డీఆర్‌‌‌‌డీవో భూముల వివాదాన్నిత్వరగా పరిష్కరించండి..హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన

డీఆర్‌‌‌‌డీవో భూముల వివాదాన్నిత్వరగా పరిష్కరించండి..హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచన

న్యూఢిల్లీ, వెలుగు: రంగారెడ్డి జిల్లాలోని బాలాపూర్, చింతలకుంటల్లో డీఆర్‌‌‌‌డీవో అవసరాల కోసం సేకరించిన భూముల పరిహార వివాదంపై దాఖలైన అప్పీళ్లను త్వరగా పరిష్కరించాలని హైకోర్టుకు సుప్రీంకోర్టు సూచించింది. తదుపరి విచారణను  ఫిబ్రవరి 12కి వాయిదా వేసింది. జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ సంజీవ్ సచ్‌‌‌‌దేవలతో కూడిన ధర్మాసనం బుధవారం ఈ పిటిషన్‌‌‌‌ను విచారించింది.

2006లో కేంద్ర రక్షణ శాఖ డీఆర్‌‌‌‌డీవో, డీఆర్‌‌‌‌డీఎల్ అవసరాల కోసం భూసేకరణ చేపట్టగా, పరిహారం తక్కువంటూ రైతులు సివిల్ కోర్టును ఆశ్రయించారు. వారికే అనుకూలంగా తీర్పు రాగా.. అధికారులు హైకోర్టులో సవాల్ ​చేశారు. ఈ కేసు హైకోర్టు డివిజన్ బెంచ్ ఎదుట పెండింగ్‌‌‌‌లో ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

రైతులు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్నారని  నిర్వాసితుల తరఫు అడ్వొకేట్లు తెలిపారు. తాము ఇప్పటికే రూ.100.87 కోట్లు డిపాజిట్ చేశామని, డిసెంబర్ 30న హైకోర్టులో తుది విచారణ జరగనుందని ప్రభుత్వ న్యాయవాదులు తెలిపారు. ఇరువర్గాల వాదనలు విన్న సుప్రీంకోర్టు.. పెండింగ్ అప్పీళ్లను త్వరగా తేల్చాలని హైకోర్టుకు సూచించింది.