రచయిత, జానపద పరిశోధకుడు అయిన ప్రొ.జయధీర్ తిరుమలరావు సతీమణి నీలమ్మ. డెబ్భై ఏళ్ల వయసులో ఆమె ఈ నెల 9న కన్నుమూశారు. ఆమె కళ్లను ఎల్వి ప్రసాద్ కంటి ఆసుపత్రికి దానమిచ్చి, మిగతా భౌతిక కాయాన్ని గాంధీ దవాఖానకు అప్పగించారు. చనిపోయాక కూడా శరీరాన్ని ప్రయోజనకరంగా మలచుకొని మనందరికీ ఆదర్శంగా నిలిచిన పరిపూర్ణ జీవితం నీలమ్మది. అయితే ఇంతటితో నీలమ్మ సంగతి ముగిసిపోదు. భర్తతో కలిసి నడిచి ఆయన ఆశలు, ఆకాంక్షలు, ఆశయాల్లో సగభాగమయ్యారు. మన సాంస్కృతిక, సామాజిక ప్రయోజనం కోసం దశాబ్దాలుగా తన కాలాన్ని వెచ్చించారు. జయధీర్ తిరుమలరావు జగమెరిగిన జానపద పరిశోధకులు. నిజాం పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రైతాంగ తిరుగుబాటు, అందులో పాల్గొన్న యోధులు, కళాకారులు, ఆనాటి సాహిత్యం, పాటలపై పరిశోధన చేసి ఎన్నో కొత్త విషయాలను ఆయన వెలికితీశారు.
అంతంలేని ఆయన శోధన ఇప్పటికీ కొత్త కొత్త దారుల్లో నడుస్తూ ఆదివాసీ జీవితాల అధ్యయనంపై ఫోకస్‌గా మారింది. ఆ క్రమంలో మారుమూల గిరిజన గృహాల్లో కనిపించిన పురావస్తువుల పట్ల ఆసక్తిగలిగి వారి అనుమతితో వెంట తెచ్చుకొనేవారు. వాటిలో ఆనాటి వృత్తి పరికరాలు, గతకాలపు దీపాలు, సంగీత వాద్యాలు, తాళపత్రాలు.. ఇలా ఎన్నో ఉన్నాయి. మానవ నాగరికత వికాసం, ఆదివాసీ సాంస్కృతిక మూలాలు తదితర పరిశోధనలకు ఇవెంతో ఉపయోగపడతాయి.
వీటిని కాపాడుకోవడం మన అవసరం, బాధ్యత అని భావించిన ఆయన ఈ సేకరణను పెంచుతూ పోయారు. అయితే ఈ సేకరణ అంతా తిరుమలరావు ఒక్కరితో జరిగిన పనికాదు. భర్త ఆసక్తి, శ్రమను గమనించిన ఇల్లాలుగా నీల ఆయనకు తోడుగా నిలిచారు. ఆద్యకళ అమ్మగా మారారు. జీతం సొమ్మంతా ఈ వస్తువుల కోసం ఖర్చు చేస్తే ఎలా అని నిలదీయలేదు. ఇంటినిండా ఈ వస్తువులతో మెదిలేదెలా అని విసుక్కోలేదు. దూరప్రాంతాలకు ఒక్కడే వెళ్లడం కష్టమౌతుందని వెంట వెళ్లేవారు.
అలా ఆ పురావస్తువుల సేకరణ, సంరక్షణ ఉమ్మడి బాధ్యతగా మారిపోయింది. ఇంట్లోని వస్తువులను శుభ్రపరచుకున్నట్లే ఆ లోహ విగ్రహాలను, కర్ర కళాకృతులను, సంగీత వాద్యాలను భద్రంగా చూసుకోవడం కూడా నీలమ్మ నిత్యకార్యమైంది. పురావస్తు సంరక్షణలో ఓ కోర్సు చేసినట్లుగా వాటిపై ఆమెకు అవగాహన ఉండేది.
ప్రభుత్వం ఆద్యకళ మ్యూజియం ఏర్పాటు చేయాలి
నలభై ఏళ్లుగా సాగుతున్న ఈ సామగ్రి సంఖ్య వందల్లోంచి వేలల్లోకి చేరింది. వాటి సంరక్షణ వారి తలకు మించిన భారమైంది. అప్పుడు వారి మనసులో ఆద్యకళ రూపుదిద్దుకుంది. ఆద్యకళ మ్యూజియం ఏర్పాటు చేస్తే తమ సేకరణ ఫలితం ప్రజలకు దక్కుతుందని భావించారు. ఆ ప్రదర్శనశాల కోసం పదేళ్లుగా తండ్లాడుతున్నారు. వీటిని సేకరించిన ప్రఖ్యాతులు తమకు అవసరం లేదు, ప్రజల నుంచి సేకరించిన వస్తువులను ప్రజల ప్రయోజనం కోసం బేషరతుగా ప్రభుత్వానికి అప్పగిస్తాం అని బాహాటంగా చెబుతున్నారు.
ప్రభుత్వాల సహకారం అందినట్లే అంది చేజారిపోతోంది. ఏదో రోజు ఆద్యకళ కల నిజమౌతుందనే ఆశ వారిలో సజీవంగా ఉంది. ఈ ఆశ నిరాశల మధ్య నీలమ్మ మరణించడం తీరని విషాదం. ఆమె చివరిచూపు కోసం వచ్చినవారు నీలమ్మ కలనే గుర్తుచేసుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఆద్యకళ మ్యూజియం అయితీరుతుందనే విశ్వాసం ఆమెలో ఉండేది. నీలమ్మ కల నిజం కావాలి అని నినదిస్తూ, అందరూ ఆశావహంగా మాట్లాడారు. ఆద్యకళ అమ్మగా ఆమెను పేర్కొంటూ నివాళి అర్పించారు.
కరోనా సమయంలో తమను నమ్ముకొని వచ్చిన ఆదివాసులను అన్ని రకాలుగా ఆమె ఆదుకున్నారు. గిరిజన వాద్యకారులు అమ్మ ఆప్యాయతను తలుచుకొని వేదనాభరిత గానం చేశారు. ఇంతకాలం ఆ కళాఖండాలను తన పిల్లల్లా కాపు కాచిన అమ్మ ఇప్పుడు దూరమయ్యారు. ఇప్పటికైనా ప్రభుత్వం ముందుకొచ్చి మ్యూజియం ఏర్పాటు ద్వారా వాటి సంరక్షణ, ప్రదర్శన బాధ్యతలు చేపట్టాలి. అందరూ కోరుకున్నట్లుగా నీలమ్మ కల నిజం కావాలి.
- బి. పద్మ
