ENE 2 Review: ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ రివ్యూ.. ఫస్ట్ పార్ట్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

ENE 2 Review: ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ రివ్యూ.. ఫస్ట్ పార్ట్ మ్యాజిక్ రిపీట్ అయిందా?

టాలీవుడ్లో కల్ట్ ఫాలోయింగ్ సంపాదించుకున్న సినిమాల్లో ‘ఈ నగరానికి ఏమైంది’ ఒకటి. నలుగురు స్నేహితులు, వారి సరదాలు, ప్రేమలు, గొడవలు, గోవా ట్రిప్.. ఇలా యూత్‌కు కనెక్ట్ అయ్యే అంశాలతో అప్పట్లో ఈ సినిమా మంచి క్రేజ్ సొంతం చేసుకుంది. ఇప్పుడు అదే మ్యాజిక్‌ను మరోసారి రిపీట్ చేసేందుకు హీరో విశ్వక్ సేన్, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రేక్షుకుల ముందుకొచ్చారు. ఇవాళ గురువారం (నవంబర్ 19, 2026న) ఈ కాంబినేషన్‌లో వచ్చిన ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ (ENE Repeat) థియేటర్లలో విడుదలైంది. మరి ఎనిమిదేళ్ల తర్వాత కలిసిన ఈ ఫ్రెండ్స్ గ్యాంగ్ మళ్లీ ఎలాంటి సందడి చేసింది? డైరెక్టర్ తరుణ్ భాస్కర్ ఎలాంటి మ్యాజిక్ చేసాడు? అనేది రివ్యూలో చూద్దాం..

ENE 2 కథ: 

ఒక సినిమా చేయాలనే కలతో ప్రయాణం మొదలుపెట్టిన నలుగురు స్నేహితులు.. ఆ ప్రయత్నం విఫలం కావడంతో ఎవరి దారి వారు చూసుకుంటారు. వివేక్ (విశ్వక్ సేన్), కౌశిక్ (అభినవ్ గోమటం), ఉప్పి (వెంకటేష్ కాకుమాను), కార్తీక్ (శ్రీనాథ్ మాగంటి) ఇలా ఎనిమిదేళ్ల పాటు తమ జీవితాల్లో బిజీ అయిపోతారు. అయితే ఓ పెళ్లి వ్యవహారం వీరందరినీ మళ్లీ ఒకచోటికి చేరుస్తుంది.

చాలా రోజుల తర్వాత కలిసిన స్నేహితుల మధ్య పాత అల్లరి, పంచులు, సరదాలు మళ్లీ మొదలవుతాయి. ఈ క్రమంలో జరిగే పరిణామాలు వారిని మరోసారి సినిమా నిర్మాణం వైపు నడిపిస్తాయి. ఆ ప్రయత్నంలో భాగంగా థాయ్‌లాండ్‌కు వెళ్లడంతో కథ మరింత ఆసక్తికరమైన మలుపులు తీసుకుంటుంది. అక్కడ ఎదురయ్యే పరిస్థితులు, కొత్త పరిచయాలు, ఊహించని సంఘటనలు ఎలాంటి కామెడీకి దారితీశాయి? ఈ కథలో కీర్తన (శివాత్మిక రాజశేఖర్‌), అంకిత్ (సింగర్ శ్రీరామచంద్ర)ల రోల్స్ ఏంటీ? చివరకు ఈ నలుగురి ప్రయాణం ఎక్కడికి చేరింది? సినిమా తీశారా? లేదా? అనేది అనేది తెరపై చూడాల్సిందే.

విశ్లేషణ:

సీక్వెల్ అనగానే ప్రేక్షకులకు మొదట గుర్తొచ్చేది ఒరిజినల్ సినిమాలోని మ్యాజిక్. ముఖ్యంగా ‘ఈ నగరానికి ఏమైంది’ లాంటి ఫ్రెండ్‌షిప్ కామెడీ సినిమాకు కొనసాగింపు ఇవ్వడం దర్శకుడు తరుణ్ భాస్కర్‌కు నిజంగానే పెద్ద సవాల్. ఎందుకంటే ఆ సినిమాలోని పాత్రలు, డైలాగులు, స్నేహితుల మధ్య కెమిస్ట్రీ ఇప్పటికే ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్నాయి. ఈ నేపథ్యంలో ENE Repeat కూడా అదే ఫార్ములాను నమ్ముకుంది. 

►ALSO READ | ఓటీటీలోకి టబు ఎంట్రీ.. నెట్‌ఫ్లిక్స్ వెబ్ సిరీస్‌ లో పవర్‌ఫుల్ రోల్!

మొదటి భాగంలో ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయిన ఫ్రెండ్‌షిప్, కామెడీ మ్యాజిక్‌ను మరోసారి చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు తరుణ్ భాస్కర్. నలుగురు స్నేహితులు కలిసిన తర్వాత వచ్చే పబ్ ఎపిసోడ్, ఫైట్ సీన్, పంచ్ డైలాగులు బాగానే నవ్విస్తాయి. సెకండాఫ్‌లో థాయ్‌లాండ్ ఎపిసోడ్స్, ఫ్లైట్, ఫారెస్ట్ సీన్స్, రాబిన్ పాత్రతో వచ్చే కామెడీ ఆకట్టుకుంటాయి. దర్శకుల సర్‌ప్రైజ్ ఎంట్రీలు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. అయితే ప్రారంభంలో కథ నెమ్మదించడం, సెకండాఫ్‌లో కొన్ని సన్నివేశాలు సాగదీయడం మైనస్. ఫ్రెండ్‌షిప్ ఎమోషన్స్ మరింత బలంగా ఉంటే బాగుండేది. మొత్తంగా అక్కడక్కడా నవ్విస్తూ, ఫ్రెండ్స్‌తో కలిసి ఎంజాయ్ చేసేలా సినిమా సాగుతుంది.

నటీనటుల పెర్ఫార్మెన్స్:

విశ్వక్ సేన్ తన ఎనర్జీ, కామెడీ టైమింగ్‌తో వివేక్ పాత్రలో ఆకట్టుకున్నారు. అభినవ్ గోమటం మాత్రం కౌశిక్‌గా తన పంచులు, అల్లరితో సినిమాకు ప్రధాన హైలైట్‌గా నిలిచారు. వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి తమ పాత్రలకు న్యాయం చేశారు. ఇక శివాత్మిక రాజశేఖర్, అనీషా ఆంబ్రోస్, శ్రీరామ్ చంద్ర, కరుణకుమార్ తమ పరిధిలో మెప్పించారు. ప్రత్యేక అతిథి పాత్రల్లో దర్శకుల ఎంట్రీలు అభిమానులకు సర్‌ప్రైజ్ ఇస్తాయి.

టెక్నికల్ పనితీరు:

దర్శకుడు తరుణ్ భాస్కర్ తనదైన యూత్‌ఫుల్ కామెడీ, సహజమైన డైలాగులతో ఆకట్టుకున్నారు. వివేక్ సాగర్ సంగీతం, బీజీఎం సన్నివేశాలకు మంచి బలాన్నిచ్చాయి. ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ, ముఖ్యంగా థాయ్‌లాండ్ లొకేషన్ల విజువల్స్ ఆకట్టుకుంటాయి. రవితేజ గిరిజాల ఎడిటింగ్ బాగున్నప్పటికీ, సెకండాఫ్‌లో మరికొన్ని సన్నివేశాలకు కత్తెర పడితే సినిమా మరింత క్రిస్పీగా ఉండేది. నిర్మాణ విలువలు బాగున్నాయి.