టీవీ డిబేట్‌లో బిగ్ ఫైట్.. పిడిగుద్దులు, తన్నులతో జర్నలిస్ట్, విశ్లేషకుడి మధ్య కొట్లాట.. ప్రసారం చేసిన పబ్లిక్ ఛానల్!

టీవీ డిబేట్‌లో బిగ్ ఫైట్..  పిడిగుద్దులు, తన్నులతో జర్నలిస్ట్, విశ్లేషకుడి మధ్య  కొట్లాట.. ప్రసారం చేసిన పబ్లిక్ ఛానల్!

ఆర్మేనియాలో ఓ టెలివిజన్ చర్చా కార్యక్రమం ఊహించని పరిణామాలకు దారితీసింది. రాజకీయ అంశాలపై చర్చించేందుకు వచ్చిన ఇద్దరు అతిథులు వాదనను అదుపు చేసుకోలేక చివరకు ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. మాటలతో మొదలైన గొడవ కాస్తా పిడిగుద్దులు, కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, ఈ గొడవను ముందుగానే రికార్డ్ చేసిన కార్యక్రమంలో నుంచి తొలగించకుండా, అలాగే ప్రసారం చేయడంపై ఇప్పుడు పెద్ద వివాదం మొదలైంది.

అసలు గొడవ ఎలా మొదలైంది?
ఆర్మేనియాలోని పబ్లిక్ టెలివిజన్ నిర్వహించే 'ది గ్రేట్ డిబేట్' అనే రాజకీయ చర్చా కార్యక్రమం రికార్డింగ్ సమయంలో ఈ ఘటన జరిగింది. ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ బోరిస్ మురాడియన్, రాజకీయ విశ్లేషకుడు హరుత్యున్ మ్క్రిట్చ్యాన్ పాల్గొన్నారు. చర్చ జరుగుతున్న సమయంలో మ్క్రిట్చ్యాన్.. బోరిస్ మురాడియన్ రాజకీయ నిజాయితీ, వ్యక్తిగత ప్రతిష్ఠను ప్రశ్నించారు. అంతేకాకుండా, ఆర్మేనియా మాజీ అధ్యక్షుడు సెర్జ్ సర్గ్స్యాన్‌కు సంబంధించి గతంలో పత్రికల్లో వచ్చిన ఓ లైంగిక ఆరోపణను కూడా ప్రస్తావించారు.

దీనిపై మురాడియన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తనను అవమానించేలా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. ఒకరిపై ఒకరు తీవ్ర పదజాలంతో విమర్శలు చేసుకున్నారు. చూస్తుండగానే పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. ఇద్దరూ ఒకరిపై ఒకరు చేయి చేసుకున్నారు. పిడిగుద్దులు గుద్దుకోవడంతో పాటు కాళ్లతో కూడా తన్నుకున్నారు. దీంతో రాజకీయ చర్చ కాస్తా కొట్టుకునే కార్యక్రమంగా మారిపోయింది.

అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఆగని గొడవ
ఈ కార్యక్రమానికి టటేవ్ డానిలియన్, పెట్రోస్ ఘజార్యన్ వ్యాఖ్యాతలుగా వ్యవహరించారు. ఇద్దరు అతిథులు కొట్టుకోవడం మొదలుపెట్టడంతో వారు వెంటనే సెక్యూరిటీ సిబ్బందిని స్టూడియోలోకి పిలిపించారు. అయితే, సెక్యూరిటీ సిబ్బంది జోక్యం చేసుకున్నప్పటికీ గొడవను వెంటనే అదుపు చేయలేకపోయారని సమాచారం. అప్పటికే స్టూడియోలో పరిస్థితి గందరగోళంగా మారిపోయింది.

గొడవను ఎడిట్ చేయకుండా ప్రసారం చేసిన పబ్లిక్ టీవీ
ఈ ఘటనకు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కాలేదు. ముందుగానే రికార్డ్ చేశారు. అంటే, ప్రసారం చేయడానికి ముందు గొడవ జరిగిన దృశ్యాలను తొలగించే అవకాశం టెలివిజన్ నిర్వాహకులకు ఉంది. కానీ పబ్లిక్ టీవీ మాత్రం ఆ దృశ్యాలను తొలగించకుండా యథాతథంగా ప్రసారం చేయాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని కార్యక్రమ వ్యాఖ్యాత పెట్రోస్ ఘజార్యన్ కూడా వెల్లడించారు. రికార్డింగ్‌లో జరిగిన విషయాలను తాము ఎడిట్ చేసి తొలగించబోమని ఆయన స్పష్టం చేశారు. '1 న్యూస్' కథనం ప్రకారం, గొడవ జరిగిన రెండు రోజుల తర్వాత ఈ కార్యక్రమాన్ని టెలివిజన్‌లో ప్రసారం చేశారు. అయితే, ఇద్దరూ మాట్లాడిన కొన్ని అసభ్య పదాలను మాత్రం బీప్ సౌండ్ ద్వారా మ్యూట్ చేశారు. గొడవకు సంబంధించిన దృశ్యాలను మాత్రం అలాగే ఉంచారు.

►ALSO READ | GTA 5 నుంచి GTA 6 వరకు.. 13 ఏళ్లలో భారత్ ఎంత మారిందో తెలుసా? మోడీ పోస్ట్ వైరల్!

టీవీ యాజమాన్యంపై మండిపడిన నియంత్రణ సంస్థ
ఈ ఘటనను ప్రసారం చేయడంపై ఆర్మేనియా టెలివిజన్ అండ్ రేడియో కమిషన్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. రాజకీయ చర్చల పేరుతో టెలివిజన్‌లో హింసను, అసభ్య పదజాలాన్ని ప్రోత్సహించడం సరైన పద్ధతి కాదని పేర్కొంది. ముఖ్యంగా పబ్లిక్ టెలివిజన్ అంటే ప్రజలకు బాధ్యతాయుతమైన కార్యక్రమాలను అందించాల్సిన సంస్థ అని గుర్తుచేసింది. టీవీ కార్యక్రమాల ద్వారా హింస సాధారణ విషయంగా మారకూడదని, టివి చూసేవాళ్ళని రెచ్చగొట్టేలా లేదా హింసను సమర్థించేలా కంటెంట్ ఉండకూడదని కమిషన్ అభిప్రాయపడింది. ఆర్మేనియాలోని ఆడియోవిజువల్ మీడియా చట్టంలో కూడా హింస, క్రూరత్వాన్ని ప్రోత్సహించే కార్యక్రమాలపై ఆంక్షలు ఉన్నాయని గుర్తుచేసింది.

ఈ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానప్పుడు, ముందుగానే రికార్డ్ చేసిన దృశ్యాలను ఎడిట్ చేసి గొడవను తొలగించే అవకాశం ఉన్నప్పటికీ ఎందుకు అలాగే ప్రసారం చేశారని ప్రశ్నించింది. ఇలాంటి సందర్భాల్లో టెలివిజన్ నిర్వాహకులు తమ వృత్తిపరమైన బాధ్యతను పాటించి ఉండాల్సిందని పేర్కొంది. అయితే, హెట్క్ అనే మీడియా సంస్థ కథనం ప్రకారం.. పబ్లిక్ టీవీపై నేరుగా లైసెన్సింగ్ చర్యలు తీసుకునే అధికారం ఈ కమిషన్‌కు లేదు. ఆ టెలివిజన్ సంస్థను పర్యవేక్షించే బాధ్యత దాని సొంత పాలక మండలికి ఉంటుంది.

ప్రసారకర్త నిర్ణయాన్ని సమర్థించిన మండలి ఛైర్మన్
మరోవైపు, పబ్లిక్ టీవీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రసారకర్తల మండలి ఛైర్మన్ వాసక్ దర్బిన్యాన్ సమర్థించారు. టెర్టమ్‌మీడియా టెలిగ్రామ్ ఛానెల్‌లో స్పందిస్తూ.. కార్యక్రమంలో జరిగిన మొత్తం ఘటనను ప్రసారం చేయడంలో తప్పేమీ లేదని ఆయన అభిప్రాయపడ్డారు. చర్చకు వచ్చిన అతిథులు ఎలా ప్రవర్తించారో ప్రజలకు చూపించడంలో తప్పు ఏముందని ప్రశ్నించారు. వారు స్టూడియోలో చేసిన పనిని టెలివిజన్ దాచిపెట్టాలా? అని ఆయన సమర్థించుకున్నారు. అయితే, రికార్డింగ్ సమయంలోనే వ్యాఖ్యాత డానిలియన్ ఇద్దరు అతిథుల ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రవర్తన వీక్షకులను అవమానించడమేనని వ్యాఖ్యానించారు.

జరిమానా విధించారా?
ఈ ఘటనపై టెలివిజన్ అండ్ రేడియో కమిషన్ అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పటికీ, పబ్లిక్ టీవీకి వ్యతిరేకంగా ఇప్పటివరకు ఎలాంటి జరిమానాను ప్రకటించలేదు. రాజకీయ అంశాలపై చర్చించాల్సిన టెలివిజన్ కార్యక్రమం ఇద్దరు వ్యక్తుల మధ్య కొట్లాటకు వేదిక కావడం ఒక ఎత్తయితే.. ఆ గొడవను ముందుగానే రికార్డ్ చేసిన.. గొడవను తొలగించకుండా ప్రసారం చేయడం మరో వివాదంగా మారింది. ప్రజలకు వాస్తవాలను చూపించాలనే ఉద్దేశంతోనే ఆ దృశ్యాలను ప్రసారం చేశామని టీవీ యాజమాన్యం సమర్థించుకుంటుండగా, హింసను టెలివిజన్‌లో యథాతథంగా చూపించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఇప్పుడు తెరపైకి వచ్చాయి.