హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఇంటర్మీడియట్ బోర్డును పాఠశాల విద్యాశాఖలో విలీనం చేసే కొత్త విద్యా విధానం నేపథ్యంలో.. ప్రైవేట్ బడ్జెట్ స్కూళ్ల మనుగడను కాపాడాలని తెలంగాణ గుర్తింపు పొందిన పాఠశాలల యాజమాన్య సంఘం (ట్రస్మా) కోరింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఇంటర్ కాలేజీలకు ఎట్టి పరిస్థితుల్లోనూ 9, 10వ తరగతులను ప్రారంభించేందుకు అనుమతులు ఇవ్వొద్దని డిమాండ్ చేసింది. ఈ మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ నవీన్ నికోలస్‌కు సంఘం నేతలు ఎస్ఎన్ రెడ్డి, కె.అనిల్ కుమార్ బుధవారం వినతిపత్రం అందజేశారు.
వేలాది బడ్జెట్ స్కూళ్లు పరిమిత వసతులతోనే విద్యనందిస్తున్నాయని, ఇంటర్ ల్యాబ్‌లు, అదనపు గదులు వంటి మౌలిక వసతులు ఏర్పాటు చేయడం సాధ్యం కాదని తెలిపారు. ఆర్థిక వనరులున్న ఇంటర్ కాలేజీలకు 9, 10 తరగతులు ఇస్తే బడ్జెట్ స్కూళ్లు తీవ్రంగా నష్టపోతాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న స్కూళ్ల అనుమతి విధానాన్నే యథాతథంగా కొనసాగించాలని కోరారు.
