హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ నగరంలో స్నాప్‌చాట్ కేంద్రంగా సాగుతున్న డ్రగ్స్‌దందా గుట్టును రాష్ట్ర ఈగల్ ఫోర్స్ పోలీసులు రట్టు చేశారు. ముంబై నుంచి గంజాయి తీసుకొచ్చి, సిటీలో 900 మంది కస్టమర్లకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ముగ్గురు అంతర్రాష్ట పెడ్లర్లను అరెస్ట్‌చేసి, వారి వద్ద నుంచి 1.240 కిలోల గంజాయి,16.59 గ్రాముల ఓజీ కుష్, 3 సెల్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.
ఈ నెల15న మారుతీ టూర్ కారులో లాంకో హిల్స్ నుంచి మణికొండలోని జేఏ రాయల్ సూట్స్ వైపు గంజాయి, ఓజీ కుష్‌ను తరలిస్తున్నట్లు ఈగల్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఈగల్ ఫోర్స్, నార్కోటిక్స్ పోలీసులు వెహికల్ చెకింగ్ చేశారు. కారులో ప్రయాణిస్తున్న టోలిచౌకీకి చెందిన మహమ్మద్ ఇద్రిస్ కలీమ్, ఆసిఫ్‌నగర్‌కు చెందిన సయ్యద్ అబ్బాస్ హుస్సేనీ, గోల్కొండకు చెందిన మహమ్మద్ షేక్ లను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో గంజాయి సప్లై చేస్తున్నట్లు వారు ఒప్పుకున్నారని పోలీసులు పేర్కొన్నారు.
క్రిప్టో కరెన్సీ వినియోగం..
ఇద్రిస్, మహమ్మద్ షేక్ కలిసి ముంబైకి చెందిన షేక్ ఫరహాన్ నుంచి భారీ మొత్తంలో గంజాయి, ఓజీ కుష్ కొనుగోలు చేసి బస్సుల ద్వారా హైదరాబాద్‌కు తరలిస్తున్నారు. స్నాప్‌చాట్ ద్వారా ఆర్డర్లు తీసుకుని కస్టమర్లకు గంజాయి సప్లై చేస్తున్నారు. కొనుగోలు, విక్రయాలకు సంబంధించి క్రిప్టో కరెన్సీని వినియోగించినట్లు పోలీసులు తేల్చాచారు.
ఇద్రిస్ క్రిప్టో ఖాతా ద్వారా ముంబయిలోని సప్లయర్లకు చెల్లింపులు చేయడంతోపాటు వినియోగదారుల నుంచి కూడా డిజిటల్ కరెన్సీ స్వీకరిస్తున్నట్లు బయటపడింది. అబ్బాస్ హుస్సేనీ సెల్‌ఫోన్‌లో యూఎస్‌డీటీ క్రిప్టో కరెన్సీని పేమెంట్ గేట్‌వేస్ ద్వారా జమ చేస్తున్నట్లు తేలింది. క్రిప్టో వాలెట్‌లో సుమారు 150 లావాదేవీలు, 60 మంది వినియోగదారులకు సంబంధించిన వివరాలను ఈగల్ ఫోర్స్ అధికారులు సేకరించారు.
