అర్కండ్ల వాగుపై బ్రిడ్జి నిర్మించాలని.. నీటిలో నిలబడి నిరసన: విశారదన్ మహారాజ్

అర్కండ్ల వాగుపై  బ్రిడ్జి నిర్మించాలని.. నీటిలో నిలబడి నిరసన: విశారదన్ మహారాజ్

శంకరపట్నం, వెలుగు: కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం అర్కండ్ల వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మించాలని బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్ విశారదన్ మహారాజ్ డిమాండ్​ చేశారు.  బుధవారం గ్రామస్తులతో కలిసి వాగులోకి దిగి సుమారు నాలుగు గంటల పాటు అందులోనే నిలబడి వినూత్న నిరసన చేపట్టారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన ఏడాదిలోపే అర్కండ్ల వాగుపై హైలెవల్ బ్రిడ్జి నిర్మిస్తామని హామీ ఇచ్చిన మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ఆ హామీని నిలబెట్టుకోవడంలో విఫలమయ్యారన్నారు. స్పష్టమైన హామీ ఇచ్చే వరకు నిరసన విరమించేది లేదని స్పష్టం చేశారు. దీంతో తహసీల్దార్ సురేఖ వెంటనే ఎస్సీ భీమ్లా నాయక్ తో ఆయనను ఫోన్​లో మాట్లాడించారు. 

మార్చి నెలలోపు హైలెవల్ బ్రిడ్జి నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేయించి, పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో  నిరసన విరమించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నేదురు పవన్, మాజీ ఉపసర్పంచ్ చెర్ల శ్రీనివాస్, బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ మండల అధ్యక్షుడు యమునూరి ప్రశాంత్,  టీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ మహిళ అధ్యక్షురాలు ఎండీ సల్మా  పాల్గొన్నారు.