IPL 2027 Mini Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 20వ సీజన్ కోసం రంగం సిద్ధమైంది. నవంబర్ 17న విడుదలైన అధికారిక జాబితా ప్రకారం మొత్తం 89 మంది ఆటగాళ్లను ఫ్రాంచైజీలు వదిలి పెట్టుకుంది. వీరిలో 34 మంది విదేశీ క్రికెటర్లు ఉండగా, డిసెంబర్ 16వ తేదీన గోవాలో జరగనున్న మినీ వేలంలో 10 జట్లలో కలిపి ఉన్న ఖాళీలు కేవలం 66 మాత్రమే (విదేశీ స్లాట్లు 25). సప్లై ఎక్కువగా ఉండి, డిమాండ్ తక్కువగా ఉన్న ఈ కొనుగోలుదారుల మార్కెట్లో (Buyer's Market) విడుదలైన స్టార్లందరికీ మళ్లీ ఛాన్స్ దొరకడం కష్టమే. గత సీజన్ ఫామ్, ఫిట్నెస్, వయసు, బేస్ ప్రైస్ ఆధారంగా మినీ వేలంలో అమ్ముడుపోకుండా మిగిలిపోయే ప్రమాదం ఉన్న ఆ ఐదుగురు ప్లేయర్స్ గురించి ఇప్పుడు V6 వెలుగు వెబ్ సైట్ లో తెలుసుకుందాం..
జయదేవ్ ఉనద్కత్.. 35 ఏళ్ల పేసర్‌కు చోటెక్కడ:
సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) రిలీజ్ చేసిన లెఫ్ట్ హ్యాండ్ పేసర్ జయదేవ్ ఉనద్కత్ పరిస్థితి అత్యంత క్లిష్టంగా మారింది. 2026 వేలంలో కోటి రూపాయలకి కొన్నప్పుడు SRH తప్ప మరే ఫ్రాంచైజీ ఇంట్రెస్ట్ చూపించలేదు. గత సీజన్లో కేవలం 4 మ్యాచ్‌లలో 4 వికెట్లు మాత్రమే తీసుకోగా, ఎకానమీ 10.91గా నమోదైంది. 35 ఏళ్ల వయసులో స్పీడ్ తగ్గిపోవడంతో పాటు మినీ వేలంలో యంగ్ ఇండియన్ పేసర్లు అందుబాటులో ఉండటంతో ఉనద్కత్ వైపు జట్లు మొగ్గు చూపే ఛాన్స్ తక్కువగా ఉంది.
ఆన్రిచ్ నోర్జే.. గాయాలతో దూరం:
లక్నో సూపర్ జెయింట్స్ (LSG) రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌కు కొనుగోలు చేసిన సౌతాఫ్రికా స్టార్ పేసర్ ఒక్క మ్యాచ్‌కే పరిమితమయ్యాడు. ఆ ఒక్క మ్యాచ్‌లో 3 ఓవర్లలో 39 రన్స్ ఇచ్చి గాయంతో టోర్నమెంట్ మధ్యలోనే జట్టు నుంచి తప్పుకున్నాడు. నోర్జే బౌలింగ్ లో వేగం ఉన్నా, ఫిట్‌నెస్‌పై గ్యారెంటీ లేకపోవడంతో లక్నో అతడ్ని రిలీజ్ చేసింది. కేవలం 25 విదేశీ స్లాట్లు మాత్రమే ఉన్న వేలంలో గాయాల బారిన పడే బౌలర్‌పై కోట్లు పెట్టేందుకు ఫ్రాంచైజీలు వెనుకాడతాయి.
నితీశ్ రాణా.. రూ.4.2 కోట్ల ఫ్లాప్ షో:
రాజస్థాన్ రాయల్స్ నుంచి ట్రేడ్ ద్వారా ఢిల్లీ క్యాపిటల్స్ (DC) రూ.4.2 కోట్లకు తీసుకున్న నితీశ్ రాణా ఘోరంగా విఫలమయ్యాడు. 9 ఇన్నింగ్స్‌లలో కేవలం 225 రన్స్ (సగటు 25) మాత్రమే చేశాడు. ఇటీవల హాంకాంగ్ సిక్సెస్ (4 ఇన్నింగ్స్‌లలో 39 పరుగులు), SMAT (2 ఇన్నింగ్స్‌లలో 42 పరుగులు)లోనూ పెద్దగా రాణించలేదు. 32 ఏళ్ల వయసు, స్పిన్‌పై తడబాటు, ఫీల్డింగ్ వేగం తగ్గడం లాంటి కారణాలతో అతడికి డిమాండ్ తగ్గే ఛాన్స్ ఉంది.
ఇషాంత్ శర్మ.. ఇక తెరపడినట్లేనా:
గుజరాత్ టైటాన్స్ (GT) 2025లో రూ.75 లక్షలకు కొనుగోలు చేసిన అనుభవజ్ఞుడైన పేసర్ ఇషాంత్ శర్మ, 2026 సీజన్ మొత్తం బెంచ్‌కే పరిమితమయ్యాడు. 2025లో ఆడిన 7 మ్యాచ్‌లలో 4 వికెట్లు తీసిన ఇషాంత్, SMATలోనూ 2 మ్యాచ్‌లలో వికెట్ సాధించలేకపోయాడు. 35 ఏళ్లు దాటిన ఇషాంత్ ఇప్పుడు T20 ఫార్మాట్‌కు తగ్గట్టు వేగం, పదును లేకపోవడంతో ఆటగాడిగా కంటే మెంటార్ లేదా కోచింగ్ పాత్రలకే పరిమితమయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.
రచిన్ రవీంద్ర.. టెస్టు స్టార్, T20లో ఫెయిల్:
కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) రూ.2 కోట్ల బేస్ ప్రైస్‌కు తీసుకున్న న్యూజిలాండ్ స్టార్ రచిన్ రవీంద్రకు 2026 సీజన్లో ఒక్క మ్యాచ్ కూడా ఆడే ఛాన్స్ ఇవ్వలేదు. వన్డే, టెస్టుల్లో అద్భుత ప్రదర్శన చేస్తున్నా, T20ల్లో మాత్రం పెద్దగా ప్రభావం చూపలేకపోతున్నాడు. 27 ఏళ్ల రచిన్‌కు క్లాసికల్ టెక్నిక్ ఉన్నప్పటికీ, T20లకు అవసరమైన 140+ స్ట్రైక్ రేట్ లేకపోవడం, విదేశీ స్లాట్లు తక్కువగా ఉండటంతో జట్లు పవర్ హిట్టర్లు, డెత్ బౌలర్లకే ప్రాధాన్యం ఇచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నాయి.
