ముంబై భేండీ బజార్ లోని అండర్ వరల్డ్ డాగా పేరొందిన దావూద్ ఇబ్రహీం ఇంటిని ఎట్టకేలకు కూల్చేశారు.గురువారం తెల్లవారు జామునుంచే జేసీబీలతో కూల్చివేత పనులు ప్రారంభించారు బీఎంసీ అధికారులు. హాజీ ఇస్మాయిల్ హాజీ హబీబ్ ముసాఫిర్ ఖాన్ గా పిలువబడే 162 ఏళ్ల నాటి ఈ ఇంటిలో దావూద్ ఇబ్రహీం పూర్వీకులు నివసించారు. కూల్చివేతల క్రమంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతను పెంచారు. స్థానికుల నుంచి ఎలాంటి ప్రతిఘటన ఎదురుకాలేదని సమాచారం.పాక్మోడియా వీధిలో ఉన్న ఈ భవనం శిథిలావస్థకు చేరడంతో ప్రమాదకరమైనదిగా అధికారులు గుర్తించారు. బాంబే హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు కూల్చివేతలు చేపట్టారు.
దావూద్ ఇబ్రహీం భారత్‌ను విడిచి వెళ్లడానికి ముందు ఈ భవనాన్ని తన చివరి నివాసం,కార్యాలయంగా ఉపయోగించినట్లు చారిత్రక కథనాలు చెబుతున్నాయి. 1993 ముంబై వరుస బాంబు పేలుళ్ల కుట్రతోనూ ఈ ఆస్తికి సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసు తర్వాత ఈ భవనాన్ని టాడా కోర్టు తన ఆధీనంలోకి తీసుకుంది.
ALSO READ : వీడియో కాల్‌లో నచ్చజెప్పినా.. వినలే.. సరెండర్ కాకుండా మసీదులో నక్కి కాల్పులు
1864లో ప్రయాణికులకు వసతి కల్పించేందుకు ముసాఫిర్‌ఖానాగా నిర్మించిన ఈ భవనంలో మొదట 36 దుకాణాలు, గోడౌన్లు ఉండేవి. కాలక్రమేణా ప్రయాణికుల రాక తగ్గడంతో పై అంతస్తుల్లోని గదులను నివాసాలుగా అద్దెకిచ్చారు. రెండో అంతస్తును దావూద్ ఇబ్రహీం అక్రమంగా ఆక్రమించుకున్నట్లు వక్ఫ్ బోర్డుకు సమర్పించిన అఫిడవిట్‌లో చెప్పారు. అనంతరం భవనం పునరాభివృద్ధి కోసం సైఫీ బుర్హానీ అప్‌లిఫ్ట్‌మెంట్ ట్రస్ట్‌కు విక్రయించినట్లు సమాచారం.
