ఏడుకొండలను తాకిన ఎల్‌నినో ఎఫెక్ట్.. తిరుమలలో నీళ్లకు తిప్పలు తప్పవా..?

ఏడుకొండలను తాకిన ఎల్‌నినో ఎఫెక్ట్.. తిరుమలలో నీళ్లకు తిప్పలు తప్పవా..?

ఎల్‌నినో ప్రభావంతో తిరుమలలోనూ నీటి కష్టాలు మొదలవుతాయేమోనని భక్తులు ఆందోళన చెందుతున్నారు. నానాటికీ అడుగంటుతున్న జలాశయాలు భక్తుల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. శ్రీవారి దర్శనానికి నిత్యం వేలాది మంది భక్తులు తరలివస్తుండటంతో కొండపై నీటి అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలో రాబోయే వేసవిలో నీటి ఎద్దడి తలెత్తకుండా టీటీడీ ప్రత్యేక చర్యలు చేపడుతోంది.

టీటీడీ అధికారిక సమాచారం ప్రకారం తిరుమలలో భక్తుల రద్దీని బట్టి రోజుకు సుమారు 50 నుంచి 60 లక్షల గ్యాలన్ల నీరు అవసరమవుతోంది. ఇందులో సగం తిరుమలలోని పాపవినాశనం, గోగర్భం, ఆకాశగంగ, కుమారధార, పసుపుధార జలాశయాల నుంచి, మిగిలిన సగం తిరుపతి సమీపంలోని కల్యాణి డ్యామ్ నుంచి సరఫరా చేస్తున్నారు. గతంలో వర్షాభావ పరిస్థితులతో నీటి నిల్వలు తగ్గినా, అక్టోబర్, నవంబర్‌లో కురిసిన వర్షాలతో కొంత ఊరట లభించింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు సుమారు 120 రోజుల అవసరాలకు సరిపోతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. మరోవైపు నీటి పొదుపులో భాగంగా ప్రైవేటు హోటళ్లు, మఠాలు, వాణిజ్య సముదాయాలకు ఉదయం ఒక గంట, సాయంత్రం ఒక గంట మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. అవసరమైతే ప్రైవేటు హోటళ్లు తిరుపతి నుంచి ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.

►ALSO READ | అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. హైదరాబాద్ నుంచి పలు రైళ్లు రద్దు

డిసెంబర్‌లో సమృద్ధిగా వర్షాలు కురిసి జలాశయాలు పూర్తిగా నిండితే 18 నెలల వరకు నీటి అవసరాలకు ఇబ్బంది ఉండదని అధికారులు అంచనా వేస్తున్నారు. వర్షాలు ఆశించిన స్థాయిలో కురవకపోతే కల్యాణి డ్యామ్‌తో పాటు ప్రత్యామ్నాయ నీటి వనరుల ద్వారా సరఫరా పెంచాలని భావిస్తున్నారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. జలాశయాల్లో పూడికతీత, చెక్‌డ్యామ్‌ల నిర్మాణం, ఆటోమేటెడ్ గేట్ల ఏర్పాటు, నీటి లీకేజీల నివారణపైనా దృష్టి సారించాల్సి ఉంది. మొత్తానికి రాబోయే వేసవిలో శ్రీవారి భక్తులకు నీటి ఇబ్బందులు తలెత్తకుండా టీటీడీ ముందస్తు చర్యలు ఎంతవరకు ఫలిస్తాయన్నది ఆసక్తికరంగా మారింది.