అమెరికాకు చెందిన టెక్ కంపెనీ సేల్స్‌ఫోర్స్ భారత్‌లో చేపట్టిన తాజా లేఆఫ్‌ల వివరాలు ఇప్పుడు 'బ్లైండ్' వేదికగా బయటకు వస్తున్నాయి. జాబ్స్ కోల్పోయిన ఉద్యోగులు తమ ఎగ్జిట్ ప్యాకేజీలు, గార్డెన్ లీవ్, పరిహారం వివరాలను పంచుకుంటున్నారు. గార్డెన్ లీవ్ అంటే నోటీసు పీరియడ్‌లో ఉద్యోగిని విధులకు రాకుండా నిలిపివేసి.. జీతం, ఇతర ప్రయోజనాలను యథాతథంగా చెల్లించడం.
ఎంత మంది ఉద్యోగులపై ప్రభావం పడిందనేది స్పష్టంగా తెలియకపోయినా.. వారి పోస్టులు ఆర్థిక, వృత్తిపరమైన సవాళ్లను చూపుతున్నాయి. ఉద్యోగి పనిచేసిన కాలం, ప్రాంతాన్ని బట్టి నిబంధనలు మారే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఒక ఉద్యోగి 'సేల్స్‌ఫోర్స్ లేఆఫ్ (SMTS)' పేరుతో రాసిన పోస్టులో ఎంప్లాయీ రిలేషన్స్ టీం నుంచి మీటింగ్ ఇన్వైట్ రావడంతోనే తనకు అనుమానం వచ్చిందని చెప్పాడు. లీడర్, హెచ్ఆర్‌తో సమావేశం తర్వాత లేఆఫ్ విషయం తెలిసిందని.. దాన్ని జీర్ణించుకోవడం కష్టంగా ఉందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 1 వరకు గార్డెన్ లీవ్‌లో ఉంటానని.. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, ముంబైలో జాబ్ రిఫరల్స్ కోసం చూస్తున్నానని రాశారు. తన వార్షిక వేతనం ఇప్పటివరకు రూ.45 లక్షలుగా ఉందని వెల్లడించారు.
మరో ఉద్యోగి పంచుకున్న వివరాల ప్రకారం.. దాదాపు రెండు నెలల గార్డెన్ లీవ్‌తో పాటు వర్క్ ఎక్స్‌పీరియెన్స్, ప్రాంతాన్ని బట్టి అదనపు వారాల వేతనం అందే అవకాశం ఉంది. కొందరికి సుమారు 21 వారాల ప్యాకేజీ అందినట్లు తెలుస్తోంది. ఇది కొత్త కెరీర్ కోసం ఆలోచించుకోవడానికి కొంత ఆర్థిక ఊరటనిస్తుందని భావిస్తున్నారు. అయితే వీటిపై అధికారికంగా కంపెనీ ఎలాంటి ప్రకటన చేయలేదు ఇప్పటి వరకూ.
ALSO READ : లైవ్‌లో తల్లిని కాబోతున్నట్లు ప్రకటించిన 59 ఏళ్ల టీవీ యాంకర్
భారత్‌తో పాటు ప్రపంచవ్యాప్తంగా సేల్స్‌ఫోర్స్ ఈ వారం కొత్త లేఆఫ్స్ ప్రారంభించింది. ఐటీ కంప్లయెన్స్, కంటెంట్ స్ట్రాటజీ సీనియర్ మేనేజర్ కూడా తమ టీమ్స్‌పై ప్రభావం పడిందని లింక్డ్ఇన్‌లో కన్ఫమ్ చేశారు. అమెరికాలో అర్హులైన ఉద్యోగులకు స్థాయి, అనుభవం, వయస్సు ఆధారంగా 30 వారాల వరకు బేస్ శాలరీ పరిహారంగా అందే అవకాశం ఉంది.
