చెప్పులు వేసుకోవడం మానేసిన విజయ్ ఆంటోని.. కారణం చెబుతూ భార్య ఫాతిమా ఎమోషనల్!

చెప్పులు వేసుకోవడం మానేసిన విజయ్ ఆంటోని.. కారణం చెబుతూ భార్య ఫాతిమా ఎమోషనల్!

దక్షిణాది సినీ ఇండస్ట్రీలో నటుడిగా, సంగీత దర్శకుడిగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న కోలీవుడ్ స్టార్ విజయ్ అంటోని. ము మారన్ దర్శకత్వంలో ఆయన నటించిన చిత్రం 'అప్పా కుట్టి'. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్న భార్య పాతిమా ఆంటోని తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. తన పెద్దకుమార్తె మీరాను గుర్తుచేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు. అంతే కాదు విజయ్ ఆంటోని వ్యక్తిత్వం, కుటుంబంపై ఆయనకున్న ప్రేమ గురించి ఫాతిమా చెప్పిన విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

మీరా మరణం తర్వాత తాను ఎలాంటి సినిమా కార్యక్రమాలకు హాజరుకావడం లేదని ఫాతిమా వెల్లడించారు. దాదాపు పదేళ్ల తర్వాత ఇప్పుడు మళ్లీ ఓ సినిమా వేడుకకు వచ్చానని తెలిపారు. గత కొన్నేళ్లుగా విజయ్ ఆంటోని చెప్పులు, షూస్ ధరించకపోవడం వెనుక ఉన్న కారణాన్ని కూడా ఆమె బయటపెట్టారు. మీరా కోసం గతంలో ఎన్నో చెప్పులు, షూస్ కొనుగోలు చేశామని .. అవన్నీ ఒక గదిలో నిండిపోయి ఉన్నాయని చెప్పారు. వాటిని చూసినప్పటి నుంచి విజయ్ ఆంటోని పాదరక్షలు ధరించడం మానేశారని భావోద్వేగంతో చెప్పారు. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే షూస్ వేసుకుంటారని తెలిపారు.

విజయ్ ఆంటోని దగ్గర ఎన్నో ఖరీదైన వాచీలు ఉన్నప్పటికీ, ఆయన మాత్రం సాధారణమైన ఓ వాచీనే ఎక్కువగా ధరిస్తారు. దానికి కారణం కూడా మీరానే. ఆమె చివరిసారిగా చేతికి ధరించిన వాచీని విజయ్ ఇప్పటికీ తనతోనే ఉంచుకుంటారని ఫాతిమా వెల్లడించారు. ఏడేళ్ల వయసులోనే తండ్రికి దూరమయ్యానని, తనకు తండ్రి ప్రేమను అందించిన వ్యక్తి విజయ్ అని పేర్కొన్నారు.

ఇక 'అప్పా కుట్టి' తండ్రీకూతుళ్ల అనుబంధం నేపథ్యంలో తెరకెక్కింది. ము మారన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విజయ్ ఆంటోని, ప్రీతి అస్రానీ ప్రధాన పాత్రలు పోషించారు. బేబీ లిథాన్య, భగవతి పెరుమాళ్ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. నవంబర్ 20న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా చూసి బయటకు వచ్చాక ప్రతి ఒక్కరూ తమ తండ్రికి ఫోన్ చేసి మాట్లాడాలనిపిస్తుందని విజయ్ ఆంటోని చెప్పారు. మొత్తానికి సినిమా కథలోని తండ్రీకూతుళ్ల అనుబంధం.. విజయ్ కుటుంబ జీవితంలోని జ్ఞాపకాలతో మరింత భావోద్వేగంగా మారింది.