- కన్నుల పండువగా కొండగట్టు స్వామి నిజరూప దర్శనం
కొండగట్టు, వెలుగు: కొండగట్టు అంజన్న సన్నిధిలో మూడు రోజులుగా మూలవిరాట్టుకు చందనం తొలగింపు కార్యక్రమం చేపడుతున్నారు. అనంతరం భక్తులకు 40 రోజుల పాటు స్వామి వారి నిజరూప దర్శనం కల్పించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల నుంచి కొండగట్టు అంజన్నకు పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నట్లు ఈవో అంజనారెడ్డి బుధవారం తెలిపారు.
ఈ నెల 20న భద్రాచలం, 24న యాదగిరి గుట్ట, 28న వేములవాడ, డిసెంబర్ 1న సికింద్రాబాద్ గణేశ్ టెంపుల్, 5న బాసర, 8న కొమురవెల్లి, 12న ధర్మపురి, 15న వరంగల్ భద్రకాళి, 19న బల్కంపేట ఎల్లమ్మ, 22న కీసరగుట్ట, 26న కర్మన్ ఘాట్, 29న సికింద్రాబాద్ మహంకాళి ఆలయాల నుంచి పట్టు వస్త్రాలు వేదపండితులు, ప్రధాన అర్చకుల సమక్షంలో తీసుకువస్తున్నట్లు తెలిపారు.
99 కిలోల చందనం సేకరణ
కొండగట్టు అంజన్న ఆలయంలో చేపట్టిన మూలవిరాట్ చందనం తొలగింపు కార్యక్రమం పూర్తయినట్లు ఈవో తెలిపారు. అనుకున్నదానికన్నా రెండు రోజుల ముందే చందనాన్ని తొలగించినట్లు ఆఫీసర్లు తెలిపారు. తొలగించిన చందనాన్ని తూకం వేయగా 99 కిలోల 720 గ్రాములు ఉందన్నారు.
చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ రీజినల్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు ఆధ్వర్యంలో చందనాన్ని తూకం వేశారు. ఈ చందనాన్ని అధికారుల సమక్షంలో సీల్ వేసి భద్రపరిచారు. కార్యక్రమంలో ప్రధాన అర్చకులు జితేంద్రప్రసాద్, చిరంజీవి, మారుతి ప్రసాద్, స్థానాచార్యులు కపీందర్, ఏఈవో హరిహరనాథ్ తదితరులు పాల్గొన్నారు.
