హైదరాబాద్, వెలుగు: ఉమ్మడి ఏపీలో 2014 కంటే ముందు ఇందిరమ్మ సహా ప్రభుత్వ గృహ నిర్మాణ పథకాల కింద ఇండ్లు కట్టుకున్న లబ్ధిదారులకు ప్రభుత్వం వద్దే ఉండిపోయిన ఇండ్ల పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను వెంటనే తిరిగి వెనక్కి ఇచ్చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా ఏకంగా 7 లక్షల కుటుంబాలకు ప్రయోజనం చేకూరనుందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి బుధవారం ఒక ప్రకటన రిలీజ్ చేశారు.
2014కు ముందు అమలైన నిబంధనల ప్రకారం.. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ సబ్సిడీ, లబ్ధిదారుల వాటాతో పాటు బ్యాంకు రుణాల ద్వారా ఆర్థిక సహాయం అందించేవారని, ఆ రుణాలకు సెక్యూరిటీగా పేదల ఇండ్ల పట్టాలను అధికారులు తనఖా పెట్టుకున్నారని పొంగులేటి గుర్తు చేశారు. అయితే, రుణ వాయిదాలు పూర్తయిన తర్వాత పట్టాలను తిరిగివ్వాల్సి ఉండగా, 2014లో రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వం ఇందిరమ్మ పథకాన్ని నిలిపివేయడంతో ఈ పట్టాలు తహశీల్దార్ కార్యాలయాల్లోనే మూలనపడి లబ్ధిదారులకు చేరకుండా పోయాయి.
ఇటీవల రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ల నిషేధిత జాబితా అయిన 22ఏపై ఉన్నత స్థాయి సమీక్షలు నిర్వహిస్తున్న సమయంలో.. వేలాది పట్టా పత్రాలు తహశీల్దార్ ఆఫీసుల్లోనే పేరుకుపోయిన వైనం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వచ్చిందన్నారు. దీనిపై పేదల నుంచి కూడా పెద్దఎత్తున వినతులు రావడంతో, వాటిని వెంటనే లబ్ధిదారులకే వాపస్ చేయాలని సీఎం ఆదేశించారు.
