కూడా నిర్వహించేవాడు. స్మగ్లింగ్ వస్తువులను ఇక్కడే దాచేవారని, 1993 ముంబై పేలుళ్ల కుట్రకు సంబంధించిన చర్చలు కూడా ఇదే భవనంలో జరిగినట్టు రికార్డులు చెబుతున్నాయి.
కూల్చివేతపై వివాదం
ఈ బిల్డింగ్‌పై దావూద్ కుటుంబానికి ఎలాంటి చట్టబద్ధమైన హక్కులు లేవు. 2015లో చారిటీ కమిషనర్ అనుమతితో ఈ ఆస్తిని సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్ ట్రస్ట్ రూ.1.10 కోట్లకు కొనుగోలు చేసింది. భవనం అత్యంత శిథిలావస్థకు చేరడంతో బీఎంసీ దీనిని సీ–-1 కేటగిరీ కింద ప్రమాదకర కట్టడంగా గుర్తించింది. 2020లో బాంబే హైకోర్టు కూల్చివేతకు అనుమతి ఇచ్చింది. దావూద్ నివసించిన గదులను అధికారులు ఇప్పటికే తొలగించారు.
గ్రౌండ్ ఫ్లోర్‌లోని ప్రార్థనా మందిరం కూల్చివేత విషయంలో వివాదం నెలకొంది. బీఎంసీ దీనిని ప్రార్థనా గది అంటుండగా.. స్థానికులు, మహారాష్ట్ర వక్ఫ్ బోర్డు మాత్రం ఇది 140 ఏండ్ల నాటి మసీదు అని వాదిస్తున్నారు. ఈ అంశంపై వక్ఫ్ ట్రిబ్యునల్‌లో న్యాయపోరాటం చేస్తున్నారు. కూల్చివేత సమయంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
