రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నాగేశ్వర్ రావు వ్యాఖ్యలు, తనపై జరుగుతున్న ప్రచారంపై కూడా వీసీ సజ్జనార్ స్పందించారు. ఉనికి చాటుకునేందుకు కొందరు తన ఫొటో, పేరును ఉపయోగించుకుంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఎలాంటి ఆధారాలు లేకుండా చేసే ఆరోపణలకు కాలమే సమాధానం చెబుతుందని అన్నారు. తాను ప్రస్తుతం సర్వీసులో ఉన్న అధికారినని, రోడ్డుపైకి వచ్చి గొడవ చేసే పరిస్థితి తనకు లేదని వ్యాఖ్యానించారు. తన పేరు, హ్యాష్‌ట్యాగ్ ఉపయోగిస్తే ప్రచారం వస్తుందనే ఉద్దేశంతో కొందరు ఇలా చేస్తున్నారని అన్నారు.
తెలంగాణ అగ్నిమాపక, విపత్తు స్పందన శాఖ డైరెక్టర్ జనరల్ (డీజీ)గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ బాధ్యతలు స్వీకరించారు. అదనంగా ఎస్పీఎఫ్ విభాగం బాధ్యతలను కూడా ఆయన చేపట్టారు.
ఈ సందర్భంగా వీసీ సజ్జనార్ మాట్లాడుతూ.. తన ఉద్యోగ ప్రస్థానంపై స్పందిస్తూ.. 26 ఏళ్ల సర్వీసులో 20 పోస్టింగ్‌లు వచ్చాయని సజ్జనార్ తెలిపారు. ప్రభుత్వం ఏ బాధ్యత అప్పగించినా అంకితభావంతో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఎలాంటి పోస్టింగ్ ఇచ్చినా వెనుకడుగు వేయకుండా విధులు నిర్వర్తిస్తానని చెప్పారు. రాష్ట్రంలో అగ్నిప్రమాదాల నివారణతో పాటు అత్యవసర సమయాల్లో స్పందించే సమయాన్ని (రెస్పాన్స్ టైమ్) మరింత మెరుగుపరచడంపై ప్రత్యేక దృష్టి సారిస్తామని తెలిపారు.
ఫైర్, ఎస్పీఎఫ్ విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 5 వేల మంది సిబ్బందికి గ్రాండ్ హెల్త్ ఛాలెంజ్ అమలు చేస్తామని వెల్లడించారు. హైదరాబాద్‌లో వేగంగా పెరుగుతున్న హైరైజ్ భవనాలు, పరిశ్రమల్లో అగ్నిమాపక భద్రతపై సమగ్ర ఆడిట్ నిర్వహిస్తామని చెప్పారు. పాత భవనాలు, పాఠశాలలు, ఆసుపత్రులు, హాస్టళ్లలో ఫైర్ సేఫ్టీ నిబంధనలను కఠినంగా అమలు చేస్తామన్నారు.
ALSO READ : నార్సింగ్ లోని హైరైజ్ టవర్స్ లో మంటలు
అగ్నిప్రమాదాలు జరిగినప్పుడు ప్రజలను కూడా భాగస్వాములను చేసేలా ఫస్ట్ రెస్పాండర్ వ్యవస్థను తీసుకొస్తామని తెలిపారు. గత ఏడాది అగ్నిమాపక శాఖ రూ.700 కోట్ల విలువైన ఆస్తితో పాటు 214 మంది ప్రాణాలను కాపాడిందన్నారు.
