వెలుగు స్పెషల్ : ఇందిరమ్మ రాజ్యంలో బీమాతో భరోసా

వెలుగు స్పెషల్ : ఇందిరమ్మ రాజ్యంలో  బీమాతో భరోసా

 ‘ప్రభుత్వానికి మొదటి ప్రాధాన్యతగా నిరుపేదలు, అణగారిన వర్గాల సంక్షేమమే ఉండాలి’ అనే లక్ష్యంతో దేశాన్ని పాలించిన మాజీ ప్రధాని ఇందిరాగాంధీ మార్గదర్శకంలో పయనిస్తూ తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అందిస్తోంది. నవంబర్ 19న మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకుని ఆమె ఆశయాలు, దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ తెలంగాణలో అమలవుతున్న ఇందిరమ్మ సంక్షేమ పథకాల ప్రాధాన్యతను గుర్తు చేసుకోవడం సముచితం. ఇందిరమ్మ రాజ్యం అంటూ ప్రకటనలకే పరిమితం కాకుండా పేదలకు సంక్షేమం, బడుగు బలహీన వర్గాలకు సామాజిక న్యాయం అందిస్తూ ఇందిరాగాంధీ ఆశయాల స్ఫూర్తితో ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోంది. పేదలకు సొంత ఇళ్లు కల్పించడం, మహిళలకు ఆర్థిక స్వావలంబన అందించడం, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు చేర్చడం వంటి లక్ష్యాలతో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ఇందిరమ్మ పేరిట పలు పథకాలు ఆమె ఆశయాలకు ప్రతిరూపంగా నిలుస్తున్నాయి. 

భారత రాజకీయ చరిత్రలో ఉక్కుమహిళ ఇందిరా గాంధీది ప్రత్యేకమైన స్థానం. దేశ తొలి మహిళా ప్రధానిగా మాత్రమే కాకుండా, ధైర్యం, దృఢసంకల్పం, నిర్ణయాత్మక నాయకత్వంతో భారతదేశంపై చెరగని ముద్రవేసిన ధీరురాలు ఆమె. దేశ ఐక్యత, సమగ్రత, పేదల అభ్యున్నతి, మహిళా సాధికారత కోసం ఆమె తీసుకున్న నిర్ణయాలు నేటికీ స్ఫూర్తినిస్తూనే ఉన్నాయి.  1966 జనవరి 24న ప్రధానమంత్రి బాధ్యతలు చేపట్టిన ఇందిరాగాంధీ దాదాపు 16 సంవత్సరాలపాటు దేశాన్ని నడిపించారు.  

ఎన్నో  సవాళ్లు, సంక్షోభాలు ఎదురైనా వెనుకడుగు వేయకుండా దేశ ప్రయోజనాలే లక్ష్యంగా ముందుకు సాగారు. 1971లో జరిగిన భారత్-, పాకిస్థాన్ యుద్ధంలో ఆమె చూపిన నాయకత్వం భారత చరిత్రలో  ఒక  కీలక ఘట్టంగా నిలిచిపోయింది. పాకిస్థాన్‌‌‌‌‌‌‌‌పై భారత్ సాధించిన విజయంతో బంగ్లాదేశ్ ఆవిర్భావానికి మార్గం సుగమమైంది. సుమారు 93 వేల మంది పాకిస్థాన్ సైనికులు లొంగిపోవడం ప్రపంచ చరిత్రలోనే అరుదైన ఘటన. అనంతరం 1972  జులై 2న కుదిరిన సిమ్లా ఒప్పందం ద్వారా  ఇతరుల జోక్యం లేకుండా భారత్, -పాకిస్థాన్ మ‌‌‌‌‌‌‌‌ధ్య  సమస్యలను ద్వైపాక్షిక చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలనే సూత్రానికి ఆమె ప్రాధాన్యత ఇచ్చారు.

ఆర్థిక వ్యవస్థలో సామాన్యులకు భాగస్వామ్యం

ఆర్థిక వ్యవస్థలో సామాన్యులకు భాగస్వామ్యం కల్పించాలనే లక్ష్యంగా ఎంతో సాహసంతో 1969 జులై 19న దేశంలోని 14 ప్రధాన వాణిజ్య బ్యాంకులను జాతీయం చేశారు. అప్పటివరకు కొద్దిమందికే పరిమితమైన బ్యాంకింగ్ సేవలను గ్రామీణ ప్రాంతాలకు, పేదలకు చేరువ చేయడంలో ఈ నిర్ణయం కీలక పాత్ర పోషించింది. 1969లో దేశవ్యాప్తంగా 8,262 బ్యాంకు శాఖలు ఉండగా, 1979 నాటికి ఆ సంఖ్య 30,202కు చేరడం ఈ మార్పునకు నిదర్శనం. ‘గరీబీ హటావో’ నినాదంతో పేదరిక నిర్మూలనను ప్రధాన రాజకీయ లక్ష్యంగా ముందుకు తీసుకెళ్లారు. 

హరిత విప్లవానికి ప్రోత్సాహం అందించి ఆహార ధాన్యాల ఉత్పత్తిలో దేశం స్వయంసమృద్ధి సాధించేందుకు కృషి చేసిన ఆమెను ప్రభుత్వం అత్యున్నతమైన భారత రత్న పురస్కారంతో గౌరవించింది. 1974లో  పోఖ్రాన్‌‌‌‌‌‌‌‌లో తొలి అణు పరీక్ష నిర్వహించడం ద్వారా భారత శాస్త్ర, సాంకేతిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటారు. దేశ భద్రత, ఆర్థిక స్వావలంబన, పేదల సంక్షేమం, అంతర్జాతీయ స్థాయిలో భారత గౌరవాన్ని పెంపొందించేందుకు ఆమె చేసిన కృషి చరిత్రలో ప్రత్యేకంగా నిలిచింది. ఆమె 1984 అక్టోబర్ 31న దురదృష్టవశాత్తు హత్యకు గురయ్యారు. ‘దేశసేవలో  నా  ప్రాణాలు  పోయినా గర్విస్తాను. నా రక్తంలోని ప్రతి బిందువూ దేశాన్ని బలోపేతం చేయడానికి దోహదపడుతుంది’ అని చెప్పిన ఇందిరా గాంధీ దేశం కోసం ప్రాణాలు అర్పించిన నాయకురాలిగా కోట్లాదిమంది ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

ఇందిరా గాంధీ ఆశయాలకు అనుగుణంగా...

 ఇందిరాగాంధీ ఆశయాలకు అనుగుణంగా పేదల సంక్షేమం, సామాజిక న్యాయం, మహిళా సాధికారతకు ప్రాధాన్యతిస్తూ తెలంగాణలో రేవంత్ రెడ్డి నేతృత్వంలో  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌  ప్రభుత్వం ‘ఇందిరమ్మ రాజ్యం’ అందిస్తోంది. అట్టడుగు వర్గాలకు సంక్షేమ ఫలాలు అందించడం, పేదలకు గౌరవప్రదమైన జీవితం కల్పించడం, మహిళల ఆర్థిక బలోపేతం దిశగా ప్రభుత్వం కృషి చేస్తోంది.  ఇందిరమ్మ ఇండ్ల పథకంలో పేదలకు ఇళ్ల నిర్మాణం కోసం రూ.5 లక్షల ఆర్థిక సాయం అందిస్తోంది. భూమిలేని  వ్యవసాయ కూలీ కుటుంబాలకు ఏడాదికి రూ.12 వేల చొప్పున అందించే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం గ్రామీణ పేదలకు అండగా నిలుస్తోంది. 

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసి, వారిని వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం ‘ఇందిరా మహిళా శక్తి’ విధానాన్ని అమలుచేస్తోంది. రాష్ట్రంలో సుమారు 63 లక్షల స్వయం సహాయక సంఘాల మహిళలకు బ్యాంకుల ద్వారా ఐదేళ్లలో రూ.లక్ష కోట్ల రుణ అనుసంధానం కల్పించడంతోపాటు, నైపుణ్యాభివృద్ధి, మార్కెటింగ్, చిన్న పరిశ్రమల ఏర్పాటుకు ప్రోత్సాహం అందిస్తోంది. మహిళలు స్వయం ఉపాధి పొందుతూ ఆర్థికంగా ఎదిగేలా ఈ కార్యక్రమం తోడ్పడుతోంది. 

పేద మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ‘ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం’ను కూడా ప్రభుత్వం చేపట్టింది. మహిళలకు చీరలు పంపిణీ చేస్తోంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రూ.500కే గ్యాస్ సిలిండర్ అందించే మహాలక్ష్మి పథకం, మహిళా సంఘాల భాగస్వామ్యంతో పాఠశాలల నిర్వహణ కార్యక్రమాలు మహిళా ఆర్థిక, సామాజిక అభివృద్ధికి తోడ్పడుతున్నాయి. 

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం

ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక సామాజిక భద్రతా పథకానికి శ్రీకారం చుడుతూ 2026 నవంబర్ 19న సిద్దిపేటలో ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం’ ప్రారంభిస్తుంది. రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా రక్షణ కల్పించాలన్నది ఈ పథకం ప్రధాన లక్ష్యం. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని కుటుంబాలకు ఈ బీమా సౌకర్యాన్ని అందించాలని ప్రభుత్వం సంకల్పించింది. 

ఈ పథకానికి సంబంధించిన బీమా ప్రీమియం మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించనుంది. ఈ పథకం అమలుకు 2026-–27 బడ్జెట్‌‌‌‌‌‌‌‌లో ప్రభుత్వం రూ.4,000 కోట్ల నిధులను ప్రతిపాదించింది. నవంబర్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో లబ్ధిదారుల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 20 నుంచి 30వ తేదీ వరకు గ్రామాల్లో ఇందిరమ్మ కమిటీలు ఇంటింటికీ వెళ్లి దరఖాస్తులు సేకరిస్తాయి. కుటుంబంలో సంపాదించే వ్యక్తిని కోల్పోయినప్పుడు ఆ కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా రూ.5 లక్షల ఆర్థిక భరోసా కల్పించడం, ప్రతి ఇంటికీ సామాజిక భద్రతను అందించడమే ఈ పథకం వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం. 

పేదల జీవితాల్లో వెలుగులు

‘ఇందిరమ్మ స్ఫూర్తి.. మహిళా శక్తికి ప్రేరణ. ఇందిరమ్మ రాజ్యం.. పేదల సంక్షేమానికి చిరునామా’ స్ఫూర్తితో పాలిస్తున్న తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. ఇందిరాగాంధీ పేరు పేదల ఆశలకు, మహిళల ఆత్మగౌరవానికి, దేశ ఆత్మవిశ్వాసానికి ప్రతీక. ఇందిరా గాంధీ స్ఫూర్తితో పేదల జీవితాల్లో వెలుగులు నింపడం, అణగారిన వర్గాలకు అండగా నిలవడం, మహిళలు తమ కాళ్లపై తాము నిలబడేలా అవకాశాలు కల్పించడం లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పాలిస్తుండడంతో ప్రతి పేద కుటుంబం ముఖంలో చిరునవ్వు,  ప్రతి మహిళ జీవితంలో ఆర్థిక స్వావలంబన, ప్రతి నిరుపేదకు సొంత ఇల్లు సాకారమవుతోంది. తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం అంటే ప్రతి పేద కుటుంబానికి భరోసా.. ప్రతి మహిళకు ఆత్మగౌరవం.. ప్రతి నిరుపేదకు సొంత ఇంటి కల సాకారం కావడం. ఇదే ఇందిరమ్మ ఆశయం.. ఇదే ప్రజా సంక్షేమ పాలనకు నిజమైన అర్థం! 

- బి.మహేశ్ కుమార్ గౌడ్,
ఎమ్మెల్సీ, టీపీసీసీ అధ్యక్షుడు