తెలంగాణలో పెట్టుబడులు ..ఎందుకు పెట్టాలంటే?

తెలంగాణలో పెట్టుబడులు ..ఎందుకు పెట్టాలంటే?
  • కంపెనీల ఏర్పాటుకు 45 వేల ఎకరాల ల్యాండ్ బ్యాంక్
  • 15 రోజుల్లోనే ‘సింగిల్​ విండో’ ద్వారా అనుమతులు
  • 24 గంటలపాటు కరెంట్.. ప్రపంచంతో కనెక్టివిటీ
  • 500కుపైగా జీసీసీలు.. టెక్ దిగ్గజాల క్యాంపస్‌‌‌‌లు
  • ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు ఇక్కడే తయారీ
  • జీవన నాణ్యతలో నంబర్ వన్ ప్లేస్​లో హైదరాబాద్
  • ‘వై తెలంగాణ’ పేరుతో ఇన్వెస్టర్లకు సర్కారు రోడ్‌‌‌‌మ్యాప్

హైదరాబాద్, వెలుగు: ఇండియాలో అడుగుపెట్టాలనుకునే అంతర్జాతీయ కంపెనీలు, ఇన్వెస్టర్లు ‘పెట్టుబడులకు తెలంగాణనే ఎందుకు ఎంచుకోవాలి?’ (వై తెలంగాణ?) అనే ప్రశ్నకు రాష్ట్ర ప్రభుత్వం గణాంకాలు, ఆధారాలతో రోడ్‌‌ మ్యాప్ సిద్ధం చేసింది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు జరిగే ‘ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026’ నేపథ్యంలో రూపొందించిన ఇన్వెస్ట్ పేపర్‌‌లో తెలంగాణ ప్రత్యేకతలను ప్రపంచం ముందుంచింది. 

వ్యాపారం విజయవంతం కావడానికి కావాల్సిన గ్లోబల్ టాలెంట్, ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్, భారీ మౌలిక వసతులు, నిర్ణయాలను వెంటనే అమలు చేసే సమర్థ ప్రభుత్వం అన్నీ తెలంగాణలోనే ఉన్నాయని పేర్కొంది. 2025–26లో రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్‌‌డీపీ) 188.7 బిలియన్ డాలర్లకు (దాదాపు రూ.16 లక్షల కోట్లు) చేరి దేశ జీడీపీలో 5 శాతం వాటా అందిస్తోందని, జాతీయ వృద్ధి రేటు 8.6 శాతం ఉంటే తెలంగాణ 10.75 శాతం వృద్ధితో దూసుకుపోతోందని వివరించింది. 

తలసరి ఆదాయం దేశ సగటు కంటే 1.9 రెట్లు ఎక్కువగా ఉండటం, ఐటీ ఎగుమతులు 33.1 బిలియన్ డాలర్లకు, టీజీ–ఐపాస్ పెట్టుబడులు 22.7 బిలియన్ డాలర్లకు చేరడం రాష్ట్ర ఆర్థిక బలానికి నిదర్శనమని పేర్కొంది. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను 2034 నాటికి ట్రిలియన్ డాలర్లకు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్లకు (దాదాపు రూ.250 లక్షల కోట్లు) చేర్చడమే లక్ష్యంగా పెట్టుబడిదారులను ఆహ్వానిస్తోంది.

భారీ ల్యాండ్ బ్యాంక్

పరిశ్రమల కోసం జహీరాబాద్‌‌లో 15,570 ఎకరాలు, ఫ్యూచర్ సిటీలో 14 వేల ఎకరాలు, ఆదిలాబాద్‌‌లో 7,785 ఎకరాలు సహా భారీ ల్యాండ్ బ్యాంక్ అందుబాటులో ఉంది. 24 గిగావాట్ల కాంట్రాక్ట్ విద్యుత్‌‌ను 24 గంటలూ సరఫరా చేస్తుండగా, రాబోయే పదేండ్లలో మరో 25 గిగావాట్ల గ్రీన్ ఎనర్జీ జత చేయనున్నారు. 158 కిలోమీటర్ల ఓఆర్ఆర్ లోపల ‘క్యూర్’, ఓఆర్ఆర్ నుంచి 354 కిలోమీటర్ల ట్రిపుల్ ఆర్ మధ్య 10 వేల చదరపు కిలోమీటర్లలో ‘ప్యూర్’, ట్రిపుల్ ఆర్ వెలుపల ‘రేర్’ అనే మూడంచెల నమూనా అమలవుతోంది.

 శంషాబాద్ ఎయిర్‌‌పోర్ట్ 74 దేశీయ, 26 అంతర్జాతీయ నగరాలకు నేరుగా కనెక్ట్ అయి ఉండగా, ముంబై జేఎన్‌‌పీటీ పోర్టుకు 12 గంటల్లో, చెన్నై పోర్టుకు 9 గంటల్లో చేరుకునేలా హైవేలు, సరుకు రవాణా కారిడార్లు ఉన్నాయి. 14 ఫుడ్ ప్రాసెసింగ్ జోన్ల ద్వారా కోకాకోలా, పెప్సికో, ఐటీసీ, అమూల్ సంస్థలు 2 బిలియన్ డాలర్ల ఎగుమతులు చేస్తుండగా, వరంగల్ మెగా టెక్స్‌‌టైల్ పార్కులో కిటెక్స్, వెల్‌‌స్పన్, యంగ్‌‌వన్ సంస్థలు లక్ష మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

15 రోజుల్లోనే అనుమతులు

విధానాలు రూపొందించడమే కాదు, వాటిని వేగంగా అమలు చేయడమే తెలంగాణ అతిపెద్ద బలమని నివేదిక పేర్కొంది. పెట్టుబడి నిర్ణయం తీసుకున్న నాటి నుంచి 16 నెలల్లోనే భూమి, అనుమతులు, నిర్మాణం పూర్తి చేసి ఉత్పత్తి మొదలుపెట్టేలా ప్రభుత్వం భాగస్వామిగా సహకరిస్తుంది. టీజీ–ఐపాస్ ద్వారా మెగా ప్రాజెక్టులకు దరఖాస్తు చేసిన 15 రోజుల్లోనే సింగిల్ విండోలో అన్ని అనుమతులు ఇస్తున్నామని, దాదాపు 98 శాతం దరఖాస్తులకు గడువులోనే అనుమతులిచ్చామని ప్రభుత్వం తెలిపింది. లైఫ్ సైన్సెస్ (2026–30), క్లీన్ ఎనర్జీ (2025), ఎంఎస్ఎంఈ (2024), ఈవీ, ఎలక్ట్రానిక్స్, టూరిజం రంగాలకు ప్రత్యేక పాలసీలతో రాయితీలు అందిస్తోంది.

జీవన నాణ్యతలో నంబర్ వన్

మెర్సర్ సర్వేలో వరుసగా ఆరేండ్లుగా దేశంలోనే అత్యుత్తమ జీవన నాణ్యత ఉన్న నగరంగా హైదరాబాద్ నిలిచింది. అనుకూల వాతావరణం, తక్కువ జీవన వ్యయం (ఇండెక్స్ 21.7), మంచి శాంతిభద్రతలు ప్రపంచ సంస్థలను ఆకర్షిస్తున్నాయి. రాష్ట్రంలో 11 లక్షల మంది ఉన్నత విద్యార్థులు ఉండగా, టాస్క్ ద్వారా 800 కాలేజీల్లో నైపుణ్య శిక్షణ అందుతోంది. ఐఎస్‌‌బీ (గ్లోబల్ ర్యాంక్ 12), ఐఐటీ హైదరాబాద్, ట్రిపుల్ ఐటీ, నల్సార్, బిట్స్ పిలానీ వంటి విద్యాసంస్థలు ఇక్కడే ఉన్నాయి. 

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ద్వారా మైక్రోసాఫ్ట్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్ సహా 20కి పైగా సంస్థల భాగస్వామ్యంతో పరిశ్రమలకు తగ్గ కోర్సులు నడుస్తున్నాయి. టాటా టెక్నాలజీస్‌‌తో కలిసి రూ.2,400 కోట్లతో 65 ఐటీఐలను అడ్వాన్స్‌‌డ్ టెక్నాలజీ సెంటర్లుగా మార్చి ఇండస్ట్రీ 4.0 శిక్షణ ఇస్తున్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద ఇంక్యుబేటర్ టీ–హబ్, దేశంలోనే అతిపెద్ద ప్రొటోటైపింగ్ సెంటర్ టీ–వర్క్స్, మహిళా స్టార్టప్‌‌ల కోసం వీ–హబ్ (5,967 స్టార్టప్‌‌లకు చేయూత) ఇక్కడే ఉన్నాయి. 165కు పైగా ఫార్చూన్ 2000 కంపెనీలు ఇక్కడ చిన్నగా మొదలై భారీగా ఎదిగాయని నివేదిక పేర్కొంది.

ఐటీ హబ్.. జీసీసీలకు నెలవు

రాష్ట్రంలో 9.39 లక్షల మంది ఐటీ నిపుణులు పనిచేస్తుండగా, దేశంలోనే అత్యధికంగా 500కు పైగా గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లు (జీసీసీలు) ఉన్నాయి. అమెరికా బయట అమెజాన్ తన అతిపెద్ద క్యాంపస్‌‌ను 15 వేల మంది సిబ్బందితో ఇక్కడే ఏర్పాటు చేసింది. మైక్రోసాఫ్ట్, గూగుల్, మైక్రాన్ (4 వేల మంది ఇంజనీర్లు), గోల్డ్‌‌మన్ సాక్స్, పెప్సికో తమ ప్రధాన కేంద్రాలను సిటీలోనే నడుపుతున్నాయి. ఎలక్ట్రానిక్స్ తయారీలో ఈ–సిటీ, మహేశ్వరం, ఆదిభట్ల, కొంగరకలాన్‌‌తో పాటు ఫ్యూచర్ సిటీలోని 623 ఎకరాల తాడిపర్తి క్లస్టర్‌‌లో ఫాక్స్‌‌కాన్, ఏఎండీ, క్వాల్‌‌కామ్, ఇంటెల్, టెక్సాస్ ఇన్‌‌స్ట్రుమెంట్స్ విస్తరించాయి.

 డేటా సెంటర్లలో 160 మెగావాట్ల లైవ్ కెపాసిటీ ఉండగా, ముంబై తర్వాత దేశంలోనే రెండో స్థానంలో 4.7 గిగావాట్ల సామర్థ్యం నిర్మాణంలో ఉంది. రాయదుర్గంలోని ఇమేజ్ టవర్ సహా గేమింగ్ రంగంలో 140కి పైగా సంస్థలు 30 వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాయి.

ఫార్మా, ఏరోస్పేస్‌‌లో ప్రపంచ స్థాయి

80 బిలియన్ డాలర్ల లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్, 250కి పైగా యూఎస్–ఎఫ్‌‌డీఏ ఆమోదిత కేంద్రాలు ఉన్న తెలంగాణ నుంచే ప్రపంచ వ్యాక్సిన్లలో మూడో వంతు, దేశ ఫార్మా ఉత్పత్తుల్లో 40 శాతం సరఫరా అవుతున్నాయి. 18 దేశాలకు చెందిన 250కి పైగా సంస్థలతో జీనోమ్ వ్యాలీ, 1,400 మంది ఇంజనీర్లతో మెడ్‌‌ట్రానిక్ సహా మెడికల్ డివైసెస్ పార్క్ వెలుగొందుతున్నాయి. రక్షణ రంగంలో 4 ఏరోస్పేస్ పార్కులు, 1,500కు పైగా ఎంఎస్ఎంఈలు ఉండగా, ఇస్రో మార్స్ మిషన్‌‌లో 30 శాతం విడిభాగాలను ఇక్కడి పరిశ్రమలే అందించాయి. 

సాఫ్రాన్ ఏరో ఇంజిన్ ఎంఆర్‌‌వో, బోయింగ్, లాక్‌‌హీడ్ మార్టిన్, టాటా బోయింగ్‌‌తో పాటు స్కైరూట్ రాకెట్లు, ధ్రువ స్పేస్ ఉపగ్రహాలు ఇక్కడే రూపుదిద్దుకుంటున్నాయని ఇన్వెస్ట్ పేపర్ వెల్లడించింది. ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఇన్వెస్టర్లను ప్రభుత్వం ఆహ్వానించింది.