- యూఎస్ వడ్డీ రేట్ల పెంపు అంచనాలతో తగ్గుముఖం
- డాలర్ బలపడటంతో పెట్టుబడిదారుల అమ్మకాలు
- రూ.1.85 లక్షలకు దిగొచ్చిన కేజీ వెండి
న్యూఢిల్లీ: గత కొన్ని నెలలుగా పడుతూ వస్తున్న బంగారం ధరలు, బుధవారం 14 నెలల కనిష్టాన్ని నమోదు చేశాయి. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచే అవకాశం ఉందన్న అంచనాలకు తోడు, డాలర్ బలపడటం, అమెరికా బాండ్ ఈల్డ్స్ 5 శాతం పైన కొనసాగడం పసిడిపై తీవ్ర ఒత్తిడి పెంచాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర బుధవారం రూ. 2,780 తగ్గి రూ. 1,33,260 కి చేరింది.
కిందటేడాది సెప్టెంబర్ తర్వాత ఇదే కనిష్ట స్థాయి. అంతర్జాతీయ స్పాట్ మార్కెట్‌లో ఔన్సు (దాదాపు 28 గ్రాముల) బంగారం ధర 3,773 డాలర్ల స్థాయికి దిగొచ్చింది. ఈ ఏడాది జనవరిలో గోల్డ్ ధరలు 10 గ్రాములకు రూ.1.80 లక్షల దగ్గర ఆల్ టైమ్ హై నమోదు చేసింది. ప్రస్తుతం రూ.1.33 లక్షల నుంచి రూ.1.37 లక్షలు పలుకుతోంది. ఇది దాదాపు 23 శాతం తగ్గుదల.
ధరల పతనానికి గల కారణాలు..
అమెరికాలో ద్రవ్యోల్బణం పెరుగుతుండడంతో డిసెంబర్‌లో ఫెడ్ వడ్డీ రేట్లను పెంచవచ్చని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. వడ్డీ ఆదాయం ఇవ్వని బంగారం కంటే అధిక రాబడినిచ్చే బాండ్ల వైపు ఇన్వెస్టర్లు మొగ్గు చూపుతున్నారు. దీంతో పాటు డాలర్ విలువ పెరగడం వల్ల ఇతర దేశాల కరెన్సీలలో బంగారం కొనుగోలు ఖరీదుగా మారింది. గ్లోబల్‌గా డిమాండ్ తగ్గింది.
భారత మార్కెట్‌పై ప్రభావం
అంతర్జాతీయ మార్కెట్ ప్రభావంతో దేశీయంగానూ బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ ధర బుధవారం హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో రూ.1.33 లక్షలు ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 2,540 తగ్గి రూ. 1,22,160 వద్ద నమోదైంది. నవంబర్ 5న రూ. 1.46 లక్షలు పలికిన 24 క్యారెట్ల బంగారం కేవలం రెండు వారాల్లోనే దాదాపు రూ. 12,700 మేర తగ్గడం విశేషం.
పెళ్లిళ్ల సీజన్‌లో శుభవార్త
పెళ్లిళ్లు, శుభకార్యాల సీజన్ వేళ ధరలు దిగిరావడం సామాన్య ఆభరణాల కొనుగోలుదారులకు పెద్ద ఊరటనిస్తోంది. అయితే అంతర్జాతీయ ధరలతో పోలిస్తే దేశీయంగా జీఎస్టీ, దిగుమతి సుంకాలు, రూపాయి మారకం విలువ ప్రభావం వల్ల తగ్గుదల కొంత భిన్నంగా ఉండవచ్చు. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ (డబ్ల్యూజీసీ) అంచనాల ప్రకారం, ఈ ఏడాది ధంతేరాస్–దీపావళి టైమ్‌లో గోల్డ్ నగల అమ్మకాల విలువ కిందటేడాదితో పోలిస్తే 15–25 శాతం పెరిగాయి. మరోవైపు, బుధవారం రాత్రి విడుదలయ్యే అమెరికా ఫెడ్ సమావేశపు మినిట్స్, ముడి చమురు ధరల కదలికల నేపథ్యంలో స్వల్పకాలంలో మరిన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.
వెండి@ రూ. 1.85 లక్షలు
బంగారంతో పాటు వెండి ధరలు కూడా భారీగా పతనమై ఏడాది కనిష్ట స్థాయికి చేరాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో బుధవారం స్పాట్ వెండి ధర దాదాపు 3 శాతం మేర క్షీణించి ఔన్సుకు 45.65 – 46 డాలర్ల స్థాయికి పడింది. ఈ ప్రభావంతో దేశీయ మార్కెట్‌లోనూ కిలో వెండి ధర రూ. 1.85లక్షలకు దిగొచ్చింది. నవంబర్ 5 నుంచి ఇప్పటివరకు కేవలం రెండు వారాల్లోనే కిలో వెండి ధర దాదాపు రూ. 25 వేల (13శాతం) మేర ధర తగ్గింది. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెంచుతుందనే భయాలతోనే వెండి ధరలు కూడా తగ్గుతున్నాయి.
దీనికి తోడు అమెరికా డాలర్ 19 నెలల గరిష్టానికి చేరడం, 10 ఏళ్ల బాండ్ ఈల్డ్స్ 5 శాతం పైన కొనసాగడం, సోలార్ ప్యానెల్స్ తయారీ, ఆభరణాల రంగంలో వెండి వినియోగం తగ్గడం కూడా ధరలపై ఒత్తిడి పెంచింది. ఈ ఏడాది జనవరిలో కిలో రూ. 4.20 లక్షల రికార్డు స్థాయిని తాకిన వెండి, అప్పటినుంచి ఇప్పటివరకు దాదాపు 55శాతం మేర విలువ కోల్పోయింది. పెళ్లిళ్ల సీజన్‌లో ధరలు తగ్గడం కొనుగోలుదారులకు ఊరటనిస్తుండగా, స్వల్పకాలంలో మరిన్ని ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
