భారత్‌లో క్వాల్కామ్ చేపట్టిన లేఆఫ్స్ ప్రక్రియ కొత్త వివాదానికి తెరలేపింది. ఉద్యోగుల తొలగింపు నిజంగా పనితీరు ఆధారంగా జరిగిందా.. లేక కార్యాలయ రాజకీయాలు, పక్షపాతం ప్రకారం నడిచాయా అనే చర్చ తీవ్రమైంది. సీఈఓ క్రిస్టియానో అమోన్ దీన్ని పనితీరు ఆధారిత పునర్వ్యవస్థీకరణగా సమర్థించుకుంటుండగా.. ఉద్యోగుల 'బ్లైండ్' పోస్టులు మాత్రం మరో కోణాన్ని బయటపెట్టాయి.
అక్టోబర్ 20న అంతర్గత సమాచారంలో అమోన్ మాట్లాడుతూ.. వార్షిక సమీక్షల అనంతరం పనితీరు ఆధారిత కోతలు చేపడుతున్నట్లు స్పష్టం చేశారు. అంచనాలకు తగ్గట్టుగా రాణించని వారితో పాటు మారుతున్న వ్యాపార ప్రాధాన్యతలు, సంస్థాగత అవసరాలు, భవిష్యత్తు నైపుణ్యాలకు అనుగుణంగా తొలగింపు నిర్ణయాలు తీసుకుంటున్నట్లు కంపెనీ వైపు నుంచి వివరణ వచ్చింది.
అయితే బ్లైండ్ అంతర్గత ఏఐ విశ్లేషణ ప్రకారం క్వాల్కామ్ లేఆఫ్స్‌పై జరిగిన చర్చల్లో ఏకంగా 47.7 శాతం మంది ఆఫీస్ పాలిటిక్స్, ఫేవరటిజం గురించి ప్రస్తావించారు. పనితీరు కారణంగా తొలగింపులు జరిగాయని 34.2 శాతం మంది మాత్రమే అభిప్రాయపడ్డారు. మెటాలో 28.6 శాతం, మైక్రోసాఫ్ట్‌లో 28 శాతం, ఊబర్‌లో 21.1 శాతం మంది మాత్రమే ఫేవరటిజంపై మాట్లాడగా.. ఈ విషయంలో క్వాల్కామ్ అగ్రస్థానంలో నిలవటం టెక్ ప్రపంచంలో కలకలం కొనసాగుతోంది. కంపెనీలోని పరిస్థితులపై చర్చ తీవ్రతరం అవుతోంది.
కొందరు మిడిల్ మేనేజర్లు సొంత ఊరు, భాష, గతంలో కలిసి పనిచేసిన వారిని కాపాడుకునేందుకు పక్షపాతం చూపారని పోస్టుల్లో ఆరోపణలు వచ్చాయి. రేటింగ్‌ల పారదర్శకత, హెచ్ఆర్కు కంప్లెయింట్ చేసిన వారిపై ప్రతీకారం, మెటర్నిటీ లేదా మెడికల్ లీవ్‌లో ఉన్నవారి పరిస్థితిపైనా ఆందోళనలు వ్యక్తమయ్యాయి.
ఈ చర్చల్లో 87 శాతం భారత్ నుంచే, 13 శాతం అమెరికా నుంచి వచ్చాయి. భారత్‌లో 62 శాతం క్వాల్కామ్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌కు, 25 శాతం బెంగళూరు బీడీసీకి సంబంధించినవి. భారత్‌లో వెయ్యికి పైగా ఉద్యోగాలపై ప్రభావం పడే అవకాశం ఉందన్న వార్తల మధ్య నవంబర్ 9న బెంగళూరులో లేఆఫ్స్ ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్, ఢిల్లీ-ఎన్సీఆర్, చెన్నై లోని టీమ్స్ పైనా దీని ప్రభావం ఉండవచ్చని సమాచారం.
