తొమ్మిదేళ్లలో పెద్ద మతంగా ఇస్లాం.. 2వ స్థానంలో క్రైస్తవం: హిందూ మతం పరిస్థితి ఏంటంటే..?

తొమ్మిదేళ్లలో పెద్ద మతంగా ఇస్లాం.. 2వ స్థానంలో క్రైస్తవం: హిందూ మతం పరిస్థితి ఏంటంటే..?

2035 నాటికి ఇస్లాం మతం.. క్రైస్తవ మతాన్ని దాటేసి ప్రపంచంలో అత్యధిక మంది అనుసరిస్తున్న మతంగా నిలవనుందని Pew రీసెర్చ్ సెంటర్ తాజా అధ్యయనంలో తేల్చింది. ఇందుకు సంబంధించిన అధ్యయన నివేదికను సదరు రీసెర్చ్ సెంటర్ బుధవారం విడుదల చేసింది. ప్రస్తుతం ముస్లిం జనాభా పెరుగుతున్న తీరును పరిశీలిస్తే.. 2070 నాటికి ప్రపంచవ్యాప్తంగా ముస్లిం జనాభా 360 కోట్లు దాటుతుందని ఈ అధ్యయనం వెల్లడించింది. క్రైస్తవుల సంఖ్య 300 కోట్ల కంటే దిగువకు పడిపోతుందని కూడా ఈ అధ్యయనం అంచనా వేసింది.

2020 నుంచి 2070 మధ్య ప్రపంచ జనాభా 29 శాతం పెరుగుతుందని ఈ అధ్యయన సంస్థ అంచనా వేయడం గమనార్హం. ఈ కాలంలో క్రైస్తవుల సంఖ్య 30 శాతం పెరగగా, ముస్లిం జనాభా 80 శాతం వరకు వృద్ధి చెందనుందని పేర్కొంది. ఈ తేడాకు ముఖ్యకారణం సంతానోత్పత్తి రేటు అని Pew పేర్కొంది.

2020–2025 మధ్య ముస్లిం మహిళల సగటు సంతానోత్పత్తి రేటు 3.1గా నమోదైంది. క్రైస్తవ మహిళలది 2.5గా ఉంది. మిగిలిన మతాల మహిళల సగటు రేటు 1.6 మాత్రమే ఉంది. తరాల భర్తీకి అవసరమైన 2.1 శాతం కంటే తక్కువ. ప్రధాన మతాలకు కొత్త అనుచరులు వచ్చేందుకు మూలం మత మార్పిడి కాదని.. ఆ మతంలో పుట్టే శిశువులే అని Pew నివేదిక తేల్చి చెప్పింది.

►ALSO READ | ముంబైలో దావుద్ ఇబ్రహీం ఇంటిని.. పునాదులతో సహా తీసి.. నేల మట్టం చేశారు

ఈ అధ్యయనం ప్రకారం.. భారత్‌లో హిందువుల నిజ సంఖ్య పెరిగినా, మొత్తం జనాభాలో వారి నిష్పత్తి తగ్గనుందని Pew అంచనా వేసింది. 2020లో 120 కోట్లున్న హిందూ జనాభా 2070 నాటికి 140 కోట్లకు చేరుతుంది. అయినప్పటికీ, ఇతర మతాల వృద్ధి వేగంగా ఉండటం వల్ల.. ప్రపంచ జనాభాలో హిందువుల వాటా 2020లో 15 శాతం నుంచి 2070 నాటికి 14 శాతానికి తగ్గుతుంది. 2020లో 79.4 శాతంగా ఉన్న హిందువుల వాటా 2070 నాటికి 75.8 శాతానికి తగ్గుతుంది. ముస్లిం వాటా 15.2 శాతం నుంచి 19.6 శాతానికి పెరుగుతుంది.

భారత్‌లో మొత్తం సంతానోత్పత్తి రేటు వేగంగా తగ్గుతున్నప్పటికీ, హిందువులతో పోలిస్తే ముస్లిం మహిళలకు ఇంకా అధిక సంతానోత్పత్తి రేటు ఉందని Pew నివేదిక తెలిపింది. భారత్ కాకుండా ఇతర దేశాల్లో హిందూ జనాభా వృద్ధి రేటును గమనిస్తే.. పాకిస్థాన్ (50 లక్షలకు పైగా), అమెరికా (40 లక్షలకు పైగా) వరకూ ఉంటుందని అంచనా. 2070 నాటికి అమెరికా ప్రపంచంలో అయిదో అతిపెద్ద హిందూ జనాభా కలిగిన దేశంగా నిలవనుంది. హిందూ మెజారిటీ దేశాలుగా భారత్, నేపాల్ మాత్రమే కొనసాగుతాయి.