టాక్సులు తగ్గించినా ఉద్యోగాలు ఇవ్వరా.. జీతాలు పెంచరా?: కంపెనీలకు మోడీ ప్రశ్నలు

టాక్సులు తగ్గించినా ఉద్యోగాలు ఇవ్వరా.. జీతాలు పెంచరా?: కంపెనీలకు మోడీ ప్రశ్నలు

పన్నుల భారం తగ్గించినా.. ఉద్యోగాలు ఇవ్వరా? జీతాలు పెంచరా? అంటూ భారతీయ కార్పొరేట్ కంపెనీలకు ప్రధాని మోడీ ప్రశ్నలు సంధించారు. ప్రభుత్వ సంస్కరణలు, భారీ పన్ను రాయితీల ఫలాలు సామాన్య ప్రజలకు, ఉద్యోగులకు ఎంతవరకు చేరాయో ఆత్మపరిశీలన చేసుకోవాలని బడా వ్యాపారవేత్తలకు సూచించారు. ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన ఫిక్కీ వార్షిక సర్వసభ్య సమావేశంలో ప్రసంగించిన ప్రధాని.. వ్యాపార సంస్థలను సామాజిక బాధ్యత, ఉద్యోగాల కల్పనపై నేరుగా నిలదీశారు.

కార్పొరేట్ రంగం తన లాభాలనే కాకుండా.. దేశ ఆర్థికాభివృద్ధిలో తన పాత్రను కూడా అంచనా వేసుకోవాలని మోడీ స్పష్టం చేశారు. ప్రభుత్వ పరంగా ఇచ్చిన ప్రోత్సాహకాలకు తగ్గట్టుగా ఉద్యోగాల కల్పన.. ఉద్యోగుల వేతనాల పెంపు, పెట్టుబడుల విషయంలో కంపెనీలు తగినంతగా తిరిగి చేశాయా లేదా అనే ప్రశ్నలను ప్రజల ముందుకు తెచ్చారు. ఆర్థిక వృద్ధి వేగంగా సాగుతున్న వేళ.. ఆ ఫలాలు క్షేత్రస్థాయిలో అందరికీ సమానంగా చేరాలంటే కార్పొరేట్ సంస్థల చొరవ ఎంతో అవసరమంటూ నిలదీశారు. 

మధ్యతరగతి, సామాన్యుల కొనుగోలు శక్తిని పెంచేందుకు ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రధాని గుర్తు చేశారు. ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయంపై పన్ను మినహాయింపు కల్పించామని, టాక్స్ రిటర్న్ ఫైలింగ్ రీఫండ్ ప్రక్రియలను సులభతరం చేసి పన్ను చెల్లింపుదారుల సొమ్ము నిలిచిపోకుండా చూశామన్నారు. దేశీయ కంపెనీలకు కార్పొరేట్ పన్నును 30 శాతం నుంచి 22 శాతానికి, కొత్త తయారీ సంస్థలకు 15 శాతానికి తగ్గించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఆ రాయితీల ప్రయోజనాలను వ్యాపార రంగం ఎలా వినియోగించుకుంటోందో సమీక్షించుకోవాలని సూచించారు.

మరోవైపు దేశ వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు అవసరమైన సంస్కరణలపై సూచనలు ఇవ్వాలని కార్పొరేట్ వర్గాలను మోడీ కోరారు. ఎలాంటి సంకోచం లేకుండా లోపాలను, మెరుగుపడాల్సిన అంశాలను తనకు నేరుగా లేఖ రాయవచ్చని అన్నారు. వచ్చే 2 దశాబ్దాల పెట్టుబడి నిర్ణయాల్లో 'ఇండియా ఫస్ట్' విధానాన్ని పాటించాలని, ఆత్మనిర్భరతతో పాటు వ్యవసాయ అనుబంధ రంగాల్లోనూ పెట్టుబడులు పెట్టాలన్నారు.

ALSO READ : తినండి, తాగండి, ఎంజాయ్ చేయండి..

ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం కేవలం 12-13 ఏళ్లలోనే 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ప్రధాని ఈ సందర్భంగా గుర్తుచేశారు. రైతులు, చిన్న పారిశ్రామికవేత్తలు, సంపద సృష్టికర్తలు, పన్ను చెల్లింపుదారులను గౌరవించినప్పుడే దేశం పురోగమిస్తుందని చెప్పారు ప్రధాని మోడీ. అయితే విమర్శకులు మాత్రం వీటిని ఉత్తర్‌ప్రదేశ్ ఎన్నికల కోసం చేస్తున్న స్టంట్స్ అంటూ మోడీ వ్యాఖ్యలపై స్పందిస్తున్నారు. ఎలక్షన్స్‌లో ఓట్లు అడగటానికి ప్రజల ముందుకు వెళ్లినప్పుడు.. కొత్త ఉద్యోగాల కల్పన హామీల గురించి ప్రశ్నిస్తారనే భయంతోనే కార్పొరేట్ కంపెనీలను దోషులుగా చూపించే ప్రయత్నం మోడీ అండ్ టీం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నారు.