- బహుజనులకు రాజకీయ అవకాశాలు కల్పిస్తున్నం
- ఫగ్గన్ సింగ్ కులస్తే నేతృత్వంలోని పార్లమెంటరీ కమిటీ భేటీలో సీఎం రేవంత్
హైదరాబాద్, వెలుగు:ఎస్సీ వర్గీకరణను దేశంలోనే తొలిసారిగా అమలు చేసి చూపించిన మొదటి రాష్ట్రం తెలంగాణేనని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఎస్సీ, ఎస్టీ వర్గాల సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ అన్ని రంగాల్లో వారికి పెద్దపీట వేస్తున్నామని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్లోని ఎంసీహెచ్ఆర్డీలో ఎస్సీ, ఎస్టీల సంక్షేమంపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ చైర్మన్ డాక్టర్ ఫగ్గన్ సింగ్ కులస్తే, ఇతర కమిటీ సభ్యులతో సీఎం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న విద్యా, ఉపాధి, ఆర్థిక, రాజకీయ అవకాశాలను కమిటీకి సీఎం వివరించారు.
శాసనసభ స్పీకర్గా, కీలక మంత్రిత్వ శాఖల బాధ్యతల్లో దళితులకు సముచిత స్థానం కల్పించడమే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యులుగా, వివిధ ప్రభుత్వ కార్పొరేషన్ల చైర్మన్లుగా అత్యధిక అవకాశాలు ఇచ్చామని తెలిపారు. వందేండ్ల ఉస్మానియా యూనివర్సిటీ ఘన చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ఒక దళితుడిని వీసీ పదవిలో కూర్చోబెట్టి సరికొత్త చరిత్ర సృష్టించామన్నారు. ఓయూతో పాటు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ,
రాజీవ్ గాంధీ ఐఐటీలలోనూ ఎస్సీ, ఎస్టీ వర్గాల విద్యావేత్తలకే వీసీలుగా అవకాశాలు కల్పించామని వివరించారు. అర్హత, ప్రతిభ ఉన్న ప్రతిచోటా ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేయడమే ప్రభుత్వ విధానమని స్పష్టం చేశారు.
ఇండ్ల మంజూరులో ఎస్సీ, ఎస్టీలకే ప్రాధాన్యం
సంక్షేమ పథకాల అమలులోనూ అట్టడుగు వర్గాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి వివరించారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో ఎస్సీ, ఎస్టీలకే ప్రియారిటీ ఇస్తున్నామని, ఆరోగ్యశ్రీ చికిత్సలు, సీఎంఆర్ఎఫ్ ద్వారా ఖర్చు చేస్తున్న మొత్తం నిధుల్లో 50 శాతానికి పైగా నేరుగా ఎస్సీ, ఎస్టీ పేదల వైద్య ఖర్చులకే వెచ్చిస్తున్నట్లు గణాంకాలతో సహా వెల్లడించారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్యను అందించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్’ నిర్మిస్తున్న తీరును పార్లమెంటరీ కమిటీ సభ్యులు అభినందించారు. సమీక్షలో ఎంపీలు మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే శ్రీగణేశ్లతో పాటు పార్లమెంటరీ కమిటీ సభ్యులు తాపీర్ గావ్, హరీశ్చంద్ర మీనా, అనిల్ ఫిరోజియా, అరుణ్ కుమార్, ప్రసాద రావు, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఇందిరా స్ఫూర్తితోనే ప్రజా ప్రభుత్వం
భారతదేశ సమగ్రత, సమైక్యత, ఐక్యత కోసం తన జీవితాంతం కృషి చేసిన గొప్ప నాయకురాలు, పేదల ఆత్మ బంధువు, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ అని సీఎం రేవంత్రెడ్డి కొనియాడారు. ఇందిరా ఆశయాలు, సంక్షేమ విధానాల స్ఫూర్తితోనే తెలంగాణలో ప్రజా ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా దేశానికి ఆమె చేసిన సేవలను ముఖ్యమంత్రి గుర్తు చేసుకున్నారు. దేశం కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పనిచేసిన ధైర్యశాలి అని స్మరించుకున్నారు.
ఆమె చూపిన మార్గం, అమలు చేసిన సంక్షేమ విధానాలు నేటికీ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని పేర్కొన్నారు. బ్యాంకుల జాతీయీకరణ, రాజభరణాల రద్దు, 20 సూత్రాల కార్యక్రమం వంటి కీలక నిర్ణయాలతో దేశ ఆర్థిక, సామాజిక రంగాల్లో ఇందిరాగాంధీ అనేక మార్పులకు శ్రీకారం చుట్టారని సీఎం తెలిపారు. పేదలు, బడుగు బలహీన వర్గాలకు అభివృద్ధి ఫలాలు అందించాలన్న లక్ష్యంతో ఆమె అమలు చేసిన పథకాలు దేశ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయని చెప్పారు.
