హైదరాబాద్‌లో మాంసం, చేపల విక్రయ కేంద్రాల్లో అపరిశుభ్రత, ఆహార భద్రతా నిబంధనల ఉల్లంఘనలపై TG SAFE అధికారులు ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ సేఫ్టీ, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులతో కూడిన 11 ప్రత్యేక బృందాలు నగరంలోని పలు దుకాణాలను తనిఖీ చేశాయి.
ఈ తనిఖీల్లో పలు దుకాణాల్లో విస్తుపోయే అపరిశుభ్ర పరిస్థితులు వెలుగులోకి వచ్చాయి. మాంసంపై పెద్ద సంఖ్యలో ఈగలు వాలుతుండగా, సరైన శానిటేషన్ లేకుండానే మాంసం విక్రయాలు సాగిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. చికెన్ కటింగ్ అనంతరం వెలువడే వ్యర్థాలను నేలపైనే పడేయడం, మాంసం దుకాణాల్లో బొద్దింకలు, ఇతర కీటకాలు సంచరించడం వంటి పరిస్థితులు కనిపించాయి.
కొన్ని దుకాణాల్లో కనీస పారిశుద్ధ్య ప్రమాణాలు కూడా పాటించడం లేదని అధికారులు గుర్తించారు. ముఖ్యంగా ఎలాంటి కవరింగ్ లేకుండా మటన్ మాంసాన్ని బహిరంగంగా వేలాడదీసి విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఇలాంటి అపరిశుభ్ర మాంసం విక్రయాలు ప్రజారోగ్యానికి తీవ్ర ముప్పుగా మారే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.
నిబంధనలు ఉల్లంఘించిన కొన్ని మాంసం విక్రయ కేంద్రాల మూసివేతకు TG SAFE అధికారులు చర్యలు చేపట్టారు. మరికొన్ని దుకాణాలకు షోకాజ్ నోటీసులు జారీ చేయగా, ఇంకొన్ని కేంద్రాలకు పారిశుద్ధ్య ప్రమాణాలు మెరుగుపరచాలని ఇంప్రూవ్‌మెంట్ నోటీసులు అందజేశారు.
మరోవైపు మల్కాజిగిరిలోని AP Fisheries Fish Stallలోనూ అధికారులు తనిఖీలు నిర్వహించారు. సదరు ఫిష్ స్టాల్‌లో ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ లేకుండానే చేపల విక్రయాలు చేస్తున్నట్లు గుర్తించారు. లైసెన్స్ లేకుండా వ్యాపారం నిర్వహిస్తుండగా క్లోజర్ నోటీసు జారీ చేశారు.
ప్రజలకు సురక్షితమైన ఆహారం అందించడమే లక్ష్యంగా TG SAFE అధికారులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఆహార భద్రత, పారిశుద్ధ్య నిబంధనలు పాటించని వ్యాపార సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
