- నాడు సంక్షేమాన్ని పట్టించుకోక.. నేడు దొర సిగ్గుతో ఫామ్ హౌస్ కే పరిమితమయ్యాడు
- మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
ఖమ్మం/ కల్లూరు, వెలుగు: వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ సింగిల్ డిజిట్ కే పరిమితమవుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి అన్నారు. బావబామ్మర్దులు నోరు తెరిస్తే పచ్చి అబద్ధాలతో రెచ్చిపోతున్నారని, వారు పొర్లు దండాలు పెట్టినా ఇప్పుడున్న 39 సీట్లు కూడా రావని హరీశ్‌రావు, కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. బుధవారం ఖమ్మం జిల్లా కల్లూరులో సత్తుపల్లి ఎమ్మెల్యే మట్టా రాగమయితో కలిసి 1,516 మంది లబ్ధిదారులకు కొత్త పింఛన్ మంజూరు పత్రాలను పంపిణీ చేశారు.
తర్వాత ఖమ్మం కార్పొరేషన్ పరిధిలోని దానవాయిగూడెంలో లబ్ధిదారులకు కొత్త పింఛన్ మంజూరు పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి మాట్లాడుతూ గత పాలకుల వైఫల్యంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకున్నా, ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తూ అభివృద్ధి, సంక్షేమంలో దూసుకెళ్తున్నామని, అది ఓర్వలేక విపక్షాలు ప్రభుత్వంపై విషం చిమ్ముతున్నాయని మండిపడ్డారు. బీఆర్ఎస్ హయాంలో లక్ష కోట్లు దోచుకున్నారని, ఇప్పుడు ప్రజా పాలనలో పేదలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే విమర్శలు చేస్తున్నారన్నారు.
అప్పుడేమో పేదలకు సంక్షేమం అందించలేక సిగ్గుతో ఇప్పుడు దొర ఫాంహౌస్ కే పరిమితమయ్యాడని విరుచుకుపడ్డారు. పేదింటి మహిళలకు ఇండ్లు నిర్మించుకునేందుకు సుమారు రూ.40 వేల కోట్లు కేటాయించామన్నారు. పింక్ చొక్కా వేసుకున్న పేదలకు కూడా అర్హత ఉంటే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామన్నారు. అంతకుముందు కల్లూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రూ.2 లక్షలతో ఏర్పాటు చేసిన ఆర్వో వాటర్ ప్యూరిఫికేషన్ ప్లాంట్ ను మంత్రి ప్రారంభించారు.
