- జాతీయ రహదారి నిర్మాణంలో, నిపుణుల నిర్ణయాల్లో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు
హైదరాబాద్, వెలుగు: కల్వకుర్తి బైపాస్ రోడ్డు నిర్మాణం కోసం చేపట్టిన భూసేకరణను సవాల్ చేస్తూ దాఖలైన అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. జాతీయ రహదారుల నిర్మాణం, అలైన్‌మెంట్ నిర్ణయాలు నిపుణుల పరిధిలోని అంశాలని, వాటిలో కోర్టుల జోక్యానికి పరిమితులు ఉంటాయని స్పష్టం చేసింది. యాక్టింగ్ చీఫ్ జస్టిస్ పి.శ్యామ్ కోశి, జస్టిస్ సుద్దాల చలపతిరావులతో కూడిన డివిజన్ బెంచ్ బుధవారం ఈ తీర్పు వెలువరించింది.
నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొత్రసివార గ్రామ పరిధిలో తన ఎకరం భూమిని సేకరించడాన్ని సవాల్‌చేస్తూ తలసాని శ్రవణ్ రెడ్డి పిటిషన్ వేశారు. తుది మ్యాప్ ప్రకారం.. చైన్‌ఏజీ 76/400 నుంచి ప్రారంభం కావాల్సిన రహదారిని 76/100 నుంచి చేపట్టడం వల్ల తన భూమి సేకరించాల్సి వస్తోందని, నిబంధనలు పాటించలేదని అభ్యంతరం తెలిపారు.
అయితే, కేంద్ర మంత్రిత్వ శాఖ ఆమోదించిన మూడో అలైన్‌మెంట్ ప్రకారమే రహదారి నిర్మాణం జరుగుతోందని, పిటిషనర్ అభ్యంతరాలను అధికారులు పరిశీలించి వివరణ ఇచ్చారని ప్రభుత్వ న్యాయవాదులు వాదించారు. 2023 మార్చిలోనే సెక్షన్ 3డీ కింద తుది నోటిఫికేషన్ జారీ అయి భూమి విలీనమైందని, సెప్టెంబర్‌లో అవార్డు కూడా ప్రకటించామని తెలిపారు. ఇప్పటికే 95 శాతం పనులు పూర్తయినట్లు కోర్టుకు వివరించారు.
సుప్రీంకోర్టు తీర్పులను ప్రస్తావించిన డివిజన్ బెంచ్.. నిపుణుల నిర్ణయాలు, ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలను న్యాయస్థానాలు నిర్ణయించలేవని తేల్చిచెప్పింది. ఈ కేసులో చట్ట ఉల్లంఘన గానీ, అధికారుల దురుద్దేశాలు గానీ రుజువు కాలేదని స్పష్టం చేస్తూ అప్పీల్‌ను కొట్టివేసింది.
