- అదానీ, అంబానీ మాత్రమే వృద్ధి చెందుతున్నారని విమర్శ
- వ్యవసాయం అనే వెన్నెముక విరిగిపోయిందని ఆవేదన
- చైనా తరహాలో తయారీ రంగం లేకపోతే భారత్‌కు ముప్పే
- దేశంలో ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందే
- ఎన్నికలు రిగ్ అయితే అసలు రాజకీయాలే లేనట్టని వెల్లడి
న్యూయార్క్: భారత్ ఎకనామిక్ డిజాస్టర్ అంచుకు చేరుకున్నదని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. నిరుద్యోగం, మాన్యుఫ్యాక్చరింగ్ రంగం పతనం, విద్యా వ్యవస్థలో లోపాలు దేశాన్ని ఆర్థిక ఇబ్బందుల వైపు నెడుతున్నాయని వెల్లడించారు. మంగళవారం న్యూయార్క్‌లోని కొలంబియా యూనివర్సిటీలో స్టూడెంట్లు, అధ్యాపకుల సమక్షంలో జరిగిన ఫైర్‌సైడ్ చాట్(ఇష్టాగోష్ఠి)లో ఆయన మాట్లాడారు. ‘‘కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ఆర్థిక విధానాలు దేశ ప్రజలకు తగినట్లుగా ఉద్యోగాలను సృష్టించలేకపోతున్నాయి. సంపదను అందరికీ సమానంగా పంచలేకపోతున్నాయి.
మేక్ ఇన్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కేంద్ర ప్రభుత్వ పథకాలు దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంలో ఫెయిల్ అయ్యాయి. చిన్న, మధ్యతరహా వ్యాపారాలతోపాటు వ్యవసాయమనే వెన్నెముక కూడా విరిగిపోయింది. సేవా రంగం ద్వారా 1%, 2%, 5% మందికి మాత్రమే ఉద్యోగాలు ఇవ్వవచ్చు. అందరికీ ఉద్యోగాలు కల్పించడం సేవా రంగం వల్ల సాధ్యం కాదు. దేశంలో నిరుద్యోగ సమస్య తొలగిపోవాలంటే కేవలం కొన్ని రంగాల మీద ఆధారపడితే సరిపోదు. చైనా తరహాలో భారత్‌లోనూ ఒక బలమైన మాన్యుఫ్యాక్చరింగ్ బేస్ తయారు చేయాల్సిందే.
దేశంలో గౌతమ్ అదానీ, ముకేష్ అంబానీ వ్యాపార సంస్థలు మాత్రమే వృద్ధి చెందుతున్నాయి. చిన్న వ్యాపారాలు కష్టాల పాలవుతున్నాయి. అందుకే భారత్‌లో ప్రైవేట్ పెట్టుబడులు రావడం లేదు. దేశ సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా.. మళ్లీ సామాన్యుడికి, యువతకు, చిన్న వ్యాపారాలకు మేలు జరిగేలా ఆర్థిక వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరముంది’’ అని రాహుల్ పేర్కొన్నారు.
నిరసనలు అకస్మాత్తుగా పుట్టుకొచ్చినవి కావు
ఇటీవల ఢిల్లీతో పాటు దేశంలోని పలు ప్రాంతాల్లో జరిగిన విద్యార్థుల నిరసనలు అకస్మాత్తుగా పుట్టుకొచ్చినవి కావని రాహుల్ గాంధీ తెలిపారు. గత పదేండ్లుగా రాజకీయ, ఆర్థిక అధికారం కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమవుతోందని.. దీనికి వ్యతిరేకంగానే ప్రజలు నిరసనలు చేపట్టారని వెల్లడించారు. ఆదివాసీలు, దళితులు, రైతుల భూములు, హక్కులను లాక్కుంటున్నారని ఆరోపించారు. సమాజంలో పెరుగుతున్న అసమానతల కారణంగానే వివిధ వర్గాల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయని చెప్పారు.
ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిందే
దేశంలో ప్రజాస్వామ్యాన్ని బతికించాలంటే ఎన్నికల వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందని రాహుల్ అభిప్రాయపడ్డారు. ఎన్నికల్లో జరుగుతున్న అవకతవకలు ప్రజాస్వామ్య ప్రక్రియనే బలహీనపరుస్తున్నాయని విమర్శించారు. ఈ వ్యవస్థను మళ్లీ గాడిలో పెట్టడానికి చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించడం లాంటి కీలక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఎన్నికలు పారదర్శకంగా జరగనప్పుడు అసలు అక్కడ రాజకీయాలే జరగనట్లని చెప్పారు. ఎన్నికల అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ పక్కా ఆధారాలు సేకరిస్తోందని వివరించారు.
మౌలిక సమస్యల మీదే ఫోకస్ పెట్టాలి
విదేశీ వలస విధానాలు లేదా ఇతర చిన్న విషయాలకంటే దేశంలోని మౌలిక సమస్యల మీదే మనం ప్రధానంగా దృష్టి పెట్టాలని రాహుల్ సూచించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం, దేశంలో తయారీ రంగాన్ని (మ్యానుఫాక్చరింగ్ బేస్) బలోపేతం చేయడం, నాణ్యమైన విద్యను అందించడం అత్యంత కీలకమని చెప్పారు. అమెరికా, ఐరోపా దేశాలతో పోలిస్తే భారత్ మెరుగైన స్థితిలోనే ఉందన్నారు. అయితే, మరో ఐదు పదేండ్లు ఇదే పరిస్థితి కొనసాగితే దేశం తీవ్ర సంక్షోభంలో చిక్కుకుంటుందని హెచ్చరించారు.
