నా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు..పవన్ కల్యాణ్ పేరును వివాదాల్లోకి లాగొద్దు : కోటా రుక్మిణి

నా మౌనాన్ని బలహీనతగా భావించొద్దు..పవన్ కల్యాణ్ పేరును వివాదాల్లోకి లాగొద్దు : కోటా రుక్మిణి
  • ప్రకటన విడుదల చేసిన కోటా రుక్మిణి

హైదరాబాద్: తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు కొంతకాలంగా ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని కోటా రుక్మిణి ఆవేదన వ్యక్తం చేశారు. తన వ్యక్తిగత జీవితంపై అసత్య కథనాలు ప్రచారం చేస్తూ, వృత్తిపరమైన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇన్నాళ్లూ సంయమనం పాటిస్తూ మౌనంగా ఉన్నానని, ఇప్పుడు హద్దులు దాటడంతో చట్టపరంగా పోరాడాలని నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేశారు. తన మౌనాన్ని బలహీనతగా, సహనాన్ని భయంగా భావించవద్దని హెచ్చరిస్తూ బుధవారం ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు.

ఉద్యోగ నియామకాల మోసం.. ఉద్యోగి తొలగింపు

తన సంస్థకు చెందిన ఓ ఉద్యోగి ఇటీవల తీవ్రమైన ఉద్యోగ నియామకాల మోసానికి పాల్పడినట్లు తన దృష్టికి వచ్చిందని రుక్మిణి తెలిపారు. తన పేరు, కంపెనీ గుర్తింపు, అధికారిక పత్రాలను దుర్వినియోగం చేసి ఆర్థిక ప్రయోజనాలు పొందేందుకు ప్రయత్నించినట్లు పేర్కొన్నారు. ఈ విషయం తెలిసిన వెంటనే సంబంధిత ఉద్యోగికి షోకాజ్ నోటీసు జారీ చేసి, అంతర్గత విచారణ అనంతరం ఆ ఉద్యోగి సేవలను రద్దు చేసినట్లు వెల్లడించారు.

పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేసి తగిన చట్టపరమైన చర్యలు ప్రారంభించినట్లు వివరించారు. జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పేరును తప్పుదోవ పట్టించే కథనాల ద్వారా ఈ వివాదంలోకి లాగేందుకు జరుగుతున్న ప్రయత్నాలను ఖండించారు. పవన్ నాయకత్వం, సిద్ధాంతాల పట్ల తనకు అచంచలమైన నిబద్ధత ఉందని తెలిపారు. ఆయన నేర్పిన సహనం, పట్టుదలే తనకు స్ఫూర్తి అని, న్యాయం కోసం తన పోరాటం చట్టబద్ధంగానే కొనసాగుతుందని రుక్మిణి కోటా స్పష్టం చేశారు.