అమెరికాలోని న్యూయార్క్‌లో ఒక విషాద ఘటన చోటుచేసుకుంది. హైదరాబాద్‌కు చెందిన 24 ఏళ్ల మహమ్మద్ ఇబ్రహీం అహ్మద్ తన సోదరుడి చేతిలో ప్రమాదవశాత్తు తుపాకీ కాల్పులకు గురై ప్రాణాలు కోల్పోయాడు. నవంబర్ 14న ఈ ఘటన జరగగా, నసావు కౌంటీ పోలీసులు నవంబర్ 17న దీనికి సంబంధించిన వివరాలను వెల్లడించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నవంబర్ 14న అర్ధరాత్రి 12.01 గంటలకు న్యూయార్క్‌లోని హిక్స్విల్ ప్రాంతంలో, 459 సౌత్ బ్రాడ్వే సమీపంలో కాల్పులు జరిగినట్లు పోలీసులకు సమాచారం అందింది. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఓ కారులో వీపుపై తుపాకీ గాయంతో ఉన్న ఇబ్రహీం అహ్మద్‌ను గుర్తించారు.
వెంటనే అతడిని సమీపంలోని ఆసుపత్రికి తరలించగా, అప్పటికే పరిస్థితి విషమించడంతో చికిత్స పొందుతూ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.
ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు కీలక విషయాలను గుర్తించారు. ఇబ్రహీం తన 27 ఏళ్ల అన్న మహమ్మద్ బషీర్ అహ్మద్‌తో కలిసి కారులో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. అన్న దగ్గర ఉన్న పిస్టల్ ప్రమాదవశాత్తు పేలడంతో ఇబ్రహీం వీపులోకి బుల్లెట్ దూసుకెళ్లినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు.
అయితే తుపాకీ ఎలా పేలింది? అది కారులోకి ఎలా వచ్చింది? అనే విషయాలను పోలీసులు ఇంకా వెల్లడించలేదు.
ఈ ఘటనకు సంబంధించి బషీర్ అహ్మద్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అతడిపై హత్యకు కేసుతో పాటు, అక్రమంగా తుపాకీ ఉన్నట్లు మరో కేసు నమోదు చేశారు. కోర్టులో విచారణ సందర్భంగా అతను తనపై వచ్చిన ఆరోపణలను అంగీకరించలేదు. దీంతో అతడిని జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. బుధవారం మరోసారి కోర్టులో హాజరుకావాల్సి ఉంది.
మరోవైపు, ఈ విషాదంతో కుటుంబం తీవ్ర దుఃఖంలో మునిగిపోయింది. ఇబ్రహీం అన్నయ్య లాంగ్ ఐలాండ్ యూనివర్సిటీలో చదువుతున్నట్లు పేర్కొన్నారు. ఈ ఘటనపై కుటుంబ సభ్యులు, బంధువులను సంప్రదించేందుకు ప్రయత్నించిన స్పందన లేదు.
ఈ ఘటన గురించి ఎంబీటీ (MBT) ప్రతినిధి అంజదుల్లా ఖాన్ సోషల్ మీడియా వేదిక Xలో స్పందించారు. హైదరాబాద్ యువకుడి మృతిపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
తుపాకులు చాలా ప్రమాదకరమైనవని, వాటిని వెంట పెట్టుకోవడం, ఉపయోగించడం ఎంతో బాధ్యతతో కూడుకున్న విషయమని ఆయన పేర్కొన్నారు. కాల్పులు ప్రమాదవశాత్తు జరిగిన, వాటి వల్ల ఒక నిండు ప్రాణం పోవడమే కాకుండా, ఓ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
