సీఎం సభకు అంతా సిద్ధం..ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రులు వివేక్, దామోదర్, పొన్నం

సీఎం సభకు అంతా సిద్ధం..ఏర్పాట్లు పర్యవేక్షించిన మంత్రులు వివేక్, దామోదర్, పొన్నం

మెదక్​/సిద్దిపేట రూరల్​/టౌన్, వెలుగు:సీఎం రేవంత్​రెడ్డి సిద్దిపేట పర్యటనకు అంతా సిద్ధమైంది. సభకు ఇప్పటికే అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. నాగదేవత గుడి దగ్గర విశాలమైన స్థలాన్ని చదును చేసి, భారీ స్టేజ్​ నిర్మించారు. వీఐపీలకు, ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, ప్రజలకు వేర్వేరుగా గ్యాలరీలు ఏర్పాటు చేశారు. సభావేదికతో పాటు ప్రాంగణమంతా ప్రత్యేక లైటింగ్ పెట్టారు. పట్టణమంతటా భారీ స్థాయిలో ఫ్లెక్సీలతో అలంకరించారు. 

ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు జరగకుండా భారీఎత్తున బందోబస్తు నిర్వహిస్తున్నారు. కలెక్టరేట్​దగ్గర హెలిప్యాడ్ వద్ద, సీఎం కాన్వాయ్​ ప్రయాణించే మార్గం, బహిరంగ సభాస్థలి వద్ద పోలీసు బలగాలను మోహరిస్తున్నారు. మంత్రులు వివేక్​ వెంకటస్వామి, దామోదర్ రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావ్​ తదితరులు బుధవారం సభాస్థలి దగ్గర ఏర్పాట్లు పరిశీలించారు. సభకు వచ్చే వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రులు అధికారులను ఆదేశించారు. 

ముస్తాబాద్ చౌరస్తాలో ఇందిరా గాంధీ విగ్రహానికి నివాళి

సీఎం రేవంత్ రెడ్డి హెలికాప్టర్​లో హైదరాబాద్​ నుంచి సాయంత్రం 4 గంటలకు ఇంటిగ్రేటెడ్​ కలెక్టరేట్ వద్ద ల్యాండ్​ అవుతారు. అక్కడి నుంచి కారులో బీజేఆర్ చౌరస్తా, కొత్త బస్టాండ్, పాత బస్టాండ్, విక్టరీ టాకీస్ చౌరస్తా మీదుగా ముస్తాబాద్ చౌరస్తా వరకు ర్యాలీగా వస్తారు. ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. అక్కడి నుంచి కాంగ్రెస్​ కార్యకర్తలతో కలిసి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న సభాస్థలానికి పాదయాత్రగా చేరుకుంటారు. 

ముగ్గురు మంత్రుల స్పెషల్ ఫోకస్ 

బీఆర్ఎస్ కు పట్టున్న సిద్దిపేటలో సభను కాంగ్రెస్​ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలకు ప్రజల ఆదరణ ఉందని, సిద్దిపేటలో పార్టీ బలపడిందన్న సంకేతాలిచ్చేందుకు భారీస్థాయిలో జస సమీకరణ మీద దృష్టి పెట్టింది. సీఎం సభను విజయవంతం చేయడంపై మంత్రులు వివేక్ వెంకట స్వామి, పొన్నం ప్రభాకర్​, దామోదర్ రాజనర్సింహ, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్​ఫోకస్ పెట్టారు. సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి, జనగామ, కరీంనగర్, కామారెడ్డి, సిరిసిల్ల జిల్లాల నుంచి జనాన్ని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. ఆయా జిల్లాల ఎమ్మెల్యేలు, డీసీసీ అధ్యక్షులు, ముఖ్య నేతలతో జనసమీకరణపై ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. మండలాల వారీగా నాయకులకు బాధ్యతలు అప్పగించారు.