IPL 2027 Mini Auction: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2027 మినీ వేలానికి సమయం దగ్గరపడుతుండటంతో క్రికెట్ ఒక్కసారిగా హీటెక్కింది. మొత్తం 10 ఫ్రాంచైజీలు కలిసి 89 మంది ఆటగాళ్లను రిలీజ్ చేయగా (34 మంది విదేశీయులు), వేలంలో భర్తీ కానున్న ఖాళీలు కేవలం 66 మాత్రమే (విదేశీ స్లాట్లు 25).. పరిమిత స్థానాలు ఉండటంతో పాటు పలు జట్ల దగ్గర భారీ పర్స్ నిల్వ ఉండటంతో స్టార్ ఆటగాళ్ల కోసం తీవ్ర పోటీ నెలకొంది. ముఖ్యంగా ఫ్రాంచైజీలు రిలీజ్ చేసినప్పటికీ, వేలంలో మళ్లీ భారీ ధర పలికే ఛాన్స్ ఉన్న ఐదుగురు కీలక ఆటగాళ్ల గురించి ఇప్పుడు V6 వెలుగు వెబ్ సైట్ లో తెలుసుకుందాం..
ట్రెంట్ బౌల్ట్– ఫామ్‌లోకి వచ్చిన కివీస్ పేసర్:
ముంబై ఇండియన్స్ రూ.12.50 కోట్ల విలువైన ట్రెంట్ బౌల్ట్ (Trent Boult)ను విడుదల చేసి పర్స్ పెంచుకుంది. ఐపీఎల్ 2026లో ఐదు ఇన్నింగ్స్‌లలో కేవలం 2 వికెట్లు (11.63 ఎకానమీ) మాత్రమే తీయడం, అర్ష్‌దీప్ సింగ్ జట్టులోకి రావడంతో ముంబై ఈ నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత ETPL 2026 లో బౌల్ట్ 9 ఇన్నింగ్స్‌లలో 16 వికెట్లు (టీ20 కెరీర్‌లో తొలి 5 వికెట్ల ఘనతతో సహా) పడగొట్టాడు. దీంతో ఈ నాణ్యమైన లెఫ్ట్ ఆర్మ్ పేసర్ కోసం చూస్తున్న ఢిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ బౌల్ట్ కోసం పోటీపడే ఛాన్స్ ఉంది.
షిమ్రాన్ హెట్‌మయర్– మళ్లీ జోరందుకున్న హిట్టర్:
ఐపీఎల్ 2026లో 7 ఇన్నింగ్స్‌లలో కేవలం 78 పరుగులే (సగటు 13.00) చేయడంతో రాజస్థాన్ రాయల్స్ రూ.11 కోట్ల హెట్‌మయర్ (Shimron Hetmyer)ను వదిలి పెట్టింది. కానీ ఆ తర్వాత అతడు భీకర ఫామ్‌లోకి వచ్చేశాడు. CPL 2026 లో 12 ఇన్నింగ్స్‌లలో 367 రన్స్, అబుదాబి T10లో 60 సగటుతో విధ్వంసం సృష్టించాడు. మిడిలార్డర్ ఫినిషర్ కోసం వెతుకుతున్న గుజరాత్ టైటాన్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లు హెట్‌మయర్ కోసం గట్టిగా పోటీ అవకాశం కనిపిస్తోంది.
మతీశ పతిరణ– ఫిట్‌నెస్ సాధిస్తే జాక్‌పాట్:
గత వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ (KKR) రూ.18 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసిన శ్రీలంక యువ పేసర్ మతీశ పతిరణ (Matheesha Pathirana) గాయాల కారణంగా గత సీజన్‌లో ఒక్క ఇన్నింగ్స్ మాత్రమే బౌలింగ్ చేశాడు. ఆ మ్యాచ్‌లోనూ గాయపడటంతో ఆటకు దూరమయ్యాడు. 23 ఏళ్ల ఈ బేబీ మలింగ వేలం వరకు పూర్తి ఫిట్‌నెస్ సాధిస్తే, డెత్ ఓవర్ల స్పెషలిస్ట్ కోసం చూస్తున్న పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ భారీ బిడ్ వేసే ఛాన్స్ ఉంది.
►ALSO READ | చాహల్ అరుదైన రికార్డు.. టీ20ల్లో 400 వికెట్ల తొలి భారత బౌలర్
ముస్తాఫిజుర్ రెహమాన్– మారిన పరిస్థితులతో మళ్లీ డిమాండ్:
భారత్, బంగ్లాదేశ్ మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతల వేళ బీసీసీఐ సూచన మేరకు కోల్‌కతా నైట్‌రైడర్స్ బంగ్లా పేసర్ ముస్తాఫిజుర్ రెహమాన్ (Mustafizur Rahman)ను రిలీజ్ చేసింది. కానీ, ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు మెరుగుపడటంతో, వేలంలో అతడికి మళ్లీ లైన్ క్లియర్ అయింది. లెఫ్ట్ హ్యాండ్ కట్టర్లు, స్లో బాల్స్‌తో కట్టడి చేసే సామర్థ్యం ఉన్న ముస్తాఫిజుర్ కోసం పలు జట్లు ఆసక్తి చూపించనున్నాయి.
నెహాల్ వధేరా– యువ భారత బ్యాటర్‌పై కన్ను:
పంజాబ్ కింగ్స్ తరఫున ఐపీఎల్ 2026లో 6 ఇన్నింగ్స్‌లలో 65 పరుగులే (సగటు 10.83) చేసిన నెహాల్ వధేరా (Nehal Wadhera)ను ఆ జట్టు విడిచిపెట్టింది. గత సీజన్‌లో నిరాశపరిచినా, యువ భారత బ్యాటర్ కావడంతో వేలంలో అతడికి డిమాండ్ పెరిగే ఛాన్స్ ఉంది. టాప్, మిడిల్ ఆర్డర్ బలోపేతం కోసం చూస్తున్న చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ నెహాల్‌ను తీసుకునేందుకు పోటీ పడే ఛాన్స్ ఉంది.
