దేశంలో పేదరికం నుంచి బయటపడిన ప్రజలు తిరిగి పేదరికంలోకి వెళ్లే పరిస్థితి రాకూడదని, ఆర్థిక క్రమశిక్షణ, పొదుపు అలవాట్లను పెంపొందించుకోవాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచించారు. కేవలం సంపాదించడం, ఖర్చు చేయడమే కాకుండా భవిష్యత్తు అవసరాల కోసం కొంత మొత్తాన్ని పొదుపు చేసుకోవడం కూడా ముఖ్యమని ఆయన పేర్కొన్నారు. ‘తిను, తాగు, ఎంజాయ్ చేయి’ అనే ధోరణి కంటే ఆర్థిక బాధ్యతతో వ్యవహరించే అప్రమత్తతను అలవర్చుకోవాలని పిలుపునిచ్చారు.
ఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన కేంద్ర మంత్రుల సమావేశంలో మోదీ కొన్ని కీలక అంశాలపై మాట్లాడారు. 2011 నుంచి 2023 మధ్యకాలంలో దేశంలో దాదాపు 50 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని ఆయన చెప్పడం గమనార్హం. ఇది దేశానికి గర్వకారణమని, ఈ విజయాన్ని సాధించడంలో ప్రభుత్వాలు, అధికారులు, పారిశ్రామిక రంగం, ప్రజల సమష్టి కృషి ఉందని గుర్తుచేశారు.
పేదరిక నిర్మూలనతోనే బాధ్యత అయిపోదని, ప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకునేలా పొదుపు, ఆర్థిక క్రమశిక్షణపై అవగాహన కల్పించాలని మోదీ సూచించారు. మరోవైపు దేశ యువతను మాదకద్రవ్యాల మహమ్మారి నుంచి కాపాడేందుకు సమష్టి పోరాటం అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. డ్రగ్స్‌ను అరికట్టేందుకు ప్రభుత్వ యంత్రాంగం, సమాజం కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు.
►ALSO READ | టీవీ డిబేట్లో బిగ్ ఫైట్.. పిడిగుద్దులు, తన్నులతో జర్నలిస్ట్, విశ్లేషకుడి మధ్య కొట్లాట.. ప్రసారం చేసిన పబ్లిక్ ఛానల్!
నక్సలిజంపై సాధించిన పురోగతిని ఉదాహరణగా చెబుతూ.. అదే సంకల్పంతో డ్రగ్స్ సమస్యను కూడా ఎదుర్కోవచ్చని చెప్పుకొచ్చారు. నక్సలిజం మళ్లీ బలపడకుండా.. నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాల అమలు, పేదరిక నిర్మూలన, అంతర్గత భద్రత అంశాల పైనా సమావేశంలో సమీక్షించారు. ఈ సందర్భంగా పేదరిక నిర్మూలన, మన దేశంలో పేద, మధ్య తరగతి ప్రజల స్థితిగతులపై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
