ఏఐకేఎస్ అధ్యక్షుడిగా అశోక్ ధావలే

ఏఐకేఎస్ అధ్యక్షుడిగా అశోక్ ధావలే

 

  • 167 మందితో కేంద్ర కమిటీ ఏర్పాటు
  • నల్గొండలో ముగిసిన36వ జాతీయ మహాసభలు

హైదరాబాద్, వెలుగు: నల్లగొండలోని సారంపల్లి మల్లారెడ్డి నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో 4 రోజుల పాటు  జరిగిన అఖిల భారత కిసాన్ సభ(ఏఐకేఎస్) 36వ జాతీయ మహాసభలు బుధవారం ముగిశాయి. మహాసభ చివరి రోజున జాతీయ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఏఐకేఎస్ జాతీయ అధ్యక్షుడిగా అశోక్ ధావలే, ప్రధాన కార్యదర్శిగా విజూ కృష్ణన్, కోశాధికారిగా పుష్పేంద్ర త్యాగి ఎన్నికయ్యారు. మహాసభలో మొత్తం 167 మందితో అఖిల భారత కిసాన్ కమిటీ (ఏఐకేసీ)ని, అందులో నుంచి 86 మందితో సెంట్రల్ కిసాన్ కౌన్సిల్(సీకేసీ)ని ఏర్పాటు చేశారు.

వీరిలో నుంచి 27 మందిని ఆఫీస్ బేరర్లుగా ఎన్నుకున్నారు. ఏఐకేసీ కేంద్ర కమిటీలో తెలంగాణ నుంచి 8 మందికి, ఏపీ నుంచి ఐదుగురికి చోటు దక్కింది. కేంద్ర కమిటీలో చోటు దక్కిన వారిలో తెలంగాణ నుంచి టి.సాగర్, పోతినేని సుదర్శన్, జూలకంటి రంగారెడ్డి, వీరేపల్లి వెంకటేశ్వర్లు, బి.రాంబాబు, పి. జంగారెడ్డి, కందాల ప్రమీల, మూడ్ శోభన్ ఉండగా, ఏపీ నుంచి చోటు దక్కిన వారిలో ప్రభాకర్ రెడ్డి, వి.కృష్ణయ్య, సూర్యనారాయణ, ఎం.హరిబాబు, బి.బలరామ్ ఉన్నారు. సీకేసీలోకి ప్రభాకర్ రెడ్డి, కృష్ణయ్య, ఎం. హరిబాబును తీసుకోగా, ఆఫీస్ బేరర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా ప్రభాకర్ రెడ్డి ఎన్నికయ్యారు.

మతతత్వ, కార్పొరేట్ విధానాలపై పోరాటం

కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ మతతత్వ, మనువాద, కార్పొరేట్ అనుకూల విధానాలకు వ్యతిరేకంగా ప్రజాప్రతిఘట ఉద్యమాలను నడపాలని నూతన అధ్యక్షుడు అశోక్ ధావలే పిలుపునిచ్చారు. ప్రత్యామ్నాయాల సాధన కోసం రైతు, వ్యవసాయ కూలీ, కార్మిక ఐక్యతను సాధించాలని దిశానిర్దేశం చేశారు. ఉద్యమాల్లో మహిళలు, యువత భాగస్వామ్యాన్ని పెంచాలని, కలిసొచ్చే సంఘాలతో ఐక్య పోరాటాలు నిర్మిస్తూనే సంఘం స్వతంత్ర బలాన్ని పెంచుకోవాలని సూచించారు. స్థానిక సమస్యలపై కేంద్రీకరించి ఆర్థిక, సామాజిక, రాజకీయ పోరాటాలు ఉధృతం చేయాలన్నారు. 4 రోజుల పాటు పాటు సాగిన మహాసభల్లో కనీస మద్దతు ధరకు చట్టబద్ధత, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల అమలు, రైతుల రుణవిముక్తి, పంటల కొనుగోలు, సాగునీటి సమస్యలు, వ్యవసాయ కార్మికుల ఉపాధి భద్రత, స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాల దుష్ప్రభావం వంటి అంశాలపై 10 కీలక తీర్మానాలను ఆమోదించారు.