- నేటి నుంచి 22 వరకు హైటెక్స్‌లో 85వ ‘ఇండియన్ రోడ్ కాంగ్రెస్’
- సదస్సును కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ప్రారంభిస్తరు
- సీఎం, డిప్యూటీ సీఎం హాజరవుతరు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
హైదరాబాద్, వెలుగు: మెరుగైన రోడ్లు, రవాణా సదుపాయాలు ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయని, పరిశ్రమలు అభివృద్ధి చెంది యువతకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని రాష్ట్ర ఆర్ అండ్ బీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. దేశంలో రహదారుల అభివృద్ధి, ఆధునిక నిర్మాణ సాంకేతికతపై చర్చించే 85వ ఇండియన్ రోడ్ కాంగ్రెస్ (ఐఆర్‌సీ) సదస్సుకు హైదరాబాద్ వేదిక కానుందని తెలిపారు.
మాదాపూర్‌లోని హైటెక్స్‌లో గురువారం నుంచి ఈ నెల 22 వరకు నాలుగు రోజుల పాటు సదస్సు జరగనుంది. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గురువారం ఉదయం 11.30 గంటలకు ప్రారంభిస్తారని, సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హాజరవుతారని మంత్రి వెల్లడించారు. బుధవారం హైటెక్స్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.
దేశవ్యాప్తంగా రహదారుల రంగానికి చెందిన ఇంజినీర్లు, నిపుణులు, అధికారులు, పరిశ్రమల ప్రతినిధులు కలిపి సుమారు 3,500 మంది పాల్గొంటారని చెప్పారు. మెరుగైన రవాణా సదుపాయాలతో 2025–-26లో రాష్ట్ర జీఎస్‌డీపీ రూ.17.82 లక్షల కోట్లకు చేరిందని పేర్కొన్నారు. సదస్సు ప్రారంభం తర్వాత కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, సీఎం రేవంత్‌రెడ్డితో కలిసి రాష్ట్రంలోని కీలక రహదారి ప్రాజెక్టులపై సమీక్ష నిర్వహిస్తామన్నారు.
2026-–27 బడ్జెట్‌లో రోడ్లు, బ్రిడ్జిల కోసం రూ.5,677 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. రీజినల్ రింగ్ రోడ్, హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణ, ఎలివేటెడ్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీ-బందర్ పోర్ట్ గ్రీన్‌ఫీల్డ్ హైవే, ఎన్‌హెచ్-167, కరీంనగర్-వరంగల్ హైవే అభివృద్ధితో పాటు గ్రామీణ రోడ్ల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. సదస్సులో 400 ఎగ్జిబిషన్ స్టాళ్లు, 19 టెక్నికల్ సెషన్లు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి చెప్పారు.
పర్యావరణహిత రోడ్లు, వాతావరణ మార్పులను తట్టుకునే నిర్మాణాలు, ఏఐ, డిజిటల్ టెక్నాలజీ, ఎలక్ట్రిక్ వాహనాల మౌలిక సదుపాయాలపై నిపుణులు చర్చిస్తారని తెలిపారు. పాదచారుల భద్రత, 'రైట్ టు వాక్' అంశంపై ప్రత్యేక చర్చ ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి పనులను ప్రతినిధులకు వివరించేందుకు తెలంగాణ పెవిలియన్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
