కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీల సంఖ్య పెరగాలి : డాక్టర్ ఫగ్గన్ సింగ్

కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగుల్లో  ఎస్సీ, ఎస్టీల సంఖ్య పెరగాలి :  డాక్టర్ ఫగ్గన్ సింగ్
  • పార్లమెంటరీ కమిటీ చైర్మన్ ఫగ్గన్ సింగ్ కులస్తే అధికారులతో మీటింగ్​

హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్, ఔట్‌‌‌‌సోర్సింగ్ ఉద్యోగుల్లో ఎస్సీ, ఎస్టీల సంఖ్య పెరగాలని ఎస్సీ, ఎస్టీ పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రూల్ ఆఫ్ రిజర్వేషన్‌‌‌‌ను పక్కాగా అమలు చేయాలని సీఎస్, డీజీపీ సహా వివిధ శాఖల ఉన్నతాధికారులను ఆయన ఆదేశించారు. రిజర్వేషన్లు ఆశించిన స్థాయిలో అమలు కావడం లేదని ఎస్సీ, ఎస్టీ యూనియన్ నేతలు చైర్మన్‌‌‌‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో బుధవారం హైదరాబాద్‌‌‌‌లోని ఓ హోటల్​లో రాష్ట్ర ప్రభుత్వ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు.

దీనికి సీఎస్ సంజయ్ జాజు, డీజీపీ సీవీ ఆనంద్, వెల్ఫేర్ స్పెషల్ సీఎస్ సబ్యసాచి ఘోష్‌‌‌‌తోపాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు, తెలంగాణ, ఏపీ ఎంపీలు మల్లు రవి, ప్రసాదరావు హాజరయ్యారు. ఈ సందర్భంగా స్పెషల్ డెవలప్‌‌‌‌మెంట్ ఫండ్ (ఎస్‌‌‌‌డీఎఫ్) నిధుల కేటాయింపులకు, ఖర్చు చేస్తున్న తీరుకు మధ్య వ్యత్యాసం ఉందని చైర్మన్ కులస్తే అన్నారు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలు తీరుపై కమిటీ సంతృప్తి వ్యక్తం చేసిందని ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అధికారులు తెలిపారు. అనంతరం బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, బీడీఎల్, ఎన్ఎండీసీ, సింగరేణి కాలరీస్ వంటి వివిధ ప్రభుత్వ రంగ సంస్థల ప్రతినిధులతోనూ కమిటీ పలు అంశాలపై చర్చలు జరిపింది. 

రోస్టర్ విధానంలో అన్యాయాన్ని సరిదిద్దండి: మాల సంఘాల జేఏసీ

రాష్ర్టంలో ఎస్సీ వర్గీకరణ రోస్టర్ విధానం వల్ల మాల సామాజిక వర్గానికి తీవ్ర అన్యాయం జరుగుతోందని మాల సంఘాల జేఏసీ చైర్మన్ మాందాల భాస్కర్, జేఏసీ నేత మాదాసు రాహుల్ రావు ఆరోపించారు. బుధవారం రాష్ర్ట పర్యటనలో ఉన్న పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తేను కలిసి వినతిపత్రం అందజేశారు. రిజర్వేషన్ ఫలాలు సమానంగా అందాలని..ప్రస్తుత వర్గీకరణ రోస్టర్ విధానాలు మాలల హక్కులను కాలరాస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం కొన్ని కులాల ప్రయోజనాలకే పెద్దపీట వేయడం వల్ల మాల ఉప కులాలు విద్య, ఉద్యోగ రంగాల్లో తీవ్ర నష్టాన్ని ఎదుర్కొంటున్నాయన్నారు. ఈ అసమానతలను తొలగించాలని డిమాండ్ చేశారు.