హైదరాబాద్: ఢిల్లీలోని రాంలీలా మైదానంలో డిసెంబర్ 14న నిర్వహించనున్న బీసీ జనభేరి సభ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి బీసీల సత్తా చూపిస్తామని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ సభకు హాజరుకావాలని కోరుతూ టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను బీసీ సంఘాల నాయకులు కలిసి ఆహ్వానించారు.
మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసిన అనంతరం జాజుల శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. దేశ జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చకుండా బీజేపీ ప్రభుత్వం బీసీలను మోసం చేస్తోందని ఆరోపించారు. బీసీ కులగణన జరగకపోవడంతో గత 80 ఏళ్లుగా దేశంలోని బీసీలు తమ హక్కులను కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
జనగణనలో ఓబీసీ కాలమ్‌ను చేర్చి బీసీ కులగణన చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ డిమాండ్‌ను కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో బీజేపీకి బీసీలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఓబీసీ కులగణనకు బీజేపీ మినహా దేశంలోని అన్ని రాజకీయ పార్టీలు ఇప్పటికే మద్దతు తెలిపాయని జాజుల శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సైతం ఓబీసీ కులగణన చేపట్టాలని కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారని గుర్తుచేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో కూడా బీసీ కులగణనకు సంబంధించి తీర్మానం చేసినట్లు తెలిపారు.
డిసెంబర్ 14న ఢిల్లీలోని రాంలీలా మైదానంలో నిర్వహించనున్న బీసీ జనభేరి సభకు దేశవ్యాప్తంగా బీసీలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి తమ హక్కుల కోసం గళమెత్తాలని జాజుల శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు.
