టాలీవుడ్ యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరోసారి పవర్‌ఫుల్ పాత్రలో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన ప్రధాన పాత్రలో దర్శకుడు సాగర్ కె. చంద్ర తెరకెక్కిస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ 'టైసన్ నాయుడు'. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ సింగిల్ 'మదరాసి రబ్బరు బొమ్మ' ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా.. లేటెస్ట్ గా టీజర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. ఇది ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది. ఈసారి కేవలం యాక్షన్ మాత్రమే కాదు.. సమాజాన్ని, రాజకీయ పరిస్థితులను ప్రశ్నించే ఓ ఆసక్తికరమైన కథాంశంతో బెల్లంకొండ వస్తున్నట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది.
టీజర్‌లో 'రెడ్ ట్యాగింగ్' అనే సరికొత్త కాన్సెప్ట్‌ను పరిచయం చేశారు. కమ్యూనిస్టులు, ఉగ్రవాదులు అంటూ కొందరు వ్యక్తులకు ముద్ర వేయడమే ఈ రెడ్ ట్యాగింగ్. దీనికి వ్యతిరేకంగా శత్రు నేతృత్వంలోని ఓ బృందం నిరసనకు దిగుతుంది. అయితే వారిని అడ్డుకోవడానికి ప్రభుత్వం ప్రత్యేక ఆపరేషన్స్ టీమ్ (SOT)ను రంగంలోకి దించుతుంది. ఈ టీమ్‌లో పనిచేసే పోలీసులకు సాధారణ పోలీసుల తరహాలో రికార్డులు నిర్వహించాల్సిన అవసరం ఉండదు. తమదైన శైలిలో నిందితులను అదుపులోకి తీసుకునే అధికారాలు ఉంటాయి. దీంతో ఒకవైపు అరెస్టులు, మరోవైపు ఆందోళనలు.. ఇలా టీజర్ ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది.
అసలు ఈ నిరసనకారులు ఎవరు? వారిపై పోలీసులు ఎందుకు గురిపెట్టారు? రెడ్ ట్యాగింగ్ వెనుక ఉన్న అసలు నిజాలేంటి? ఈ వ్యవహారంలో హీరో పాత్ర ఎలాంటిది? అనే ప్రశ్నలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బెల్లంకొండ శ్రీనివాస్ తనదైన మాస్ లుక్, పవర్‌ఫుల్ బాడీ లాంగ్వేజ్‌తో ఆకట్టుకున్నారు. నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్‌తో పాటు నరేశ్, రావు రమేశ్, సునీల్ తదితరులు టీజర్‌లో కనిపించారు.
'భీమ్లా నాయక్'తో గుర్తింపు తెచ్చుకున్న సాగర్ కె. చంద్ర ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండగా, రామ్ ఆచంట, గోపి ఆచంట 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. కేవలం కమర్షియల్ యాక్షన్‌కే పరిమితం కాకుండా సామాజిక అంశాన్ని కూడా మేళవించిన ఈ సినిమా టీజర్ ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ పెంచుతోంది. మరి 'టైసన్ నాయుడు' వెండితెరపై ఎలాంటి సంచలనం సృష్టిస్తాడో చూడాలి..
