‘గుడ్ టచ్.. బ్యాడ్ టచ్..’ ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారిన అంశమిది. ఎదుటివారిని తాకే విషయంలో వ్యక్తిగత హద్దులు, వారి అంగీకారం ఎంత ముఖ్యమనే చర్చకు హీరోయిన్ కీర్తి సురేశ్‌కు సంబంధించిన ఓ వీడియో తెరలేపింది. చెన్నైలో జరిగిన ‘సత్యవాన్ సావిత్రి’ సినిమా ప్రమోషన్ ఈవెంట్‌లో దర్శకుడు, నటుడు మిస్కిన్.. కీర్తి సురేశ్‌తో మాట్లాడుతూ పదేపదే ఆమె మోకాలి భాగంలో తాకడం వీడియోలో కనిపిస్తోంది. ఈ సమయంలో కీర్తి కొంత అసౌకర్యానికి గురైనట్లు కనిపించడంతో పాటు, ఆయన చేతిని పక్కకు జరిపినట్లు కూడా వీడియోలో గమనించవచ్చు. దీంతో ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఎదుటివారి అనుమతి లేకుండా శారీరకంగా తాకడం ఎంతవరకు సమంజసమని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. మిస్కిన్ ఉద్దేశం ఏదైనప్పటికీ, ఒక వ్యక్తి వ్యక్తిగత హద్దులను గౌరవించడం ముఖ్యమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ ఘటనపై నెట్టింట పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది..
కీర్తికి నెటిజన్ల మద్దతు..
వైరల్ వీడియోపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. సినిమా సన్నివేశాల్లో స్పర్శ అనేది నటనలో భాగమని, నిజ జీవితంలో మాత్రం ఎదుటివారి అనుమతి లేకుండా తాకడం సరికాదని కీర్తికి మద్దతుగా నిలుస్తున్నారు. ఉద్దేశం ఏదైనా.. అవతలి వ్యక్తి అసౌకర్యంగా భావిస్తే వారి వ్యక్తిగత హద్దులను గౌరవించాలని కామెంట్స్ చేస్తున్నారు. ‘సినిమాలో నటన వేరు.. నిజ జీవితం వేరు. సమ్మతి లేకుండా స్పర్శ తగదు’ అంటూ పలువురు స్పందిస్తున్నారు. మరోవైపు, మిస్కిన్ ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకోవద్దని భావిస్తున్నవారూ సైతం ఉన్నారు.
#WATCH | A moment involving director #Mysskin and actress #KeerthySuresh at the press meet of ‘Sathyavan Savithiri’ has sparked discussion online. The video appears to show Mysskin touching Keerthy’s knee while speaking to her as she squirms uncomfortably, prompting a discussion online.
— The Federal (@TheFederal_News) November 19, 2026
కీర్తికి గోల్డ్ రింగ్ గిఫ్ట్ చేసిన మిస్కిన్..
ఇదే కార్యక్రమంలో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ‘డొరోతి’ చిత్రంలో కీర్తి సురేశ్ నటనకు ముగ్ధుడైన మిస్కిన్.. ఆమెకు బంగారు ఉంగరాన్ని బహుమతిగా అందించి అభినందించారు. కీర్తిని తన కుమార్తెతో సమానంగా భావిస్తున్నట్లు కూడా ఆయన పేర్కొన్నారు. ఈ బహుమతికి కీర్తి సైతం కృతజ్ఞతలు తెలిపారు. అయితే ఈ కార్యక్రమంలో చోటుచేసుకున్న స్పర్శకు సంబంధించిన వైరల్ వీడియోపై మాత్రం ఇద్దరూ ఇప్పటివరకు అధికారికంగా స్పందించలేదు.
ALSO READ : సూర్య సినిమాలో గోపీచంద్ విలన్ రోల్‌పై క్లారిటీ!
రేపే ప్రేక్షకుల ముందుకు ‘సత్యవాన్ సావిత్రి’..
ప్రవీణ్ ఎస్. విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో కీర్తి సురేశ్ న్యాయవాదిగా, మిస్కిన్ సీనియర్ అడ్వకేట్‌గా నటిస్తున్నారు. నవంబర్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. అయితే సినిమా ప్రమోషన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటనతో గుడ్ టచ్.. బ్యాడ్ టచ్, వ్యక్తిగత హద్దులు, పరస్పర సమ్మతి అంశాలు మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
దర్శకుడిగా మిస్కిన్‌కు ప్రత్యేక గుర్తింపు
తమిళ చిత్ర పరిశ్రమలో దర్శకుడిగా మిస్కిన్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. 2006లో 'చిత్తిరం పేసుదడి' సినిమాతో దర్శకుడిగా పరిచయమైన ఆయన.. ఆ తర్వాత 'అంజాతే', 'నందలాలా', 'యుద్ధం సే', 'ముగమూడి', 'ఓనాయుం ఆట్టుకుట్టియుం', 'పిసాసు' (పిశాచి), విశాల్ నటించిన డిటెక్టివ్ (తుప్పరివాలన్), ఉదయనిధి స్టాలిన్ నటించిన 'సైకో' వంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించారు. థ్రిల్లర్, క్రైమ్, హారర్ కథాంశాలతో తనకంటూ ఓ ప్రత్యేక శైలిని ఏర్పరచుకున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ట్రైన్', 'పిసాసు 2' సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.
