హోండా కొత్త క్రూయిజర్ బైక్.. క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చొచ్చు.. ధర, ఫీచర్లు నెక్స్ట్ లెవెల్ అంతే !

హోండా కొత్త క్రూయిజర్ బైక్.. క్లచ్ నొక్కకుండానే గేర్లు మార్చొచ్చు.. ధర, ఫీచర్లు నెక్స్ట్ లెవెల్ అంతే !

ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ హోండా  కొత్త క్రూయిజర్ బైక్ రెబెల్ 500ను భారత మార్కెట్లో విడుదల చేసింది. ఈ బైక్‌ను రెండు వేరియంట్లలో అందుబాటులోకి తీసుకొచ్చింది. స్టాండర్డ్ వేరియంట్ ధర రూ.4.50 లక్షలు కాగా, ఇ-క్లచ్ వేరియంట్ ధర రూ.4.90 లక్షలుగా నిర్ణయించింది. ఇవి బెంగళూరులోని ఎక్స్-షోరూమ్ ధరలు.

ఈ బైక్‌ను గతంలోనే భారత మార్కెట్లో ప్రదర్శించిన హోండా.. తాజాగా ధరలను ప్రకటించి అమ్మకాలను ప్రారంభించింది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో రూ.5,000 టోకెన్ అమౌంట్ చెల్లించి బుకింగ్ చేసుకోవచ్చు. హోండా బిగ్‌వింగ్ షోరూమ్‌లలో కూడా బుకింగ్స్ ప్రారంభమయ్యాయి.

తొలిసారి భారత్‌లోనే తయారీ
హోండా రెబెల్ 500 ప్రత్యేకత ఏమిటంటే.. ఈసారి ఈ బైక్‌ను భారత్‌లోనే స్థానికంగా తయారు చేయనున్నారు. గతంలో ఈ మోడల్‌ను పూర్తిగా విదేశాల్లో తయారు చేసి భారత్‌కు దిగుమతి చేసుకునేవారు. ఇప్పుడు CKD విధానంలో విడిభాగాలను భారత్‌కు తీసుకొచ్చి ఇక్కడే అసెంబుల్ చేస్తారు. ఇందులో దాదాపు 50 శాతం విడిభాగాలను దేశీయ తయారీదారుల నుంచే సేకరిస్తున్నారు. అయితే ఇంజిన్ మాత్రం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది. ఈ మార్పు వల్ల కొత్త రెబెల్ 500 ధర కూడా తగ్గింది. గతంలో వచ్చిన మోడల్ ధర రూ.5.12 లక్షలు ఉండగా, ఇప్పుడు స్టాండర్డ్ మోడల్ ధర రూ.4.50 లక్షలకు చేరింది. అంటే దాదాపు రూ.70 వేల వరకు ధర తగ్గినట్లు చెప్పుకోవచ్చు.

బైక్‌లో అదిరిపోయే ఫీచర్లు
కొత్త హోండా రెబెల్ 500లో కొన్ని లేటెస్ట్ ఫీచర్లు ఉన్నాయి. ఇందులో ఎల్ఈడీ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, టీఎఫ్‌టీ డిస్‌ప్లే, హోండా రోడ్‌సింక్ కనెక్టివిటీ వంటివి ఉన్నాయి. వీటితో పాటు టర్న్ బై టర్న్ నావిగేషన్ ఫీచర్ కూడా అందించారు. సేఫ్టీ కోసం ముందు, వెనుక డిస్క్ బ్రేకులతో పాటు డ్యూయల్ ఛానల్ ఏబీఎస్ ఇచ్చారు. అలాగే హోండా సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్ సిస్టం కూడా ఇందులో ఉంది. ఇది రైడింగ్ సమయంలో వెనుక చక్రం జారిపోకుండా కంట్రోల్ చేయడంలో సహాయపడుతుంది.

ఇ-క్లచ్ ప్రత్యేకత ఏమిటంటే?
ఈ బైక్‌లో మరో ఆకర్షణీయమైన ఫీచర్ ఇ-క్లచ్ టెక్నాలజీ. సాధారణంగా బైక్ నడిపేటప్పుడు గేర్లు మార్చడానికి క్లచ్ లివర్‌ను ఉపయోగించాలి. కానీ ఈ ఇ-క్లచ్ సిస్టమ్‌లో క్లచ్ లివర్‌ను నొక్కకుండానే బైక్‌ను స్టార్ట్ చేయవచ్చు, ఆపవచ్చు, గేర్లు మార్చుకోవచ్చు. అయితే అవసరమైతే సాధారణ బైక్‌లగానే క్లచ్ లివర్‌ను ఉపయోగించే అవకాశం కూడా ఉంటుంది. దీంతో రైడర్లకు రెండు విధాలుగా బైక్ నడిపే సౌలభ్యం లభిస్తుంది. ఈ బైక్ మ్యాట్ యాక్సిస్ గ్రే మెటాలిక్, మ్యాట్ డ్యూన్ బ్రౌన్ అనే రెండు రంగుల్లో  లభిస్తుంది.

ఇంజిన్, పవర్ వివరాలు
హోండా రెబెల్ 500లో 471 సీసీ లిక్విడ్ కూల్డ్, ప్యారలల్ ట్విన్ ఇంజిన్ ఉంటుంది. ఈ ఇంజిన్ 8,500 ఆర్పీఎం వద్ద 45.4 బీహెచ్‌పీ పవర్, 6,000 ఆర్పీఎం వద్ద 43.3 ఎన్ఎం టార్క్ అందించే అవకాశం ఉంది. దీనికి 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్ ఇచ్చారు. అయితే పవర్, టార్క్‌కు సంబంధించిన అధికారిక గణాంకాలను హోండా ఇంకా ప్రకటించలేదు. అలాగే బైక్ డెలివరీలు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే విషయాన్ని కూడా వెల్లడించలేదు.

డిజైన్, బరువు, ఇతర వివరాలు
రెబెల్ 500 చూడటానికి ప్రత్యేకమైన బాబర్ స్టైల్ డిజైన్‌తో ఆకట్టుకుంటుంది. తక్కువ ఎత్తులో ఉండే బాడీ, టియర్‌డ్రాప్ ఆకారంలో ఫ్యూయల్ ట్యాంక్, చిన్న టెయిల్ సెక్షన్, రెండు భాగాలుగా ఉండే సీటు దీని ప్రత్యేకతలు.

ఈ బైక్ సీటు ఎత్తు 690mm మాత్రమే. దీంతో తక్కువ ఎత్తు ఉన్నవారు కూడా సులభంగా బైక్‌ను నడిపే అవకాశం ఉంటుంది. దీని బరువు 191 కిలోలు. టైర్ల విషయానికి వస్తే.. ముందు 130/90-16, వెనుక 150/80-16 సైజు టైర్లను అమర్చారు. మొత్తానికి, తక్కువ ఎత్తులో ఉండే క్రూయిజర్ డిజైన్, 500cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, ఇ-క్లచ్ టెక్నాలజీతో హోండా రెబెల్ 500 భారత మార్కెట్లోకి వచ్చింది. దీని ధరలు, ఫీచర్లు క్రూయిజర్ బైక్‌లను ఇష్టపడే వారిని ఆకర్షించేలా ఉన్నాయి.