హైదరాబాద్, వెలుగు: ఒయాసిస్ ఫెర్టిలిటీ క్లినిక్‌లు, ఏఆర్‌టీ బ్యాంకుల నిర్వహణలో పోలీసులు, వైద్యారోగ్యశాఖ అధికారులు జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలపై తెలంగాణ హైకోర్టు ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. సద్గురు హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌పై జస్టిస్ తంగిరాల మాధవీదేవి విచారణ చేపట్టి, ప్రతివాదులైన హోంశాఖ, వైద్యారోగ్యశాఖ అధికారులకు నోటీసులు జారీ చేస్తూ విచారణను ఈ నెల 23కు వాయిదా వేశారు.
చట్టబద్ధమైన అనుమతులతో నిర్వహిస్తున్న తమ వైద్య కేంద్రాల్లో ముందస్తు నోటీసులు లేకుండానే తనిఖీలు చేస్తూ, సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నారని పిటిషన్‌లో ఆరోపించారు. బేగంపేట, సరూర్‌నగర్, మల్కాజ్గిరి, జూబ్లీహిల్స్, ఫిలింనగర్, మలక్‌పేట తదితర ప్రాంతాల్లోని కేంద్రాలపై కేసులు నమోదు చేశారని తెలిపారు. అధికారుల ఈ జోక్యం వల్ల సంతాన సాఫల్య చికిత్సలకు తీవ్ర విఘాతం కలుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. చట్టప్రకారం అనుమతించిన విధానాల్లోనే తనిఖీలు నిర్వహించాలని, రోజువారీ కార్యకలాపాలకు ఆటంకం కలిగించకుండా అధికారులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు.
ఒయాసిస్ ఫెర్టిలిటీ పేషెంట్లకు చికిత్స కొనసాగించాలి
ఒయాసిస్ ఫెర్టిలిటీ సెంటర్లలో సంతాన సాఫల్య చికిత్స పొందుతున్న 51 మంది పేషెంట్లకు వైద్య సేవలు కొనసాగించాలని హైకోర్టు బుధవారం స్పష్టం చేసింది. ఇందుకోసం వైద్య నిపుణులతో ఒక ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలని వైద్య, కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్, జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది. ఆ కమిటీ పర్యవేక్షణలోనే ప్రస్తుతం హాస్పిటల్లో ఉన్న 51 మందిని సమీపంలోని ప్రభుత్వ ఐవీఎఫ్ కేంద్రాలకు తరలించి వైద్యం అందించాలని సూచించింది.
దవాఖానలో భద్రపరిచిన సుమారు 17,156 అండాల సంరక్షణకు తగిన చర్యలు తీసుకోవాలని, నిరంతరం గ్యాస్ సరఫరాను కొనసాగించాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరారు. చికిత్సా ప్రక్రియ మధ్యలో ఆగిపోతే పేషెంట్లు ఇబ్బంది పడతారని తెలిపారు. మరోవైపు అండాల అక్రమ సేకరణపై ఇప్పటికే 8 కేసులు నమోదయ్యాయని, దర్యాప్తు కొనసాగుతోందని ప్రభుత్వ తరఫు న్యాయవాది వాదించారు.
ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి.. రోగుల చికిత్సకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసే బాధ్యత అధికారులపై ఉందని తేల్చిచెప్పారు. అండాల భద్రతకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. పోలీసుల దర్యాప్తునకు ఆస్పత్రి యాజమాన్యం పూర్తిగా సహకరించాలని పేర్కొంటూ, ఈ అంశంపై పూర్తి వివరాలతో రెండు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేశారు.
