- కేంద్ర జలశక్తి శాఖకు ప్రభుత్వం లేఖ
- అనుమతులు లేకుండా విజయపురి సౌత్ వద్ద
- రూ.1,200 కోట్లతో పల్నాడు వాటర్ గ్రిడ్ పనులు
- 150.45 మీటర్ల వద్ద ఇన్‌టేక్ ఓపెనింగ్స్ తో మా నీటి హక్కులకు నష్టం
- ప్రాజెక్టును ఆపాలని డిమాండ్
హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాగార్జునసాగర్ రిజర్వాయర్‌పై ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండా ఏకపక్షంగా చేపడుతున్న పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు(అమరజీవి జలధార) పనులను తక్షణమే నిలిపివేయాలని కేంద్రాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేసింది. అనుమతుల్లేకుండా ఈ ప్రాజెక్టును చేపడుతున్నారని, ఏపీ విభజన చట్టాన్ని ఉల్లంఘించి పనులు చేస్తున్నారని ఆక్షేపించింది.
ఈ మేరకు రెండు రోజుల క్రితమే కేంద్ర జలశక్తి శాఖ కార్యదర్శికి ఇరిగేషన్ శాఖ సెక్రటరీ శ్రీధర్ లేఖ రాశారు. ఈ ప్రాజెక్టు కోసం ప్రతిపాదించిన ఇన్‌టేక్ స్ట్రక్చర్‌కు +150.45 మీటర్లు, +160.00 మీటర్లు, +170.00 మీటర్ల వద్ద ఓపెనింగ్స్ ఏర్పాటు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్‌టేక్ వెల్ అత్యంత తక్కువ స్థాయి ఓపెనింగ్ అయిన +150.45 మీటర్లు.. రిజర్వాయర్ డెడ్ స్టోరేజ్ అయిన +155.48 మీటర్ల (+510 అడుగులు) కంటే దిగువన ఉందని పేర్కొన్నారు.
ఇంతటి దిగువ స్థాయిలో ఇన్‌టేక్ స్ట్రక్చర్‌ను నిర్మించడం వల్ల రిజర్వాయర్ భద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందని, నిర్వహణ, నీటి నియంత్రణ, నీటి కేటాయింపులపైనా తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరించారు. ఈ అంశంపై కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ), సంబంధిత నిపుణులైన అధికారులు అధ్యయనం చేయాలని స్పష్టం చేశారు.
ఇప్పటికే రూ.95 కోట్ల ఖర్చు
నాగార్జునసాగర్ రిజర్వాయర్ ఫోర్‌షోర్‌లో విజయపురి సౌత్ వద్ద ఏపీ ప్రభుత్వం సుమారు రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో పల్నాడు వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును చేపట్టిందని లేఖలో సెక్రటరీ పేర్కొన్నారు. జల్ జీవన్ మిషన్ కింద పల్నాడు జిల్లాకు తాగునీరు అందించేందుకు రోజుకు సుమారు 160 ఎంఎల్డీల (ఏటా సుమారు 1.865 టీఎంసీలు) ముడి నీటిని ఈ ప్రాజెక్టు ద్వారా తరలించేలా ప్రతిపాదించినట్లు తెలిపారు.
దీనికి సంబంధించిన ఇన్‌టేక్ వెల్స్, నీటి శుద్ధి కేంద్రాలు (వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు), రిజర్వాయర్లు, పైప్లైన్లు, ఓవర్‌హెడ్ ట్యాంకుల నిర్మాణ పనులు వివిధ దశల్లో కొనసాగుతున్నాయని, ఇప్పటివరకు సుమారు రూ.95.00 కోట్ల మేర ఖర్చు చేసినట్లు సమాచారం ఉందని చెప్పారు.
నాగార్జునసాగర్ కుడి కాలువ (ఎన్ఎస్ఆర్సీ) తాగునీటి అవసరాల కోసం ఏటా 2.84 టీఎంసీల నీటిని ఇప్పటికే తీసుకెళ్తున్నారని, దానికి మించి అదనంగా నీటిని తోడుకోవాలంటే కేఆర్ఎంబీ, అపెక్స్ కౌన్సిల్ ముందస్తు మదింపు, అనుమతులు తప్పనిసరి అని స్పష్టం చేశారు. కీలకమైన అంతర్రాష్ట్ర రిజర్వాయర్ నుంచి నిర్దేశిత అనుమతుల ప్రక్రియ పూర్తి కాకుండానే ఇలా నీటిని తరలించే ఏర్పాట్లు చేయడం వల్ల రిజర్వాయర్ నియంత్రణ, నీటి పంపిణీ, ప్రస్తుత ఒప్పందాలతో పాటు సంబంధిత రాష్ట్రాల న్యాయబద్ధమైన ప్రయోజనాలకు తీవ్ర విఘాతం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
డీపీఆర్ ఇవ్వాల్సిందే..
విభజన చట్టంలోని సెక్షన్లు 84(3)(ii), 85(8)(d) ప్రకారం ఏ కొత్త ప్రాజెక్టునైనా అమలు చేసే ముందు కేఆర్ఎంబీ, కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) అప్రైజల్ పూర్తయ్యాక సిఫార్సు చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత అపెక్స్ కౌన్సిల్ ఆమోదం పొందాల్సి ఉంటుందని సెక్రటరీ శ్రీధర్ గుర్తు చేశారు. ఇలాంటి తప్పనిసరి చట్టబద్ధమైన మదింపు, ఆమోదం లేకుండా నాగార్జునసాగర్ రిజర్వాయర్ వద్ద నీటిని తోడుకునే కొత్త నిర్మాణాలను ఏపీ ప్రభుత్వం ఏకపక్షంగా చేపట్టడానికి వీల్లేదని పేర్కొన్నారు.
ప్రాజెక్టుకు అవసరమైన నీటి కేటాయింపులు పొంది, కేఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, అపెక్స్ కౌన్సిల్ నుంచి అన్ని చట్టబద్ధమైన అనుమతులు, క్లియరెన్సులు వచ్చేంతవరకు ఏపీ తదుపరి నిర్మాణాలను ఆపేలా, నీటిని తరలించకుండా ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాగా, ఇదే లేఖను కృష్ణా బోర్డుకు కూడా పంపించారు.
