ఏపీ ఎన్నికలు: 50 ఏళ్ళ తర్వాత పోలింగ్.. సుండిపెంట పంచాయితీ ఎన్నికలపై ఉత్కంఠ..!

ఏపీ ఎన్నికలు: 50 ఏళ్ళ తర్వాత పోలింగ్.. సుండిపెంట పంచాయితీ ఎన్నికలపై ఉత్కంఠ..!

ఏపీలో స్థానిక ఎన్నికల పర్వం నడుస్తున్న సంగతి తెలిసిందే. మున్సిపాలిటీ, పరిషద్ ఎన్నికలు ముగిసిన క్రమంలో ఇప్పుడు పంచాయితీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. ఈ ఎన్నికలకు సంబంధించి అక్కడక్కడా ఉద్రిక్తతలు నెలకొన్న క్రమంలో ఓ గ్రామ పంచాయితీ ఎన్నికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఆ పంచాయితీలో 50 ఏళ్ళ తర్వాత ఎన్నిక జరుగుతుండటమే ఇందుకు కారణం. అదే.. నంద్యాల జిల్లాలోని సుండిపెంట గ్రామ పంచాయితీ. 

ఇన్నాళ్లూ ఎన్నికలకు నోచుకోని సుండిపెంట గ్రామానికి ఎట్టకేలకు గ్రామపంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. సుమారు 21వేల 600 మంది జనాభా, 14,668 మంది ఓటర్లు ఉన్న ఈ గ్రామంలో ఎన్నికల సందడి మొదలుకానుందన్న సమయంలో కొత్త వివాదం తెరపైకి వచ్చింది.

గ్రామం ఇరిగేషన్, అటవీ భూముల్లో ఉండటంతో ఎన్నికల నిర్వహణపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు రాజకీయ పార్టీలు ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు చేస్తుండగా, హైకోర్టును ఆశ్రయించిన కాంట్రాక్టు వర్కర్స్ ఎంప్లాయిస్ యూనియన్ పిటిషన్‌తో ఎన్నికలపై ఉత్కంఠ నెలకొంది. 

శ్రీశైలం ప్రాజెక్టుతో మొదలైన సున్నిపెంట ప్రస్థానం కృష్ణమ్మ ఒడ్డున నిర్మించిన శ్రీశైలం ప్రాజెక్టు.. వేలాది కుటుంబాల జీవితాల్లో కొత్త మార్పులకు నాంది పలికింది. 1963లో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయగా.. నిర్మాణం పూర్తయ్యేందుకు దాదాపు రెండు దశాబ్దాల సమయం పట్టింది. ఈ క్రమంలో 1960, 70 దశకాలలో అప్పటి ఉమ్మడి కర్నూలు, ప్రకాశం, మహబూబ్‌నగర్, గుంటూరు జిల్లాలకు చెందిన అనేక కుటుంబాలు ఉపాధి కోసం సున్నిపెంటకు వలస వచ్చాయి. క్రమంగా అక్కడే స్థిరనివాసాలు ఏర్పాటు చేసుకున్నారు. అలా చిన్న నివాస ప్రాంతంగా మొదలైన సున్నిపెంట.. కాలక్రమంలో పెద్ద గ్రామంగా విస్తరించింది.

సుండిపెంట గ్రామం 50 ఏళ్లుగా ఎన్నికలకు దూరంగా ఉండటానికి కారణం గ్రామం సుమారు 1500 ఎకరాల్లో ఇరిగేషన్, అటవీ భూముల్లో ఉండటమే. రెవెన్యూ పరిధిలోకి పూర్తిస్థాయిలో రాకపోవడంతో గ్రామానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడం సాధ్యం కాలేదు. 

ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీశైలం మండల కేంద్రంగా సుండిపెంట కొనసాగుతున్నప్పటికీ.. గ్రామస్థులకు స్థానిక పాలనలో భాగస్వామ్యం దక్కలేదు. కేవలం సార్వత్రిక ఎన్నికల్లోనే ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి ఉండేది. 2006లో ప్రభుత్వం సుండిపెంటను గ్రామపంచాయతీగా గుర్తించినప్పటికీ.. భూముల సమస్య కారణంగా ఎన్నికల నిర్వహణకు అడ్డంకులు తొలగలేదు.

అటవీ భూములకు ఫెన్సింగ్.. పంచాయతీ ఎన్నికలకు మార్గం

సుండిపెంటలో అటవీ, ఇరిగేషన్ భూములు ఉండటంతో.. అటవీ సంపద అన్యాక్రాంతం కాకుండా అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టింది ప్రభుత్వం. 2019-20లో అటవీ భూములకు ఫెన్సింగ్ ఏర్పాటు చేసి.. అటవీ భూముల పరిరక్షణతో పాటు పంచాయతీకి సంబంధించిన ప్రక్రియను ముందుకు తీసుకెళ్లింది అప్పటి ప్రభుత్వం. అటవీ సంబంధిత క్లియరెన్స్‌లను కూడా పొందినట్లు అధికారులు చెబుతున్నారు. ఇటీవల కోర్టు ఆదేశాల నేపథ్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ గెజిట్ జారీ చేయడంతో సున్నిపెంటలో ఎన్నికల నిర్వహణకు మార్గం సుగమమైంది. దాదాపు ఐదు దశాబ్దాల నిరీక్షణకు తెరపడుతుందని గ్రామస్థులు ఆశలు పెట్టుకున్నారు.

అయితే.. సుండిపెంటలో ఏకగ్రీవం కోసం రాజకీయ ప్రయత్నాలు జోరుగా సాగుతున్నాయి.. శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఎన్నికలను ఏకగ్రీవం చేసుకునే దిశగా అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించారు. అయితే ఈ సమావేశానికి వైసీపీ నేతలు హాజరుకాకపోవడంతో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఏకగ్రీవం దిశగా సాగాల్సిన ప్రయత్నాలకు బ్రేక్ పడిందా.. లేక నేరుగా ఎన్నికల పోరు తప్పదా.. అన్న చర్చ జరుగుతోంది.