- యువత ఆ ఉచ్చులో పడకుండా చూడాలి
- కేబినెట్ మీటింగ్లో మోదీ భావోద్వేగం
న్యూఢిల్లీ: దేశంలో విస్తరిస్తున్న డ్రగ్స్ మహమ్మారిపై ఆందోళన వ్యక్తం చేస్తూ ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. డ్రగ్స్ ఉచ్చులో చిక్కుకుని యువత పెడదోవ పట్టకుండా కాపాడుకోవాలని, ఇందుకోసం దేశవ్యాప్తంగా ఉక్కుపాదం మోపాలని ఆయన పిలుపునిచ్చారు. ఢిల్లీలోని భారత్ మండపంలో బుధవారం జరిగిన కేంద్ర మంత్రిమండలి సమావేశంలో ప్రధాని ఈ వ్యాఖ్యలు చేశారు. ఉదయం 10:30 గంటలకు ప్రారంభమై దాదాపు మూడున్నర గంటల పాటు సాగిన ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఇందులో భాగంగా డ్రగ్స్ అంశం ప్రస్తావనకు వచ్చినప్పుడు ప్రధాని మోదీ ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. దేశం నుంచి నక్సలిజాన్ని విజయవంతంగా తుదముట్టించినప్పుడు, డ్రగ్స్ మహమ్మారిని కూడా కచ్చితంగా అంతం చేయగలమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. అదే సమయంలో, నక్సలిజం మళ్లీ ఊపిరిపోసుకోకుండా అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటివరకు సాధించిన విజయాలను నిలబెట్టుకోవాలని మంత్రులు, అధికారులను ఆయన హెచ్చరించారు.
ప్రజల్లో పొదుపు సంస్కృతిని ప్రోత్సహించాలి
కేబినెట్ మీటింగ్లో పేదరిక నిర్మూలన అంశంపై కూడా ప్రధాని ప్రత్యేకంగా దృష్టి సారించారు. 2014లో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో తాను చేసిన తొలి ప్రసంగాన్ని ఆయన గుర్తుచేసుకున్నారు. తమ ప్రభుత్వం పూర్తిగా పేదలకు అంకితమైనదని అప్పుడు చెప్పినట్టు తెలిపారు. ఇప్పటివరకు దేశంలో సుమారు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. , అయితే వారు తిరిగి పేదరికంలోకి జారిపోకుండా కాపాడటమే ఇప్పుడు మన ముందున్న అసలైన సవాల్ అని మోదీ స్పష్టం చేశారు. ఇందుకోసం ప్రజల్లో పొదుపు సంస్కృతిని మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన సూచించారు.
