- హాజరుశాతం, విద్యార్థుల ఏకాగ్రత మెరుగుపడుతుంది
- ఏటీసీ కేంద్రాల ద్వారా యువతకు నైపుణ్యాభివృద్ది శిక్షణ
- కోటపల్లి తెలంగాణ మోడల్ స్కూల్లో బ్రేక్‌ఫాస్ట్ స్కీమ్ ప్రారంభం
- కన్నెపల్లి నుంచి సంకారం వరకు బీటీ రోడ్డును ప్రారంభించిన మంత్రి
కోల్‌బెల్ట్/కోటపల్లి/చెన్నూరు, వెలుగు: ప్రభుత్వ స్కూళ్లలో చదువుకుంటున్న పేద విద్యార్థులకు పౌష్టికాహారాన్ని అందించేందుకు సీఎం బ్రేక్‌ఫాస్ట్ పథకం ప్రారంభించినట్టు రాష్ట్ర కార్మిక, గనులశాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు. విద్యా ప్రమాణాలు, హాజరు శాతం, చదువుపై ఏకాగ్రత పెంచడానికి సర్కార్ఈ స్కీమ్ తీసుకొచ్చిందని చెప్పారు. బుధవారం మంచిర్యాల జిల్లా కోటపల్లి, చెన్నూరు మండలాలు, చెన్నూరు పట్టణంలో మంత్రి పర్యటించారు. కోటపల్లి మోడల్ స్కూల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన మంత్రి విద్యార్థులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు.
పాఠశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన ల్యాబ్ గదిని ప్రారంభించారు. చెన్నూర్ మండలం కన్నెపల్లి నుంచి సంకారం వరకు రూ.90 లక్షల వ్యయంతో పునరుద్ధరించిన బీటీ రోడ్డును ప్రారంభించారు. సంకారంలో ప్రభుత్వ ప్రైమరీ స్కూల్లో విద్యార్థుల కోసం బెంచీలను అందజేశారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించాలన్న ఉద్దేశంతో విద్యారంగానికి సీఎం రేవంత్‌రెడ్డి భారీగా నిధులు కేటాయిస్తున్నారని మంత్రి వివేక్ పేర్కొన్నారు. పేద పిలల్లకు బ్రేక్‌ఫాస్ట్ పథకం మేలు చేస్తుందని, వారు మంచి ఆహారం తీసుకోవడంవల్ల ఉత్సాహంగా చదువుకోవడానికి, క్రీడలు, ఇతర సాంస్కృతిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొనేందుకు చాన్స్ ఉంటుందని వివరించారు. రాష్ట్రంలో 20 లక్షల మంది విద్యార్థులకు ఈ పథకం ద్వారా ప్రయోజనం చేకూరుతుందని వెల్లడించారు. మంచిర్యాల జిల్లాలో సుమారు 35 వేల మందికి, చెన్నూర్ నియోజకవర్గంలో సుమారు 12 వేల మంది విద్యార్థులకు అల్పాహారం అందిస్తున్నామని తెలిపారు.
డిస్టింక్షన్ ఫలితాలు సాధిస్తే స్కూళ్లకు స్పెషల్ గిఫ్ట్
కోటపల్లి మోడల్స్కూల్విద్యార్థులు100 శాతం డిస్టింక్షన్ ఫలితాలు సాధిస్తే పాఠశాలకు స్పెషల్గిఫ్ట్ అందజేస్తానని మంత్రి వివేక్‌వెంకటస్వామి చెప్పారు. స్కూలులో డైనింగ్ హాల్ నిర్మాణానికి డీఎంఎఫ్టీ నిధుల నుంచి రూ.40 లక్షలు మంజూరు చేస్తున్నట్టు పేర్కొన్నారు. చెన్నూరు డిగ్రీ కాలేజీకి రూ.2 కోట్లు, జూనియర్ కాలేజీకి రూ.1.50 కోట్లు నిధులు కేటాయించినట్టు వివరించారు. కోటపల్లిలో రూ.90 లక్షలతో ఎస్సీ హాస్టల్ నిర్మాణం చేపడుతామని, చెన్నూర్ మండలం సోమనపల్లిలో రూ.200కోట్లతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ వచ్చే ఏడాది ప్రారంభిస్తామని వెల్లడించారు.
యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సుమారు రూ.4 వేల కోట్లతో అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నామన్నారు. యువతకు నైపుణ్య శిక్షణ అందించి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ పి. చంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ పురాణం సతీశ్‌కుమార్, మార్కెట్ కమిటీ చైర్మన్ మహేశ్ తివారి, ఏసీపీ వెంకటేశ్వర్లు, సీఐ కృష్ణ, కోటపల్లి తహసీల్దార్ రాఘవేంద్ర, ఎంపీడీవో నాగేశ్వరరెడ్డి, సర్పంచ్ సంపత్ తదితరులు పాల్గొన్నారు.
చెన్నూరు వార్డుల్లో మంత్రి మార్నింగ్ వాక్
చెన్నూరు పట్టణంలో మార్నింగ్ వాక్‌లో భాగంగా పలు వార్డుల్లో మంత్రి వివేక్ వెంకటస్వామి ప్రజల సమస్యలు అడిగితెలుసుకున్నారు. సమస్యలు పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఖబరస్తాన్ స్థలాన్ని పరిశీలించి, పనుల గురించి అధికారులతో మాట్లాడారు. ఇటీవల మృతి చెందిన కదారి సుజాత కుటుంబాన్ని పరామర్శించారు.
అర్హులందరికీ చేయూత పింఛన్
మెదక్/గుమ్మడిదల, వెలుగు: అర్హులైన ప్రతి ఒక్కరికీ చేయూత పింఛన్లు అందించి పేదలకు సామాజిక భద్రత కల్పిస్తున్నట్టు మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. బుధవారం సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలో చేయూత పింఛన్ల మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేదల సంక్షేమం, ప్రజల ఆరోగ్యం, నాణ్యమైన విద్య, మహిళా సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని తెలిపారు.
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మహిళలు అభివృద్ధి చెందితే కుటుంబాలు, సమాజం అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్, మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ నీలం మధు ముదిరాజ్, పటాన్ చెరు ఇన్చార్జ్ కాట శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు.
